నరనరాన నీరసమేనా?

చంద్రబాబు రాజకీయాన్ని, ఆయన అనుభవాన్ని ఎవరూ తక్కువ చేయాల్సిన అవసరం లేదు, చంద్రబాబు ఇప్పటికీ గండరగండడే. కానీ కాలం, పరిస్థితులు ఎపుడూ అందరి కంటే గొప్పవి. మోడీని [more]

Update: 2019-11-16 15:30 GMT

చంద్రబాబు రాజకీయాన్ని, ఆయన అనుభవాన్ని ఎవరూ తక్కువ చేయాల్సిన అవసరం లేదు, చంద్రబాబు ఇప్పటికీ గండరగండడే. కానీ కాలం, పరిస్థితులు ఎపుడూ అందరి కంటే గొప్పవి. మోడీని ఎదిరించాననుకుని చంద్రబాబు చతికిలపడడమే అందుకు పెద్ద ఉదాహరణ. ఇక ఏపీలో జగన్ జనంలో సీఎం కాలేడని నిబ్బరంగా ఉండడం వల్లనే చంద్రబాబు మాజీ అయ్యారన్నది నిజం. ఆరు నెలల విపక్ష నేతగా చంద్రబాబు ఎంతవరకు రాణించారన్నది పక్కన పెడితే ఆయన పార్టీ సంగతేంటన్నది ఒక్కసారి ఆలోచన చేయాలిపుడు. ఏపీలో చంద్రబాబు జగన్ మీద గట్టిగా పోరాటాలు చేస్తున్నారు. ఆయన ఓడిపోయినా ఎక్కడా తగ్గడంలేదు. 23 మంది ఎమ్మెల్యేలే అనుకోవద్దు మాది పటిష్టమైన పార్టీ. మళ్ళీ బంతిలా పైకి లేచి వస్తామంటున్నారు. బాగానే ఉంది కానీ చంద్రబాబు దూకుడే తప్ప వెనకాల ఏం జరుగుతోందో ఆర్ధం చేసుకుంటున్నారా అన్నదే అసలైన చర్చగా ఉంది.

అక్కడే ఆగిపోయారుగా…..

చంద్రబాబు ఒక్కరే పరుగులు తీస్తున్నారు. అంతా తనను అనుసరిస్తున్నారని అనుకుంటున్నారు. అయితే తమ్ముళ్ళు మాత్రం ఆరు నెలల కిందట భారీ ఓటమి నీడనే ఉండిపోయారు. చంద్రబాబులో ఉన్న గొప్ప లక్షణం వారికి లేదో లేక మాకెందుకీ గోల అనుకుంటున్నారో కానీ సమస్యలను సవాల్ గా తీసుకోవడంలేదంటున్నారు. మొత్తం పార్టీలో చంద్రబాబుతో కలుపుకుని 11 మంది కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా ఇపుడు సైలెంట్ గా ఉన్నారు. మిగిలిన వారైనా హడావుడి చేస్తున్నారా అదీ లేదు. చంద్రబాబు కుడి ఎడమల్లా ఇద్దరు ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మాత్రమే ఉన్నారు. సీనియర్ నేతలు, ఓడిపోయిన వారి సంగతి చెప్పనవసరం లేదు. మరి చంద్రబాబు పార్టీని మళ్ళీ గద్దె మీద నిలబెడతాను అంటున్నారు. కానీ పసుపు తమ్ముళ్ళలో నీరసం నరనరానా పాకిపోయింది.

చక్కబెట్టుకుంటున్నారు…

మరో వైపు కొంతమంది ఎమ్మెల్యే తమ్ముళ్ళు వెచ్చగా ఉన్న చోటకు జెండా ఎత్తేయడానికి అన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఓ వైపు బలమైన వైసీపీ సర్కార్ కి వ్యతిరేకంగా చంద్రబాబు వయసుని కూడా పక్కన పెట్టి మరీ పోరాడుతున్నారు. ఆయన పోరాటం అలా సాగుతూండగానే మరో వైపు ఇతర పార్టీల పెద్దలతో కొంతమంది తమ్ముళ్ళు మంతనాలు జరపడం చూస్తూంటే టీడీపీ ఎటు పోతోందోనని అనిపించకమానదు, ఒక ఎమ్మెల్యే తాను రాజీనామా చేశాను అని చెప్పి పార్టీకి దూరంగా ఉన్నాడు, మరి కొందరు ఎమ్మెల్యేలు పక్క పార్టీల పెద్దలతో విందు రాజకీయాలు నెరపుతున్నారు.

నాయకులు పోయినా పర్లేదా..?

అసలు తాను కాకుండా టీడీపీ తరఫున గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తనను అనుసరిస్తున్నారో చంద్రబాబుకు కచ్చితమైన అంచనాలు ఉన్నాయా అని పార్టీలోనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఎంతమంది తమ్ముళ్ళు పార్టీలో ఉంటారో, ఎందరు వీడిపోతారో కూడా అధినేతకు లెక్కలు ఉన్నాయా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేసే వారు ఉన్నారు. నిజానికి నాయకులు పోయినా ఫరవాలేదు, మళ్ళీ తయారు చేయగలను అని చంద్రబాబు తరచూ అంటారు, ఇపుడు కూడా చంద్రబాబు అలా నాయకులను తయారుచేయగలరేమో కానీ ఆయన వయసు, కాలం ఇపుడు సహకరిస్తాయా. అదీకాక ఇపుడున్న రాజకీయ పరిస్థితులు అందుకు దోహదపడతాయా అన్నది చూడాలి కదా. అందుకే చంద్రబాబూ ఒకసారి వెనక్కి చూడు అంటోంది పార్టీ.

Tags:    

Similar News