చిచ్చు పెడితే చివరికి మిగిలేది..?

ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భావనలను రాజకీయ అవసరాలకు వాడుకోవడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. పొరుగు రాష్ట్రంతో జలజగడంలో ఆంధ్రప్రదేశ్ తలమునకలవుతోంది. రక్షణాత్మక వైఖరిలో పడి కొట్టుమిట్టాడుతోంది. [more]

Update: 2021-07-14 15:30 GMT

ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భావనలను రాజకీయ అవసరాలకు వాడుకోవడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. పొరుగు రాష్ట్రంతో జలజగడంలో ఆంధ్రప్రదేశ్ తలమునకలవుతోంది. రక్షణాత్మక వైఖరిలో పడి కొట్టుమిట్టాడుతోంది. కేసీఆర్ మొండితనంతో ఏపీకి దిక్కు తోచని స్థితి. కనీసం ముఖ్యమంత్రులిద్దరూ కలిసి కూర్చుని చర్చించుకునే వాతావరణం కనిపించడం లేదు. ఈలోపుగానే ఆంధ్రాలో మరో కొత్త గొడవకు తెర లేస్తోంది. రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం జలవివాదాన్ని మరో కోణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. మూడు రాజధానుల అంశంతో టీడీపీకి ముకుతాడు వేశారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు తెలంగాణతో జలవివాదాన్ని ఆసరాగా చేసుకుంటూ రాయలసీమ, ప్రకాశం జిల్లాల సమస్యగా మార్చాలనుకుంటోంది విపక్షం. అదే జరిగితే చివరికి రాష్ట్రంలోనే ఒక ప్రాంతంతో మరో ప్రాంతం ప్రయోజనాలకు వైరుద్ధ్యం ఏర్పడుతుంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా , ప్రాంతీయ విద్వేషాలు రగులుతాయి. అవి పరిష్కరించలేని విధంగా రగులుతుంటాయి.

చంద్రబాబుకు తెలియనిదా..?

పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంటోంది. దాయాది రాష్ట్రంతోనే కాదు, గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టుల్లో సైతం పోరాడేందుకు సిద్దమవుతోంది. తెలంగాణ సీరియస్ గా విభేదిస్తోంది. ఈ పథకం విస్తరణను ఆపాలంటూ గొడవ చేస్తోంది. ఈ వివాదంలో తెలుగుదేశం తొలి దశలో చాలా లౌక్యంగా వ్యవహరించింది. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఈ పథకం వల్ల తమకు నష్టం చేకూరుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులే లేఖలు రాస్తున్నారు. దీనివల్ల పోతిరెడ్డి పాడు పథకం నిర్మాణంపై రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద లేదనే సంకేతాలు వెలువడుతాయి. ఇది కచ్చితంగా కేసీఆర్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది. వైసీపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పార్టీలో పొడ సూపిన ఈ సంకుచిత ధోరణిని నియంత్రించకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు శీతకన్ను వేస్తున్నారు. ప్రకాశం జిల్లా ప్రయోజనాలు , రాయల సీమ అవసరాలు, రాష్ట్ర పథకాలు వేర్వేరు కాదు. ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని చూస్తారు. అందుకే ప్రకాశం జిల్లా టీడీపీ నాయకుల వైఖరిని ఖండించడం లేదనుకోవచ్చు. దీనివల్ల ఇప్పటికే రాయలసీమలో దెబ్బతిని ఉన్న పార్టీ మరింతగా నష్టపోయే అవకాశాలున్నాయి.

అసలుకే మోసం…

రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు అవకాశవాద పోకడలకు తెర తీస్తే తాత్కాలికంగా లబ్ధి చేకూరవచ్చు. కానీ దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అద్రుశ్యం కావడానికి అదే కారణం. టీఆర్ఎస్ తో జట్టుకట్టడం, కాంగ్రెసుతో జట్టు కట్టడం, ఓటుకు నోటుతో ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకోవడం వంటి నిర్ణయాలన్నీ వికటించాయి. అప్పటికప్పుడు ఏదో లబ్ధి చేకూరుతుందనే అత్యాశతో నాయకత్వం ఇటువంటి వాటికి ఒడి గట్టింది. చేదు ఫలితాన్ని చవి చూసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రాంతాల మధ్య చిచ్చుకు కారణమయ్యే అంశాలను పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. ఇది ప్రమాదకరమైన ధోరణి. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఆచితూచి వ్యవహరించాలి. వైసీపీని ఇబ్బంది పెట్టేందుకు అనేక రాజకీయ అంశాలున్నాయి. నీళ్ల నిప్పుతో చెలగాటమాడటం అపాయకరం. దీర్ఘకాలంలో టీడీపీ తలకు చుట్టుకుంటుంది. అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

సీఎం లకూ చికాకులే …

ఆంద్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జనాదరణలో దక్షిణభారత దేశంలో పవర్ పుల్ నాయకులు. కానీ సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్నారు. కేంద్రం చేతికి పగ్గాలు ఇచ్చేలా ఇద్దరూ తెగేదాకా లాగుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ అనుమతులు లేని ప్రాజెక్టులు అనేకం నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కసారి కేంద్రం పెత్తనం చేయడం మొదలు పెడితే రెంటికీ నష్టం వాటిల్లుతుంది. సాధ్యమైనంతవరకూ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడమే మేలు. అంతేకాకుండా ఉప ప్రాంతీయ భావనలకూ ఆస్కారం ఏర్పడుతోంది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి వంటి జిల్లాలలోని అనేక ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కాలేదు. క్రుష్ణా వివాదాల నేపథ్యంలో అడుగు ముందుకు పడటం లేదు. అదే సమయంలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. దీనిని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకునే అవకాశాలున్నాయి. అలాగే జగన్ మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడు పై దృష్టి పెడితే సరిపోదు. పోలవరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. అప్పుడు ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు లేవనెత్తిన సమస్యల వంటివి తలెత్తవు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజి మీదుగా నీటిని తరలించవచ్చు. ముఖ్యమంత్రులు ఇద్దరూ ముందుచూపుతో వ్యవహరించాలి. లేకపోతే జలజగడాలు తమ అధికార పరిధులను దాటిపోయే ప్రమాదం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News