అక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్ చేసుకోవాలిగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీయే వేరు. ఒకచోట మైనస్ లో ఉన్నా, మరోచోట ప్లస్ లోకి పార్టీని తీసుకెళ్లాలని ఆయన ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను అమలు [more]

Update: 2021-07-12 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీయే వేరు. ఒకచోట మైనస్ లో ఉన్నా, మరోచోట ప్లస్ లోకి పార్టీని తీసుకెళ్లాలని ఆయన ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను అమలు చేస్తుంటారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. బలమైన నేతలున్నప్పటికీ జగన్ తీసుకుంటున్న చర్యలతో పార్టీకి ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతూ వస్తుంది. కర్నూలుకు న్యాయరాజధానిగా ప్రకటించడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ ప్రాజెక్టుతో జగన్ కు మరింత గ్రాఫ్ పెరిగింది.

సీమ ఎత్తిపోతల పథకంపై….

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను తనను ఇబ్బంది పెట్టడానికే ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే కనీసం రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ నేతలు కూడా నోరు విప్పకుండా కట్టడి చేయగలిగారు. దీంతో సీమలో టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కు ఆధిక్యత దక్కింది.

జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు….

దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ ను ఇరకాటంలో నెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు జగన్ కు లేఖ రాయడం చంద్రబాబు ఆలోచనే. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేల చేత డిమాండ్ చేయిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలే ఈ లేఖ రాయడం, జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆ జిల్లాలో పార్టీకి కొంత ప్లస్ అయ్యేలా చంద్రబాబు వ్యూహరచన చేశారంటున్నారు.

ప్రకాశంలో టీడీపీ….

గత ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగు స్థానాలు దక్కాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండకుంటే ప్రకాశం జిల్లాకు నీళ్లు రావని, ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ , ఓటు బ్యాంకు ఉండటంతో కనీసం దానినైనా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల చేత లేఖ రాయించారన్న టాక్ వినపడుతుంది. మొత్తం మీద ఒక చోట మైనస్ అయినా మరోచోట ప్లస్ అయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News