బాబు మళ్లీ అతి పెద్ద యూటర్న్

ఇది అందరికీ తెలిసిందే. అయినా కూడా అధికారిక ముద్ర పడాలిగా. ఇపుడు అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏణ్ణర్ధం పాటు కాంగ్రెస్ తో చేసిన తెర ముందూ [more]

Update: 2020-05-29 12:30 GMT

ఇది అందరికీ తెలిసిందే. అయినా కూడా అధికారిక ముద్ర పడాలిగా. ఇపుడు అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏణ్ణర్ధం పాటు కాంగ్రెస్ తో చేసిన తెర ముందూ వెనకా చెలిమికి స్వేచ్చగా స్వస్తివాచకం పలికేసింది. అది కూడా బాహాటంగానే. మోడీ యాంటీ గ్రూప్ లో మేము లేము, ఉండము అంటు చంద్రబాబు పక్కా క్లారిటీగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారనుకోవాలి. తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వీడియో సమావేశం ద్వారా దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో మాట్లాడారు, ఈ మేరకు ఆమె 2019 ఎన్నికల వరకూ తనతో ఉన్న అన్ని విపక్ష రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఆ విధంగా చూసుకుంటే 2019 ఎన్నికల్లో అందరి కంటే అగ్రభాగాన నిలిచి విపక్ష పార్టీలతో గ్రాండ్ అలయెన్స్ కి అంకురార్పణ చేసిన చంద్రబాబు సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ లో ముందుండాలి. కానీ చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. అంతే ఈ మీటింగు కి తనదైన మార్క్ తో డుమ్మా కొట్టారు.

సార్ధకం చేసుకున్నారుగా ….

యూ టర్న్ బాబు అని ఊరకే బిరుదు ఎవరూ ఇవ్వలేదు. అది ఆయనకు సార్ధక నామధేయం. దాన్ని బాబు కూడా ఎప్పటికపుడు పదిలపరచుకుంటూనే ఉన్నారు. గత ఎన్నికలకు ముందు మోడీని నానా మాటలు అనడమే కాదు, సోనియాను, రాహుల్ ని తెగ పొగిడిన చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి జాతీయ నాయకుడిగా అతి పెద్ద విపక్ష నేతగా తనకు తానే చాటుకున్నాడు. ఇక సోనియాతో కలసి కూడా బహిరంగ సభల్లో పాలుపంచుకున్నాడు. చివరి సారిగా సోనియాతో చంద్రబాబు మీట్ అయింది గత ఏడాది మే 19. అంటే ఎన్నికల ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముందు. ఈసారి దాదాపు అవే తేదేల్లో సోనియా విపక్షాలతో మీటింగు పెడితే చంద్రబాబు గాయబ్ అయ్యారంతే.

మోడీ భజనలో…?

మోడీ పేరు తలిస్తే చాలు చంద్రబాబుకు ఇపుడు ఒళ్ళు ఒక్క లెక్కన పులకరింపచేస్తోంది. నిజానికి ఓడిన తరువాత వెంటనే అంటే బాగోదని విశాఖ టూర్లో చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారు. బీజేపీతో విడిపోయి తప్పుచేశానని అలా తొలిసారి అన్నారు. ఆ తరువాత ఆయన మోడీని పొగడడం ప్రారంభించారు. ఎటువంటి వెరపూ, మొహమాటం లేకుండా మోడీని నాడు లగాయితూ అలా కీర్తిస్తూనే ఉన్నారు. మోడీ గ్రేట్ అనేస్తున్నారు. ఒకనాడు ఇదే మోడీని వ్యక్తిగతంగా తాను తిట్టాను అన్న సంగతిని కూడా మరచిపోయి గొప్ప నేత అంటున్నారు. మోడీ ప్రాపకం కోసం చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూసిన వారికి కూడా జుగుప్సగా ఉంటోందని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం లేఖలు రాస్తూ మోడీ దయ కోసం ఎదురు చూస్తున్నారు.

అర్ధమైందా…?

నిజానికి దేశంలోని అనేక పార్టీలు, నాయకులు ఉన్నారు. వారెవరూ 2019 ఎన్నికల ముందు ఎలా ఉన్నారో ఇపుడూ అలాగే ఉన్నారు. తమ రాజకీయ విధానాలు మార్చుకోలెదు, స్టాండ్ కూడా మార్చలేదు. అందుకే సోనియా వీడియో సమావేశానికి ఒక్క చంద్రబాబు తప్ప దేశంలోని 22 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం చాలా సులువుగా కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చేశారు. రాం రాం అనేశారు. ఇదే చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేది. ఆయన రాజకీయ అనుభవం, వయసుని కూడా వెక్కిరిస్తోంది. అయినా చంద్రబాబు మారరంతే. ఆయన ఎపుడూ తన రూటే సెపరేట్ అంటారు. రాజకీయ లాభం కోసమే అడుగులు వేస్తారు. కానీ ఇపుడు దేశ రాజకీయ యవనిక మారుతోంది. అలాగే ఎంత లేవనుకున్నా కూడా సిధ్ధాంతాలు కొంతైనా పాటించే వారికే విలువ కూడా పెరుగుతోంది. చంద్రబాబు మార్క్ ఆయారాం, గయారాం పాలిటిక్స్ కి కాలం చెల్లిపోయింది. కానీ అది గ్రహించే స్థితిలో తెలుగు దేశాధినేత లేకపోవడమే ఆయనకూ, ఆయన పార్టీకి అతి పెద్ద విషాదం.

Tags:    

Similar News