బాబు లో ఈ మార్పునకు కారణమదేనా… ?

చంద్రబాబు తీరు మీద సొంత పార్టీలో ఇపుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా 2014 నుంచి కూడా చంద్రబాబు వైఖరిలో ఒక స్పష్టమైన మార్పుని చూస్తున్నట్లుగా [more]

Update: 2021-06-03 03:30 GMT

చంద్రబాబు తీరు మీద సొంత పార్టీలో ఇపుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా 2014 నుంచి కూడా చంద్రబాబు వైఖరిలో ఒక స్పష్టమైన మార్పుని చూస్తున్నట్లుగా ఆఫ్ ది రికార్డుగా తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. 2014కి ముందు బాబు వేరు అన్నది కూడా వారి భావనట. తొలి తొమ్మిదేళ్ళు చంద్రబాబు నిజంగా చండశాసనుడి మాదిరిగా ఉమ్మడి ఏపీని పాలించారు. నాడు ఆయన వయసులో ఉన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలతోనే పావులు కదిపేవారు. అయితే మధ్యలో రెండు సార్లు ఓటమి తరువాత చంద్రబాబుకు అసలైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక 2009 తరువాత ఇండైరెక్ట్ గా 2014 తరువాత డైరెక్ట్ గాను కుమారుడు లోకేష్ టీడీపీ రాజకీయాల్లోకి వచ్చేశాడు. బహుశా అదే బాబులో మార్పునకు ప్రధాన కారణమైందేమో.

ఈ బాయ్ కాట్ లేంటో..?

రాజకీయాల్లో ఉన్న వారు చివరి దాకా పోరాడాలి. ఓడినా కూడా అవకాశాలు మళ్ళీ వస్తాయి. ఈ సంగతి తానే ఒక పొలిటికల్ యూనివర్శిటీగా మారిన చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బాబు మాత్రం ఈ మధ్య ప్రతీ దానికీ బాయ్ కాట్ మంత్రం జపిస్తున్నారు. ఆ మధ్య జరిగిన పరిషత్తు ఎన్నికలను కూడా చంద్రబాబు బహిష్కరిస్తున్నట్లుగా పిలుపు ఇచ్చి తమ్ముళ్ళకే నచ్చకుండా పోయారు. తాము పోటీకి రెడీ అంటూంటే ఇలాంటి నిర్ణయం ఏంటి బాబూ అంటూ ఏపీలోని పసుపు తమ్ముళ్ళు గట్టిగానే తగులుకున్నారు. చాలా చోట్ల ఆయన్ని ధిక్కరించి మరీ పోటీకి నిలిచారు.

నమస్కారమేనా…?

చంద్రబాబు సభకు నమస్కారం అనడమే విడ్డూరంగా ఉందిపుడు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ని ఆయన బాయ్ కాట్ అనేశారు. ఇది నిజంగా చంద్రబాబు వంటి ఫార్టీ యియర్శ్ ఇండస్ట్రీకి తగని పని అంటున్నారు. చంద్రబాబు రాజకీయాలను శ్వాసిస్తారు. శాసిస్తారు. ఆయన అసెంబ్లీకి ఎపుడూ డుమ్మా కొట్టలేదు. అలాంటిది తాను రాను అనడం అంటే వింతా విడ్డూరమే. దానికి చెప్పిన కారణమే చిత్రంగా ఉంది. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు కాబట్టే తాను రావడంలేదు అని, అయితే ఏపీలో ఒక వైపు కరోనా ఉంది. మరో వైపు బడ్జెట్ అన్నది ఒక రాజ్యాంబద్ధమైన ఆబ్లిగేషన్. దాంతో ఎక్కువ రోజులు సభ జరపమని ఈ టైమ్ లో డిమాండ్ చేయడమూ తప్పే. కానీ చంద్రబాబు ఈ లాజిక్ లేని కారణం చూపించి బాయ్ కాట్ అనడమే విశేషం.

ఎదురుకొడతాయి…?

నిజంగా ప్రజా సమస్యల మీద చిత్త శుద్ధి ఉంటే ఒక రోజు సభ పెట్టినా రావాలి కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. సరే వారి రాజకీయ విమర్శలను పక్కన పెడితే చంద్రబాబు తరచూ ఇలాంటి బహిష్కరణ నిర్ణయాలు తీసుకుంటూ అభాసుపాలు అవుతున్నారు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో బహిష్కరణలు తావు లేదు. మరీ సీరియస్ ఇష్యూస్ ఉంటేనే ఆ ఆయుధం పనికొస్తుంది. చంద్రబాబు ఇలా చేయడం ద్వారా వైసీపీ ముందు నిలవలేకపోతున్నామన్న సందేశాన్ని పిరికి మందుని తమ్ముళ్ళకు పంపిస్తున్నారు అన్న మాట అయితే ఉంది. ఇప్పటికే ఓడి పసుపు శిబిరం వాడిపోయింది. కానీ ఎక్కడ చూసినా తమ్ముళ్ళు ధైర్యంగా పోరాడుతున్నారు. అటువంటి వారి నైతిక స్థైర్యాన్ని కనుక దెబ్బ తీస్తే రేపటి రోజున నిజంగా సర్కార్ మీద వ్యతిరేకత వచ్చినా టీడీపీకి సొమ్ము చేసుకునే చాన్స్ ఉండదు అన్నదే విశ్లేషణ. మరి బాబు అలా ముందుకు పోతామని అంటున్నారు. తమ్ముళ్ళ సంగతేంటో మరి.

Tags:    

Similar News