విజనరీ….ఉల్టా పల్టా …?

చంద్రబాబుకు మరో పేరు విజనరీ. విజయసాయిరెడ్డి లాంటి వారు సెటైరికల్ గా విజనరీ అంటూ హాట్ హట్ కామెంట్స్ చేసినా ఆ పేరుని ఆయన చాలా సార్లు [more]

Update: 2021-05-22 00:30 GMT

చంద్రబాబుకు మరో పేరు విజనరీ. విజయసాయిరెడ్డి లాంటి వారు సెటైరికల్ గా విజనరీ అంటూ హాట్ హట్ కామెంట్స్ చేసినా ఆ పేరుని ఆయన చాలా సార్లు నిలబెట్టుకున్నారు. దేశాన ఏ వైపు రాజకీయ గాలి వీస్తుందో ముందుగానే గమనించి ఆ వైపునకు జారుకునే తత్వం బాబుది. అలా ఆయన వేసుకున్న అంచనాలు కూడ ఎక్కువ సార్లు కరెక్ట్ అయ్యాయి. ఇక 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అసలు గెలవరు అని అంతా అనుకుంటే అటు మోడీని, ఇటు పవన్ని కలిపి గెలిచిన తీరుకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.

టైమ్ పాస్ కేనా …?

చంద్రబాబు ఇపుడు టైమ్ పాస్ పాలిటిక్స్ చేస్తున్నారా అన్న ప్రశ్న ఆయన అభిమానులకు కలిగినా తప్పు వారిది కాదు, బాబుదే. ఎందుకంటే ఆయన ఏ రోజు కా రోజు టాపిక్ ని పట్టుకుని యాగీ చేస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే మీడియా అచ్చేసే ఇచ్చే వార్తలను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు. దాంతోనే జూమ్ యాప్ ద్వారా రెచ్చిపోతున్నారు. జగన్ సర్కార్ ని బాగా నిందిస్తున్నారు. మరుసటి రోజుకు ఆ టాపిక్ అవుట్. కొత్త ఇష్యూతో మళ్లీ చంద్రబాబు రెడీ. ఇలా చూస్తూంటే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ నేతృత్వంలోని ఫార్టీ యియర్స్ టీడీపీకి ఏం కష్టాలు వచ్చాయి బాబూ అనిపించకమానదేమో.

మ్యాటర్ వీకా…?

దేశం నిండా బోలెడు సమస్యలు ఉన్నాయి. కానీ చంద్రబాబుకు మాత్రం పొలిటికల్ సబ్జెక్ట్ పక్కాగా చిక్కడంలేదు. ఆయన మాట్లాడినది గల్లీలోని ఒక లీడర్ మాట్లాడినది ఒకేలా ఉంటోంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ వ్యాక్సిన్ కొనడానికి డబ్బులు లేవా, కేవలం పదహారు వందల కోట్లే కదా ఖర్చు అంటూ జగన్ సర్కార్ ని నిలదీశారు. ఆ మరుసటి రోజు అవే పాయింట్లతో చంద్రబాబు వైసీపీ మీద పడ్డారు. ఇక్కడ విషయం ఏంటి అంటే యావత్తు దేశానికే వ్యాక్సిన్ కొరత. ఆ విషయం దేశమంతా తెలుసు. పోనీ కూన అన్నారంటే సరేనని అనుకుంటే చంద్రబాబు కూడా ఇదే విషయం చెబితే ఎలా అన్నదే వైసీపీ మంత్రుల వాదనగా ఉంది.

అన్నీ గాయబ్…?

గత రెండేళ్ళుగా విపక్ష నేతగా చంద్రబాబు గట్టిగా పోరాడింది దేని మీద అంటే జవాబుకు తడుముకోవాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇసుక సత్యాగ్రహం చేశారు. ఆ తరువాత ఇంగ్లీష్ మీడియం వద్దు అంటూ గర్జించారు. ఆ మధ్యన దేవాలయాల మీద దాడులు అంటూ బిగ్ సౌండ్ చేశారు. ఇపుడు కరోనా వేళ సర్కార్ ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే జనాలు కనెక్ట్ అవుతారని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో అన్నదే తమ్ముళ్ళ వేదన కూడా. ఇక పార్టీ పరంగా ఒక పొలిటికల్ అజెండాను సెట్ చేసి విధి విధానాల ప్రకారం పోరాడాల్సింది చంద్రబాబు లాంటి విజనరీ చేయాల్సిన పని. కానీ బాబు ఏ రోజు కా రోజు కాలక్షేపం బఠాణీలను పేల్చితే టీడీపీ ఎప్పటికి ఎత్తిగిల్లేను అన్నదే పసుపు శిబిరం రోదన. చంద్రబాబు మాత్రం టెంపరరీ ఇష్యూస్ నే పట్టుకుని జగన్ మీద దండయాత్ర చేస్తున్నారు. ఇలాగైతే జగన్ మీద నిజంగా ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా బాబు అండ్ టీమ్ విజన్ కి ఎప్పటికీ కనిపించదు అన్నదే తమ్ముళ్ళ అసలు బాధ.

Tags:    

Similar News