వారిని పట్టించుకోరు.. అయినా కథ నడిపించాల్సిందేనట

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తిగా ముగియడంతో చంద్రబాబు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు. దీనికి తోడు కరోనా వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండటంతో ఏపీకి వచ్చేందుకు పెద్దగా [more]

Update: 2021-05-01 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తిగా ముగియడంతో చంద్రబాబు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు. దీనికి తోడు కరోనా వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండటంతో ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే ఆయన ఏపీకి వస్తున్నారు. మిగిలిన కాలమంతా హైదరాబాద్ లోని తన సొంత ఇంట్లోనే ఉంటున్నారు. జూమ్ యాప్ ద్వారా నేతలతో చంద్రబాబు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు.

టీడీపీ తెలంగాణ నేతలను…..

అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను మాత్రం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని ముగించుకని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. కానీ తెలంగాణ పార్టీ నేతలను కలిసేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. ఇక్కడ పార్టీ నేతలు వరసగా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం, సరైన నేత ఇక్కడ లేకపోవడం, తాను గాని, లోకేష్ గాని ఇక్కడ దృష్టి పెట్టలేకపోవడంతో ఇక ఇక్కడ పార్టీ ఎదగదని ఆయనకు అర్థమయింది.

బాలయ్యను చేయాలనుకున్నా….?

ఒకానొక దశలో బాలకృష్ణను ఇక్కడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావించారట. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా క్యాడర్ నుంచి విన్పిస్తుండటంతో బాలయ్య బాబును తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబు ఆలోచన చేశారంటున్నారు. కానీ బాలకృష్ణ ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు రెండు రాష్ట్రాల్లో అభిమానులున్నారని, ఒక ప్రాంతానికి పరిమితం చేయవద్దని, పైగా తాను హిందూపురంలో శాసనసభ్యుడిగా ఉన్నాడని బాలయ్య సున్నితంగా తిరస్కరించాడంటున్నారు.

పార్టీ ఇక్కడ ఉండటం….

కానీ తెలంగాణలో పార్టీని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మూసివేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. ఒకటి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉండటం, మరొకటి జాతీయ పార్టీగా ఉన్న టీడీపీని అలాగే ఉంచాలని భావించడం. అందుకే తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. జాతీయ పార్టీగా చెప్పుకోవాలన్నా, తమకు ఇతర పార్టీల మద్దతు లభించాలన్నా ఇక్కడ పార్టీ అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పెద్దగా ఖర్చు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయాలని, ఆర్థికంగా బలంగా ఉండి, ఉత్సాహం ఉన్న నేతలనే ఎంపిక చేయాలని చంద్రబాబు నేతలకు చెప్పారట. అంతేతప్ప తనను తరచూ కలసే అవసరం కూడా లేదని వారికి చెప్పారని తెలిసింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ టీడీపీ పోటీ చేయడానికి అదే కారణమంటున్నారు.

Tags:    

Similar News