ఆ రెండూ జరిగితే బాబుని పట్టడం కష్టమే…?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల మీద అందరి చూపూ ఉంది. చంద్రబాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ చమడోడ్చారు అనే అనాలి. ఈ [more]

Update: 2021-04-28 12:30 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల మీద అందరి చూపూ ఉంది. చంద్రబాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ చమడోడ్చారు అనే అనాలి. ఈ వయసులో కరోనా సెకండ్ వేవ్ గట్టిగా ఉన్నా కూడా కసిగా చంద్రబాబు తిరుపతిలో కలియతిరిగారు. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత విపరీతంగా ప్రచారం చేసిన అధినాయకుడు బాబు తప్ప ఎవరూ ఉండరన్నది మాత్రం నిజం. ఆయనతో పోలిస్తే వయసులో చిన్నవాడు అయిన పవన్ ఒక మీటింగుతో సరిపెడితే జగన్ అసలు ప్రచారానికే పోలేదు. దీన్ని బట్టి చంద్రబాబు రాజకీయ ఆకాంక్షల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవాల్సిందే.

కష్టానికి ఫలితం …?

చంద్రబాబు తిరుపతి ఎన్నికల కోసం బాగా కష్టపడ్డారు. ఒక వ్యూహం ప్రకారం దూసుకుపోయారు. పార్టీని మొత్తం తిరుపతికి షిఫ్ట్ చేశారు. తాను సైతం రాత్రీ పగలు తేడా లేకుండా తిరుపతిని చుట్టేశారు. జనాలకు వైసీపీ మీద మోజు ఉండవచ్చు, సంక్షేమ పధకాలు వారిని అటు వైపుగా లాగేయవచ్చు కానీ చంద్రబాబు ఈ వయసులో పడిన కష్టానికి ఆయన తాపత్రయానికి ఏ మాత్రం టర్న్ అయినా చంద్రబాబు చిందించిన చమట చుక్కలకు భారీ ఫలితం దక్కినట్లే. బాబు కోరుకుంటున్నది నెరవేరితే మళ్లీ ఆయన బలంగా పుంజుకున్నట్లే.

అదే టార్గెట్….

తిరుపతిలో చంద్రబాబు గెలిచేస్తాను అని బరిలోకి దిగలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి అయిదు లక్షల ఓట్లు వచ్చాయి. ఇపుడు వాటిని వీలు అయితే మరో లక్ష పెంచుకోవాలి అది తొలి టార్గెట్. ఇక వైసీపీకి వచ్చిన రెండు లక్షల పై చిలుకు మెజారిటీ నుంచి లక్ష ఓట్లు అయినా కత్తెర వేయాలి. మరో వైపు మూడవ ఆల్టరేషన్ అంటూ దూసుకొచ్చిన బీజేపీ జనసేన కనీసంగా పుంజుకోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. ఇదే చంద్రబాబు పట్టుదల. దానికోసమే ఆయన గట్టిగా పనిచేశారు. పార్టీని కూడా పరుగులు పెట్టించారు.

ఊపిరి వచ్చినట్లే…?

చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ బాగా తగ్గితే మాత్రం అది టీడీపీ నైతిక విజయమే అవుతుంది. చంద్రబాబు గట్టిగా ఊపిరి పీల్చుకోవడమే కాదు, మళ్ళీ గాలి పోయిన సైకిల్ కి పంక్చర్ వేసి మరీ పరుగులు పెట్టిస్తారు. అదే సమయంలో తన అయిదు లక్షల ఓట్ల కంటే అదనంగా మరిన్ని ఓట్లు తెచ్చుకుంటే ఇక చంద్రబాబుని పట్టడం కష్టమే అవుతుంది అంటున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల పై చిలుకు తెచ్చుకోవాలని ఆశపడుతోంది. కానీ ఏ యాభై వేల వద్దనో ఆ పార్టీ కూలబడితే ఇక బాబు గాలిలోనే తేలుతారు అంటున్నారు. అపుడు బీజేపీ ఆశలన్నీ గల్లంతు కావడమే కాదు ఏపీ రాజకీయాల్లో మరోమారు పొత్తుకు చంద్రబాబునే ఆశ్రయించాల్సి ఉంటుంది. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో ఇదే జరగాలని టీడీపీ గట్టిగా కోరుకుంటోంది. ఆ విధంగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని మరీ బాబు బరిలోకి దిగారు. తిరుపతి ఫలితాలు ఏపీలో రాజకీయాన్నే మారుస్తాయా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News