తెలుగుదేశంలో మూడో ముఖ్యమంత్రి…?

తెలుగుదేశానికి సర్వం సహా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా రెడీగా ఉన్నారు. ఇక మిగిలిన వారంతా పార్టీకి సుశిక్షితులైన సైనికులు మాత్రమే. మరి వారి [more]

Update: 2021-04-15 14:30 GMT

తెలుగుదేశానికి సర్వం సహా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా రెడీగా ఉన్నారు. ఇక మిగిలిన వారంతా పార్టీకి సుశిక్షితులైన సైనికులు మాత్రమే. మరి వారి నుంచి రాజు ఎవరు అవుతారు. టీడీపీకి మూడవ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎక్కడ నుంచి వస్తారు అన్న ప్రశ్న ఎవరికైనా కలుగవచ్చు. మరి ఎన్టీఆర్ ప్రభ అఖండంగా విరాజిల్లుతున్న వేళ నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాలేదా? అన్న జవాబు కూడా వస్తుంది. అంతే కాదు ఎన్టీయార్ మూడవసారి అధికారంలోకి బంపర్ మెజారిటీతో వచ్చిన మీదట ఆయన ప్లేస్ లో మరొకరిని కలలో కూడా ఊహించని టైమ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం పట్టేయలేదా అన్న మాట కూడా వస్తుంది.

బీసీ కార్డుతో…

ఇక టీడీపీలో చూస్తే అచ్చెన్నాయుడు ఆషామాషీ నేత మాత్రం కాదు. ఆ మాటకు వస్తే వాళ్ల అన్నయ్య, దివంగత నేత ఎర్రన్నాయుడు కూడా అంతటి సామర్ధ్యం ఉన్న నాయకుడే. అందుకే చంద్రబాబు అప్పట్లో ఆయన్ని తెలివిగా జాతీయ రాజకీయాలకు పరిమితం చేసి ఢిల్లీలోనే కొలువుండేలా చేశారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇపుడు అచ్చెన్న చంద్రబాబుకు తలలో నాలుకగా ఉన్నారు. బాబుకి కుడి భుజం. ఆయన మాట జవదాటరు అని కూడా చెబుతారు. అందుకే ఆయన్ని మెచ్చి మరీ బాబు అటు శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవితో పాటు ఇటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చారు. బీసీ కార్డు తో చంద్రబాబు అచ్చెన్నకు లిఫ్ట్ ఇస్తూంటే అదే కార్డు ఫ్యూచర్ లో అచ్చెన్నకు బాగా ఉపయోపడేలా ఉందని అంటున్నారు.

బాబు ఓకే కానీ ….?

తెలుగుదేశంలో తెలియని చిచ్చు ఏదో రగులుతోంది అన్నది అందరికీ తెలిసిందే. నాడు లక్ష్మీ పార్వతి విషయంలో ఎన్టీయార్ పడిన ఇబ్బందులే ఇపుడు లోకేష్ విషయంలో చంద్రబాబు ఎదుర్కొంటున్నారు అని కూడా అంటున్నారు. బాబు మరోసారి సీఎం కావాలని ఇప్పటికే టీడీపీలో అంతా కోరుకుంటున్నారు. ఆయన నాయ‌కత్వాన పనిచేసేందుకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవుట. కానీ ఆయన ప్లేస్ లోకి సీఎం సీటులోకి లోకేష్ వస్తాను అంటేనే పార్టీకి అదే పెను ముప్పుగా మారుతుంది అంటున్నారు. తాజాగా వైరల్ అయిన అచ్చెన్న వీడియోలో ఆయన అసంతృప్తి అంతా లోకేష్ మీదనే అన్నది కూడా వెల్లడైంది అని చెబుతున్నారు.

ఆ నినాదాలకు అర్ధమేంటో…?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి అచ్చెన్నాయుడు వచ్చినపుడు ఆయనకు తిరుపతి ఎయిర్ పోర్టులో బీసీ సీఎం కొందరు పార్టీ నేతలు అతి ఉత్సాహంతో నినాదాలు చేశారని ఆ మధ్య ప్రచారం అయితే సాగింది. మరి దాని వెనక కధా కమామీషూ ఏంటో తెలియదు కానీ టీడీపీలో చంద్రబాబు కనుక వీక్ అయితే లోకేష్ కాదు బీసీ నేతకే ముఖ్యమంత్రి పదవి దక్కాలన్నది పార్టీలో చాలా మంది అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక లోకేష్ నాయకత్వం మీద ఆయన దీక్షా దక్షతల మీద సీనియర్లకు పెద్దగా నమ్మకాలు లేవు అని కూడా అంటున్నారు. పార్టీలో లోకేష్ పెత్తనానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు కూడా ఇక మీదట పెరుగుతారు అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల‌ ఫలితం తేడా కొట్టినా టీడీపీ కి వచ్చే ఓట్లు దారుణంగా తగ్గినా తెలుగుదేశంలో లోకేష్ టార్గెట్ గా రాజకీయ ప్రకంపనలే మొదలవుతాయని అంటున్నారు. మరి అచ్చెన్న ఏ ఆలోచనా లేకుండా అలవోకగా వీడియోలో లోకేష్ మీద కామెంట్స్ చేసి ఉండరు అన్నది కూడా గట్టిగా వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News