హైరిస్క్ లో బాబు.. పార్టీని ముందుకు నడిపేదెలా?

చంద్రబాబుకు రాజకీయాలకు ఉన్న లింక్ అందరికీ తెలిసిందే. ఆయన ఊపిరి రాజకీయం. దానికోసం ఆయన ఏమైనా వదులుకుంటారని అంటారు. అటువంటి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని [more]

Update: 2020-05-24 14:30 GMT

చంద్రబాబుకు రాజకీయాలకు ఉన్న లింక్ అందరికీ తెలిసిందే. ఆయన ఊపిరి రాజకీయం. దానికోసం ఆయన ఏమైనా వదులుకుంటారని అంటారు. అటువంటి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని సైతం పక్కన పెట్టి మరో పది పదిహేను సంవత్సరాలు క్రియాశీల రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. వీలైనన్నిసార్లు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని, అదృష్టం బాగుంటే ప్రధాని పీఠానికి గురి పెట్టాలని ఇలా చంద్రబాబులో ఎన్నో రాజకీయ ఆశలు ఉన్నాయి. అటువంటి బాబును ఒక్కసారిగా రాజకీయాల నుంచి విరమించుకుని ఇంట్లో కూర్చోమంటే అసలు కూర్చోరు. ఇది అందరికీ తెలిసిన మాట. కానీ ఇపుడు చెబుతున్నది ఎవరో కాదు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కంటికి కనబడని శత్రువు కరోనా వైరస్. దాని ముందు రాజకీయ గండరగండలు అయినా వారెందరో తోక ముడిచారు.

ష‌ష్టిపూర్తి బ్యాచ్…

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ష‌ష్టిపూర్తి బ్యాచ్ నిండుగా ఉన్న ఓల్డెస్ట్ పార్టీ అని సెటైర్లు వేస్తారు. అందులో ఉన్న నాయకులు అంతా అన్న ఎన్టీఆర్ పిలుపు అందుకుని కొత్తల్లో పార్టీలోకి వచ్చారు. వారంతా అప్పట్లో మూడు పదులు కూడా నిండని ముక్కుపచ్చలారని యువకులే. కానీ ఇపుడు మాత్రం అందరూ అరవైలు దాటిపోయి వయో వృద్ధులుగా ఉన్నారు. ఇక అధినాయకుడు చంద్రబాబు 71 ఏళ్ళ వయసులో ఉన్నారు. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ వృధ్ధుల మీదనే ఎక్కువగా పగపట్టింది. దాంతో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వృధ్దులకే తగులుతుందని అంటున్నారు. దాంతో టీడీపీలో టాప్ రేంజి లీడర్లంతా ఇకపైన ఇంట్లోనే ఉండాలని కరోనా శాసిస్తోంది.

బాబు అంతేనా…?

చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన కరోనా మహమ్మారికి మందు కనిపెట్టేంతవరకూ బయటకు రాలేరని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు వయోవ్రుధ్ధుడు కావడమే కాదు ఆయనకు బీపీ, సుగర్స్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు ఇంటిపట్టున ఉండి రాజకీయాలు చేసే రకం కాదు. ఆయన ఎపుడూ జనంలో ఉండే మనిషి. ఏదో కార్యక్రమం పెట్టుకుని మరీ జిల్లాల టూర్లు వేస్తూంటారు. అలాగే ప్రతీ రోజూ కార్యకర్తతో భేటీలు పెడుతూ ఉంటారు. పార్టీ నాయకులను కూడా కలుసుకుంటూ ఉంటారు. ఇపుడు కరోనా వేళ ఈ పనులు ఏవీ చంద్రబాబు అసలు చేయకూడదు. ఎందుకంటే హై రిస్క్ ఉంటుంది కాబట్టి. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉండిపోయారు. లాక్ డౌన్ సడలించినా బాబు ఇదివరకు మాదిరిగా అమరావతి రాలేర‌ని అంటున్నారు.

గతేంకాను….?

చంద్రబాబే సర్వం సహా అయిన టీడీపీకి చంద్రబాబు ఎక్కడో కూర్చుని ఆర్డర్లు వేస్తే కదిలే పరిస్థితి ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. నిజానికి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత నుంచి పార్టీ నేతలలో మునుపటి జోష్ లేదు పార్టీ కార్యక్రమాలు మొత్తం పడకేశాయి. చంద్రబాబు తాను స్వయంగా హాజరైన ఇసుక సత్యాగ్రహం లాంటి అనేక కార్యక్రమాలకు సీనియర్లు డుమ్మా కొట్టారు. అలాంటిది చంద్రబాబు వెనక ఉండి పార్టీని కదపాలని చూస్తే జరిగేపనేనా అంటున్నారు. చంద్రబాబు కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోకపోతే మాత్రం టీడీపీ ఇంకా కుంగిపోవడం ఖాయమని అంటున్నారు. చంద్రబాబుకు కూడా ఇది ఇబ్బందికరమే జనంలోకి రావాలని ఉన్నా కరోనా భయం పట్టిపీడిస్తోంది. ఇక సీనియర్ నేతలంతా కూడా వరసగా ఇళ్ళలోకే లాక్ అయిపోతే టీడీపీ గతీ, గత్యంతరం ఏంటి అన్నది ఊహించుకోవడానికే బెంగగా ఉందని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News