చంద్రన్న లక్ష్మణ రేఖ…?

తెలుగుదేశం పార్టీ తెరవెనక మంతనాలను షురూ చేసినట్లు పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈమేరకు ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధినేత అధికార ప్రతినిధులకు, పొలిట్ బ్యూరో [more]

Update: 2021-04-08 06:30 GMT

తెలుగుదేశం పార్టీ తెరవెనక మంతనాలను షురూ చేసినట్లు పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈమేరకు ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధినేత అధికార ప్రతినిధులకు, పొలిట్ బ్యూరో సభ్యులకు విస్పష్టమైన సంకేతాలే పంపించారంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ని మాత్రమే ప్రత్యర్థిగా చూడాలని , అవసరాన్ని బట్టి ఇతరులతో సర్దుకుపోవాలనేది చంద్రబాబు నాయుడి మాటల సారాంశంగా చెబుతున్నారు. ఇందులో రెండు రకాల వ్యూహాలు దాగి ఉన్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. నేరుగా ఫోకస్ పెడితే తప్ప వైసీపీ మీద పోరాటం చేయడం సాధ్యం కాదనేది చంద్రబాబు నాయుడి ఆలోచన. మరోవైపు భవిష్యత్తులో రాష్ట్రంలోని రాజకీయ శక్తులు అన్నీ కలిస్తే తప్ప కనీస పోటీ ఇవ్వడం కూడా సాధ్యం కాదన్నది వాస్తవం. దానిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ రాజకీయ సమీకరణలకు క్యాడర్ ను, నాయకులను సిద్ధం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2014, 2019 నాటి బలం తెలుగుదేశానికి ప్రస్తుతం లేదు. 2014లో మోడీ, పవన్ ల తో కూడిన తెలుగుదేశం అజేయంగా కనిపించింది. 2019లో అధికారంలో ఉండటం వల్ల ఓటమి చవిచూసినా 39శాతం వరకూ ఓట్లు తెచ్చుకోగలిగింది. ఇప్పుడు దానికి భిన్నమైన వాతావరణం ఏర్పడింది. అధికార , ప్రతిపక్షాల మధ్య ఓటింగ్ లో అంతరం చాలా ఎక్కువగా ఉంది. అది మరింతగా పెరుగుతూ వస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీ వైపు కాకుండా బీజేపీ,జనసేన వైపు క్రమేపీ మళ్లుతున్నాయనేది ఒక అంచనా. అదే నిజమైతే పవన్, మోడీలతో కలిస్తే తప్ప ఎన్నికల గోదాలో దిగడం టీడీపీకి కష్టమవుతుంది. అందుకే ఇకపై పవన్ ను, మోడీని పల్లెత్తు మాట అనవద్దంటూ నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పేసినట్లు ప్రచారమవుతోంది.

జనసేనతో జగడం..

జనసేన పార్టీకి దూరం కావడం వల్ల జరిగిన నష్టం ఏమిటో తెలుగుదేశానికి తెలిసి వచ్చింది. 2014లో సీట్లు కోరకుండా స్వచ్ఛందంగా సహకరించిన పవన్ కల్యాణ్ ను అనేక విషయాల్లో టీడీపీ దూరం పెట్టింది. అదే సమయంలో బీజేపీని కూడా దూరం చేసుకుంది. ఫలితంగా అత్యధికంగా నష్టపోయిన పార్టీగా మిగిలిపోయింది. జనసేనతో జగడం ఇకపై ఉండదని అధినేత చంద్రబాబు నాయకులకు చాలా స్పష్టంగానే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను ఏ విషయంలోనూ వేలెత్తి చూపవద్దని అనధికారికంగా ఆదేశాలిచ్చారంటున్నారు. ప్రత్యేక హోదా , విశాఖ ఉక్కు విషయంలో జనసేనను డిమాండ్ చేయాలని కొన్ని వర్గాల నుంచి ఒత్తిడులు వస్తున్నాయి. దానివల్ల రాష్ట్రంలో టీడీపీకి కలిగే ప్రయోజనం శూన్యం. జనసేనకు మరింత దూరం అవుతుంది. 22 మంది ఎంపీలున్న వైసీపీ మాత్రమే ఈవిషయంలో చొరవ తీసుకోవాలి. ఇప్పటికే టీడీపీ చేయాల్సినదంతా చేసింది . ఇకపై జనసేనను మిత్రపక్షంగానే భావించే అవగాహనతోనే ముందడుగు వేయాల్సి ఉంటుందని అధినేత నూరిపోశారు. జనసేన ద్వారా మరోసారి రాష్ట్రంలో పొత్తుకు మార్గం సుగమం చేసుకోవడమే ఈ మైత్రీ సందేశాలకు కారణంగా చెప్పవచ్చు.

కమలంతో కయ్యం..

బీజేపీ నాయకులు టీడీపీ పట్ల ఆగ్రహంగానే ఉన్నారు. స్నేహ పూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు వీల్లేదని చెప్పేస్తున్నారు. రెండు ,మూడు సందర్భాల్లో ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖలు రాశారు. ఏమాత్రం సానుకూల వైఖరి వ్యక్తమైనా , స్వయంగా కలిసేందుకు ప్రయత్నించవచ్చనుకున్నారు. కానీ అట్నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రాలేదు. తీవ్ర నిరాశకు గురయ్యారు చంద్రబాబు. స్థానిక బీజేపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడిపైనే గురి పెడుతున్నారు. టీడీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ఎత్తు వేస్తున్నారు. జగన్ ఓటు బ్యాంకులో ఉన్న రెడ్డి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ఓట్లు తమకు లభించడం సాధ్యం కాదు. అందువల్ల టీడీపీ కి ఎంతో కొంత లాయల్ గా ఉన్న బీసీ ఓట్లను లాగేయాలనేది బీజేపీ వ్యూహం. పవన్ కల్యాణ్ మద్దతుతో కాపు సామాజిక వర్గం ఓట్లు, టీడీపీ బలహీనత కారణంగా బీసీ ఓట్లు సమకూరితే బీజేపీ బలపడుతుందనేది ఆ పార్టీ నాయకుల ఆలోచన. అందుకే లోకల్ లీడర్లు చాలా సీరియస్ గా విరుచుకుపడుతున్నారు. ఈవిషయంలో కూడా సర్దుబాటు ధోరణినే అనుసరించాలని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. బీజేపీ నేతల విమర్శలకు సాధ్యమైనంత వరకూ వివరణ ఇచ్చేందుకే పరిమితం కావాలనేది టీడీపీ అధినేత సూచన. బీజేపీ అగ్రనాయకులను, కేంద్ర నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకూడదని తమకు సూచనలు అందినట్లు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా వంటి అంశాల్లోనూ పరిధులు దాటకూడదనేది టీడీపీ తాజాగా గీచుకున్న లక్ష్మణ రేఖ.

మనోగతం.. మధ్యేమార్గం..

ప్రజల్లో పలుకుబడి కోల్పోయి అస్తిత్వ పోరాటం చేస్తున్న వామపక్షాలు టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నాయి. ముఖ్యంగా సీపీఐ సైకిల్ పై ప్రయాణం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. సీపీఎం ను కూడా తమతో తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వామపక్షాల వల్ల తమకేం పెద్దగా ప్రయోజనం ఉండదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే అయిదు నుంచి పది వేల ఓట్లు వామపక్షాలకు లభిస్తున్నాయి. అవి గెలుపోటములను ఎక్కడా నిర్దేశించలేకపోతున్నాయి. వామపక్షాలకు చేరువగా ఉండి జనసేన, బీజేపీలకు కంటగింపుగా మారడం అనవసరమని టీడీపీ బావిస్తోంది. అందువల్ల వామపక్షాలతో వ్యూహాత్మక మైత్రి మాత్రమే ఉండాలి. అధికారికంగా పొత్తుల జోలికి పోకూడదనుకుంటున్నారు. ఏదేమైనా గాలివాటం రాజకీయాల్లో చేయి తిరిగిన చంద్రబాబు నాయుడు , పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు మారుస్తారని దిగువ శ్రేణి నాయకులు గుసగుసలు పోతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News