బాబు ఇప్పుడు తప్పించుకున్నా… ఫ్యూచర్ లో ఇబ్బందేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. అయితే అక్కడక్కడ అసంతృప్తి కొంత [more]

Update: 2021-04-16 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. అయితే అక్కడక్కడ అసంతృప్తి కొంత విన్పిస్తున్నా వారంతా పార్టీని వీడి వెళ్లిపోయేవారు కాదు. తమ క్యాడర్ ను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి రాజు వంటి నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసి ఉండవచ్చు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇదే పరిస్థిితి ఉన్నా నేతలెవ్వరూ బయటపడలేదు.

నాయకత్వంపై నమ్మకం….

అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇది మచ్చగానే మారుతుంది. కిందిస్థాయి క్యాడర్ కు చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం పోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. అయితే అధికార పార్టీకి భయపడి అసలు పోటీ చేయకపోవడమే భారీ తప్పిదమని నేతలు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

ఏ నిర్ణయం తీసుకున్నా…..

చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను అనుకున్నదే చేస్తారు. అయితే దానికి ముందు డ్రామా నడుస్తుంది. అనుకూల పత్రికల ద్వారా తన నిర్ణయాన్ని లీకులుగా వదులుతారు. పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మమ అనిపించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో చంద్రబాబు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో అనేక మంది తాము పోటీ చేయాలని భావిస్తున్నామని చెప్పినా చంద్రబాబు పోటీకి విముఖత చూపారు.

భవిష‌్యత్ లో ఇబ్బందేనట….

అయితే ఇది భవిష్యత్ లో పార్టీకి ఇబ్బంది అవుతుందంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పార్టీని అంటిపెట్టుకుని వారు ఉంటారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారు కీలక భూమిక పోషిస్తారు. ఎమ్మెల్యేలు గెలవాలన్నా వీరి పాత్ర కూడా కీలకమే. అయితే ఇప్పుడు పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో టీడీపీ క్యాడర్ మరింత నైరాశ్యంలోకి వెళ్లిందంటున్నారు. చంద్రబాబు చేస్తున్న వరస తప్పులు పార్టీని మరింత డ్యామేజీ చేసేలా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావాలను అంచనా వేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్న వాదనలను పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News