సీబీఎన్ ఆర్మీ రంగంలోకి దిగిందట.. ఇక సినిమాయే

తిరుపతి ఉప ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మంకగా తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. తన ప్రచారాని కంటే క్షేత్రస్థాయిలో వైసీపీని అడ్డుకునేందుకే [more]

Update: 2021-04-14 11:00 GMT

తిరుపతి ఉప ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మంకగా తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. తన ప్రచారాని కంటే క్షేత్రస్థాయిలో వైసీపీని అడ్డుకునేందుకే ప్రయత్నం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇందుకు సీీబీఎన్ ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో సీబీఎన్ ఆర్మీ ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు మహానాడు వంటివి జరిగినప్పుడు సీబీఎన్ ఆర్మీ సేవలందిస్తుంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో….

సీబీఎన్ ఆర్మీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో సీబీఎన్ ఆర్మీ సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం పాలవ్వడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని వెనక్కు నెట్టి రెండో స్థానానికి రావాలని బీజేపీ, జనసేన కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది.

మూడోస్థానానికి పడిపోతే….?

తిరుపతి ఉప ఎన్నికలలో టీడీపీ మూడో స్థానానికి పడిపోతే ఇక పార్టీని కాపాడటం ఎవరి వల్లా కాదు. అందుకే చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 70 మంది నేతలను ఇన్ ఛార్జులుగా నియమించారు. మండలాల వారీగా నమ్మకమైన నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. దీనికి తోడు తిరుపతి ఎన్నిక కోసం సీనియర్ నేతలతో సమన్వయ కమిటీని కూడా చంద్రబాబు ఇటీవల నియమించారు.

వాలంటీర్లకు దీటుగా….

వైసీపీకి అండగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు ధీటుగా సీబీఎన్ ఆర్మీ రంగంలోకి దిగనుంది. యాభై కుటుంబాలకు ఒకరి చొప్పున సుశిక్షితులైన కార్యకర్తను చంద్రబాబు నియమించనున్నారు. వీరు వాలంటీర్ల బెదిరింపులను అడ్డుకోవడమే కాకుండా, పార్టీ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వీరి సేవలను చంద్రబాబు వినియోగించుకోనున్నారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News