బాబు అసలైన రాజకీయం అప్పుడు స్టార్ట్ ?

చంద్రబాబు మౌన మునిలా ఉన్నారు. బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు, జాతీయ స్థాయిలో మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా దారుణంగా పడిపోతున్న వేళ చంద్రబాబు లాంటి సీనియర్ పెదవి [more]

Update: 2021-04-23 12:30 GMT

చంద్రబాబు మౌన మునిలా ఉన్నారు. బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు, జాతీయ స్థాయిలో మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా దారుణంగా పడిపోతున్న వేళ చంద్రబాబు లాంటి సీనియర్ పెదవి విప్పితే ఆయన రాజకీయానికే మేలు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ బాబు మాత్రం నోరు మెదపడంలేదు. దానికి కారణం ఆయన లెక్కలు ఆయనకు ఉండడమే. ఎపుడు సౌండ్ చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు అని ఆయన ఆంతరంగీకులు అంటున్నారు.

పీకల దాకా కోపమే…

చంద్రబాబుకు బీజేపీ మీద చాలానే కోపం ఉందని ప్రచారంలో ఉంది. అది ఈనాటికి కూడా కాదు, 2014లో తనతో పొత్తు పెట్టుకుని కూడా మరో వైపు జగన్ ని ప్రోత్సహించారని, ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి బీజేపీ పెద్దల తెర వెనక సాయమే కారణమని బాబు గట్టిగా భావిస్తారు. నిజానికి చంద్రబాబు సీఎం అయ్యాక జగన్ కి జైలు ప్రాప్తి ఖాయమని కూడా పెద్ద ఎత్తున తమ్ముళ్ళు చెప్పుకున్నారు. కానీ జరిగింది వేరు. చంద్రబాబు కోరికను కేంద్ర పెద్దలు మన్నించలేదు అని కూడా అంటారు. అలా చంద్రబాబుకు జగన్ ని ఎదురు నిలిపి మరీ రాజకీయ సయ్యాటకు తెర తీశారు అని కూడా అంటారు.

నోరే వీపుకు చేటు…..

నోరా వీపుకు చేటు అని ఒక ముతక సామెత ఉంది. అది చంద్రబాబుకు బాగా కంఠతా వచ్చు. అందుకే ఆయన నోరు విప్పి ఒక్క మాట కూడా బీజేపీకి వ్యతిరేకంగా అనడంలేదు. పైగా వీలు దొరికినపుడల్లా బీజేపీ పెద్దలను తెగ పొగుడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఇపుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరో మూడేళ్ల పాటు వారి అధికారానికి ఎక్కడా ఢోకా లేదు. మోడీ సంగతి కూడా చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన తలచుకుంటే ఇబ్బందులు నేరుగా నట్టింట్లోకే అలా నడచుకుంటూ వచ్చేస్తాయి. అందుకే సేఫ్ జోన్ లో ఉండాలంటే బీజేపీ విషయంలో ఫుల్ సైలెంట్ అవడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారుట.

అదే ముహూర్తంగా….

ఇక చంద్రబాబుకూ తనవైన రోజులు వస్తాయని అంటున్నారు. ఆ రోజులు 2023 తరువాత మొదలవుతాయని కూడా అంటున్నారు. అలా రోజులు మారిన నాడు చంద్రబాబు బీజేపీ మీద మోడీ మీద పవర్ ఫుల్ బాణాలే వేస్తారు అంటున్నారు. అంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు అసలైన రాజకీయం స్టార్ట్ అవుతుంది అన్న మాట. మళ్ళీ ఢిల్లీ టూర్లు కూడా ఉంటాయన్న మాట. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద గొంతు చేసేది కూడా అపుడే అంటున్నారు. ఇప్పటికే బీజేపీ, మోడీ గ్రాఫ్ సగానికి సగం పడిపోయినట్లుగా విశ్లేషణలు ఉన్నాయి. మరో రెండేళ్ళకు అవి ఇంకా దారుణంగా పతనావస్థకు చేరుతాయి. అపుడు కనుక చంద్రబాబు కొత్త జాతీయ కూటమి పేరిట వంటకం మొదలుపెడితే అది బ్రహ్మాండమైన రుచితో అందరినీ నచ్చుతుంది అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఇపుడిలా బీజేపీ వైపు ఉన్నట్లు కనిపిస్తున్నా ఆయన ఫ్లేట్ ఫిరాయించడం ఖాయమనే ఎరిగిన వారు అంటున్న మాట. మరి ఈ సంగతి ఢక్కామెక్కీలు తిన్న బీజేపీ పెద్దలకు తెలియదా. చూడాలి మరి వారి యాక్షన్ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News