అనవసరంగా దిగామా? అంచనా వేయలేక పోయామా?

మొన్నటి వరకూ ఎన్నికలు వస్తే సత్తా చూపుతామని సవాల్ విసిరే వారు. ఓడిపోతే రిఫరెండంగా భావిస్తారా? అని ఛాలెంజ్ లు విసిరే వారు. కానీ పంచాయతీ, మున్సిపల్ [more]

Update: 2021-04-01 00:30 GMT

మొన్నటి వరకూ ఎన్నికలు వస్తే సత్తా చూపుతామని సవాల్ విసిరే వారు. ఓడిపోతే రిఫరెండంగా భావిస్తారా? అని ఛాలెంజ్ లు విసిరే వారు. కానీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు ఛాలెంజ్ లు పక్కన తీసి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావాలనుకుని వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమిని చవి చూశారు. అనుకోకుండా వచ్చిన తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు.

వెంటనే అభ్యర్థిని ప్రకటించి…

తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక తధ్యమని తేలిపోయింది. సంప్రదాయంగా మృతి చెందిన వారి స్థానంలో మరే పార్టీ పోటీ పెట్టదు. కానీ జగన్ పైనా, ఆయన పాలనపై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు తాము పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. అంతేకాదు అప్పటికప్పుడు తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు…..

ఇదంతా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగక ముందు పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు అంచనాలు వేరేగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని చంద్రబాబు భావించారు. అన్నా క్యాంటిన్లు తీసివేయడం, మద్యం బ్రాండ్లు, ఇసుక కొరత, కరోనా వేళ ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి కారణాలు జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయని చంద్రబాబు ఊహించారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలకు సై అన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయమని వైసీపీ కోరితే ఓటమి భయంతోనే వెనకడుగు వేస్తున్నారని కవ్వించారుకూడా.

మరో ఓటమితో మరింతగా…..

ఇప్పుడు జగన్ పై వ్యతిరేకత లేదన్నది స్పష్టంగా తెలిసింది. దీంతో తిరుపతి ఉప ఎన్నికకు ఎందుకు అభ్యర్థిని బరిలోకి దించామా? అని చంద్రబాబు తలలు పట్టుకుంటున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఇన్ ఛార్జులపై అక్కడ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిన ఊపు మీద ఉండటం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటంతో గెలవడం కష్టమని తెలిసినా పార్టీకి ఊపు తేవడం కోసం అప్పట్లో అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం మరో ఓటమితో క్యాడర్, నేతలు మరింత డీలా పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News