బాబు ఆక్రోశంలో కొత్త ఎత్తుగడ..?

చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అనేక రికార్డుల సృష్టి కర్త. గడచిన రెండున్నర దశాబ్దాల్లో ఇక్కడి రాజకీయాల పరిణామ క్రమంలో ఆయనొక మలుపు. చేసిన పనుల్లో [more]

Update: 2021-03-13 15:30 GMT

చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అనేక రికార్డుల సృష్టి కర్త. గడచిన రెండున్నర దశాబ్దాల్లో ఇక్కడి రాజకీయాల పరిణామ క్రమంలో ఆయనొక మలుపు. చేసిన పనుల్లో కొన్ని మంచికి తోడ్పడ్డాయి. మరికొన్ని చెడుకు బాటలు వేశాయి. ప్రతి అంశాన్ని పార్టీ ప్రయోజనాల కోణంలో ముడిపెట్టి నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. అధికారం కోసం ఎవరితోనైనా చెలిమి చేస్తారు. అవసరమైతే ఎవరినైనా దూరం పెడతారనేది ఆయనపై చెరగని ముద్ర. ఇప్పుడు ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఒకానొకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పినా చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే ప్రస్తుతం ఆదరణ కరవైంది. 2004 నుంచి 2014 వరకూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఇమేజ్ కు పెద్దగా డ్యామేజీ ఏర్పడలేదు. ఇప్పుడున్నంత రాజకీయ దీనస్థితి ఆయన పొలిటికల్ కెరియర్ లో ఎన్నడూ లేదు. అందుకే చంద్రబాబు ప్రజలపై విరుచుకు పడుతున్నారు. తాను చేసిన పొరపాట్లు, తప్పులు మరిచిపోయి ప్రజలను తప్పు పడుతున్నారు. ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ఇటీవలి మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రసంగాల ధోరణి అంతా ప్రజల వైపు వేలెత్తి చూపే విధంగానే సాగింది. ఒక రాజకీయ నాయకుడు చేయకూడని దుస్సాహసం ఇది. అయినా నిస్సహాయత నుంచి పుట్టుకొచ్చిన ఆక్రోశం ఆయనను నిలువనీయడం లేదు.

క్యాష్ … అండ్ క్యాస్ట్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్యాష్ అండ్ క్యాస్ట్ గా మారిపోయాయి. ఎన్టీరామారావు టైమ్ లో ఎన్నికల వ్యయం పరిమితంగా ఉంటుండేది. చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేసి పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకం చేసేశారు. సామదానభేదో పాయాలతో కుల , ధన సమీకరణలతో కచ్చితంగా అన్ని ఎన్నికలనూ గెలవాలనే ధోరణిని పార్టీలో ప్రవేశపెట్టారు. ఉప ఎన్నికను సైతం భారీ మోహరింపులతో యుద్ధరంగాన్ని తలపించేలా తయారు చేశారు . తాను మాస్ పుల్లింగ్ లీడర్ కాకపోవడంతో వ్యూహాలను నమ్ముకుంటూ, వాటిని అమలు చేస్తూ గెలుపు సాధిస్తూ వచ్చారు. ప్రజలలో అసంతృప్తి ఏర్పడినప్పుడల్లా పరాజయం పాలయ్యారు. తన ఎత్తుగడలు, పొత్తులు కలిసి వచ్చినప్పడు గెలిచారు. సీట్ట పంపిణీ వద్ద నుంచి కుల సమీకరణలు పక్కాగా చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజనకు పునాదులు పడటానికి సైతం ఇటువంటి కుల సమీకరణలే పరోక్షంగా కారణమయ్యాయని తెలుగు దేశం నేతలే చెబుతుంటారు. ప్రస్తుతం అవే కుల సమీకరణలు వికటించి ప్రతికూలంగా గూడుకట్టి తెలుగుదేశం పరాజయానికి కారణమయ్యాయి. చంద్రబాబు తాను చేసిన తప్పేమిటో గ్రహించకుండా వైసీపీని పూనకం వచ్చినట్లు గెలిపించారు. తప్పు చేశారనే దోరణిలో ప్రజల ను వేలెత్తి చూపడం హాస్యాస్పదం.

నీవు నేర్పిన విద్యయే…

రాష్ట్ర రాజకీయాల్లో డబ్బు ప్రభావం తీవ్రం గా మారింది చంద్రబాబు నాయుడి హయాంలోనే. పెరిగిన ఖర్చును దృష్టిలో పెట్టుకునే వైసీపీ సైతం బాగా ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగిన వారికే టిక్కెట్లు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు బీజేపీతో వైరం తెచ్చుకున్నారు. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆదాయపన్ను శాఖ ను వాడుకుంటూ టీడీపీనేతలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టింది కేంద్రం. డబ్బు బయటికి తీయాలంటే భయపడే వాతావరణం కల్పించింది. వైసీపీకి ఎన్నికల వ్యయంలో ఫ్రీ హ్యాండ్ లభించింది. పైపెచ్చు రెడ్డి సామాజిక వర్గానికి తోడు ఎస్పీ,ఎస్టీ, ముస్లిం ఓటు బ్యాంకు పక్కాగా కలిసొచ్చింది. తన పరిధిని మించి హామీలిచ్చిన చంద్రబాబు వాటిని నిలుపుకోలేకపోయారు. కాపులకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ వంటివి పూర్తిగా నెరవేర్చలేకపోయారు. టీడీపికి బీసీల పార్టీగా ముద్ర ఉన్నప్పటికీ రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు దాదాపు సగం సీట్లు చంద్రబాబు కేటాయించాల్సి వచ్చింది. బీసీలలోనూ అసంతృప్తి నెలకొంది. పోలవరం, రాజదానిని నిర్మాణాత్మకంగా చేసి చూపించలేకపోయారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడి స్వయంకృతాపరాధాలు. పార్టీ పరాజయానికి కారణాలు.

పైసలకేనా ఓట్లు…

ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారనే ఆక్రోశం, ఆవేదన మేధావులతోపాటు పార్టీల్లోనూ నెలకొంది. అధికారంలో ఉన్నవాళ్లు సర్కారీ సొమ్ముతో సంక్షేమ పథకాల పేరిట గంపగుత్తగా పరోక్షంగా ఓట్లు కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమున్నా లేకున్నా విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారు. ప్రతిపక్షాలు ఈ పంపిణీతో పోటీ పడలేకపోతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడి పార్టీలు ఇందుకు అతీతమేమీ కాదు. చంద్రబాబు నాయుడు తన పాలన చివరి దశలో పసుపు కుంకుమ పేరిట వేల కోట్ల రూపాయలతో 50 లక్షల పైచిలుకు మహిళా ఓట్లకు గాలం వేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరింత లోతుగా చొచ్చుకుపోయి కులాలవారీ నిధుల సంతర్ఫణ మొదలు పెట్టారు. ఈ పథకాల పంపిణీ చూసి, శాశ్వతంగా తాను అధికారంలోకి రాలేనేమోననే సందేహంతో చంద్రబాబు ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఆవేదన పొంగుకొస్తోంది. కానీ తాను చేసిన తప్పులపై ఆత్మ విమర్శ చేసుకుంటూ ప్రతిపక్షంగా సమర్థంగా వ్యవహరిస్తే మళ్లీ అవకాశం వస్తుంది. ప్రజలు సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయరు. తమ సొమ్మే ప్రభుత్వాలు పంచి పెడుతున్నాయన్న నిజం వారికి తెలుసు. ఎన్నికల ముందు తాయిలంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ అందుకే ఫెయిల్ అయ్యింది. పాలన సక్రమంగా లేకుండా పథకాలు, పైసల పంపిణీపైనే ఆధారపడితే జగన్ మోహన్ రెడ్డి కూడా మరోసారి విజయం సాధించలేరు. అందువల్ల సీనియర్ రాజకీయ వేత్తగా చంద్రబాబు ప్రజలను నిందించడం మాని నిజాలను గ్రహించడం మేలు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News