బాబు టార్గెట్ వారేనట.. వారి అండ దొరికితే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటన ఉండనుంది. ప్రధానంగా ప్రత్యేక [more]

Update: 2021-04-16 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటన ఉండనుంది. ప్రధానంగా ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, కొత్త పరిశ్రమల స్థాపన జరగకపోవడం, అమరావతి రాజధాని తదితర అంశాలపై అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రధానంగా యువతతో సమావేశాలు ప్లాన్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇంకా రెండున్నరేళ్లే…..

సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. జగన్ ప్రభుత్వంపై యువత పూర్తిగా నిరాశతో ఉన్నారని గ్రహించిన చంద్రబాబు వారిని ఆకట్టుకునేందుకు, తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. యువతతో జరగనున్న సమావేశాల్లో తన విజన్, జగన్ వచ్చిన తర్వాత పరిస్థితులపై ఆయన వివరించనున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం యువత టీడీపీకి అండగా నిలబడాలని, సమస్యలపై ఉద్యమించాలని చంద్రబాబు ఈ సమావేశాల్లో పిలుపునివ్వనున్నారు.

యువతపై ఫోకస్….

ప్రధానంగా అమరావతి లాంటి రాజధాని నిర్మాణం జరగకపోవడం, మూడు రాజధానుల అంశంతో పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పోయాయని చంద్రబాబు అంటున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పరిశ్రమలు మినహా ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని, యువత సహకరిస్తే తాను కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తానని ఈ సమావేశాల్లో చంద్రబాబు హామీ ఇవ్వనున్నారు.

వరస సమావేశాలతో…..

జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ఓటు బ్యాంకును తయారు చేసుకుంటుందని, అది తాత్కాలిక ప్రయోజనాలు తప్పించి శాశ్వత పరిష్కారం కాదని చంద్రబాబు వివరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఈ ఓటు బ్యాంకు పవన్ కల్యాణ్ వైపు మరలకుండా ముందుగానే రంగంలోకి దిగాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు సమావేశాల కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News