నమ్మే రోజులు పోయాయి బాబూ.. సోపు వేసినంత మాత్రాన?

విశాఖ వాసులు అమాయకులు. మంచి వారు, నిజాయతీపరులు. చంద్రబాబు వైజాగ్ వచ్చిన ప్రతీసారి వేసే సోప్ ఇదే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడూ ఇవే డైలాగులు వల్లించేవారు. ఇపుడూ [more]

Update: 2021-02-27 14:30 GMT

విశాఖ వాసులు అమాయకులు. మంచి వారు, నిజాయతీపరులు. చంద్రబాబు వైజాగ్ వచ్చిన ప్రతీసారి వేసే సోప్ ఇదే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడూ ఇవే డైలాగులు వల్లించేవారు. ఇపుడూ ఇలాగే మాట్లాడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు పెదాల మీద తేనే పూసుకుని ఎందుకు విశాఖను ఇంతలా ప్రేమించేస్తున్నారు అంటే దానికి కారణం పక్కాగా రాజకీయమే అని ఎవరికైనా అర్ధమైపోతుంది. చంద్రబాబు విశాఖ రాజధానిని బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ విషయంలో ఆయన తన వ్యూహాల కంటే కూడా అమరావతి కలల‌నే ఎక్కువగా నమ్ముకున్నారు.

నాడు ఏం జరిగింది ….?

విశాఖ మీద చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉంది అంటే గుండెల నిండా అని తెలుగు తమ్ముళ్ళు చెబితే చెప్పవచ్చు కానీ జనాలకు అన్నీ తెలుసు కదా. ఆయన సీఎం అయ్యాక తొలి మంత్రి వర్గ సమావేశం పెట్టుకోవడానికి విశాఖ చోటు ఇచ్చింది. నాడు విశాఖనే రాజధానిగా చంద్రబాబు చేస్తారని అంతా నమ్మారు. కానీ జరిగింది వేరు. ఇక విశాఖ వేదికగా చేసి జాతీయ అంతర్జాతీయ సమావేశాలను కూడా బాబు ఎన్నో నిర్వహించారు. కానీ పెట్టుబడులు మాత్రం అమరావతిలో పెట్టమని కోరేవారు. ఇక బాబు సీఎం అయ్యాక విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి విజయవాడలో కొత్త ప్రాజెక్ట్ కి డీపీయార్ తయారు చేయించారు. రైల్వే జోన్ ఊసే తలవలేదు. ఇవన్నీ విశాఖ‌ జనాలకు గుర్తుండవనే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారా అన్నది ప్రత్యర్ధుల మాట.

రాజధానిగానే …?

చంద్రబాబు కూడా విశాఖను రాజధాని అనే అంటున్నారు. కానీ అది ఆర్ధిక రాజధాని. అంటే అది ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధం అన్న మాట. ఎక్కడైనా రాజధాని అంటే పరిపాలనకు ఉంటుంది కానీ ఈ ఆర్ధిక రాజధానులు సాంస్కృతిక రాజధానులు ఐటీ రాజధానుల గోల ఎక్కడా ఎవరూ అసలు విని ఉండరు. అంటే జనాలను ఉబ్బేయడానికి చెప్పే డబ్బా కబుర్లు ఇవే అని అనుకుంటే తప్పేముంది. జగన్ ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీనే పట్టుకుని తాను ఇక్కడ నుంచే పాలన చేస్తాను అంటూంటే తాతల నాడు విశాఖకు ఎన్నో చేశామని చంద్రబాబు చెబితే జనం నమ్ముతారా అన్నదే పెద్ద ప్రశ్న.

ఆ గుబులుతోనే …?

విశాఖ పాలనారాజధానిగా జగన్ చేస్తే కనుక పూర్తిగా తెలుగుదేశానికి ఈ సిటీలో రాజకీయ సంబంధాలు కట్ అయిపోతాయి. ఇప్పటికే జనాలు విశాఖ రాజధాని అనగానే వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా రాజధాని నగరం అంటే ఆ లుక్కే వేరు. దాంతో టీడీపీ అధినేత ఆ ఒక్కటీ తప్ప అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా వినడానికి నమ్మడానికి విశాఖ జనాలు సిధ్ధంగా లేరనే అంటున్నారు. చంద్రబాబు ఇప్పటికీ విశాఖను రాజధానిగా అంగీకరించ లేకపోతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ రోజున వైసీపీ సర్కార్ విశాఖ రాజధాని అని పేర్కొంటూ అసెంబ్లీలో చట్టం చేసినా కూడా చంద్రబాబు దాన్ని ఖాతరు చేయనట్లుగా మాట్లాడడంతోనే విశాఖ సహా ఉత్తరాంధ్రా జనం మండిపోతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు ఎంత సోపేసినా కూడా వైజాగ్ జనం ఈజీగా బుట్టలో పడరు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News