బీజేపీతో బాబు రహస్య ప్రేమలు…?

రాజకీయం ఇది. ఇలాగే ఉంటుంది. అందువల్ల ప్రేమలు ఉన్నట్లుంది పుట్టుకువస్తాయి. ద్వేషాలు కూడా ఎల్లకాలం ఉండవు. జగన్ ఏదైతే వద్దు అనుకున్నాడో అది ఏపీలో జరుగుతోందా అంటే [more]

Update: 2021-02-27 12:30 GMT

రాజకీయం ఇది. ఇలాగే ఉంటుంది. అందువల్ల ప్రేమలు ఉన్నట్లుంది పుట్టుకువస్తాయి. ద్వేషాలు కూడా ఎల్లకాలం ఉండవు. జగన్ ఏదైతే వద్దు అనుకున్నాడో అది ఏపీలో జరుగుతోందా అంటే పరిణామాలు ఆలాగే ఉన్నాయట. జగన్ బీజేపీకి ఒదిగి ఉండడానికి కేసులు కారణం అని అంతా అంటారు కానీ దానికంటే పెద్ద పాయింటే ఉంది. అదే చంద్రబాబు. తాను ఎక్కడ దూరం అయితే చంద్రబాబు ఆ సందు చూసుకుని కమలం చంకన ఎక్కుతారో అన్నదే జగన్ భయం. అయితే బీజేపీకి ఇవ‌న్నీ తెలుసు. అందుకే ఇరువురు భామలతోనూ సరసాలు ఆడుతోంది.

ఆయన నోట….

జగన్ కి ఆంతరంగీకుడు ఎవరు అంటే విజయసాయిరెడ్డినే చెబుతారు. విజయసాయిరెడ్డి చెబితే అది జగన్ మనసులో ఉన్నదే అని కూడా అంతా నమ్ముతారు. తాజాగా విజయసాయి సడెన్ గా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు తెర వెనక బీజేపీ పెద్దలతో రహ‌స్య ప్రేమకు కొనసాగిస్తాడేమో అని డౌట్ కూడా వెలిబుచ్చారు. అందుకే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రానికి ఒక లేఖ కూడా రాయడం లేదని విమర్శించారు. సరే ఈ విమర్శ పక్కన పెట్టినా విజయసాయి అనుమానిస్తున్నట్లుగా కేంద్ర పెద్దలతో చంద్రబాబుకు మళ్లీ డీలింగ్ కుదిరిందా అన్నదే ఇపుడు చర్చ.

హర్ట్ అయ్యారా…?

బీజేపీకి చెందిన అతి ముఖ్యుడు, మోడీ తరువాత అంతటి వాడు అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారుట. అమిత్ షా తిరుపతి వస్తే నాడు చంద్రబాబు సీఎం గా ఉండగా రాళ్ళు వేయించిన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అందువల్ల బీజేపీ పెద్దలు బాబు విషయంలో మెత్తబడరు అని గట్టి నమ్మకంతో ఇంతకాలం ఉంటూ వచ్చారు కానీ అమిత్ షా నుంచి తెలుగు తమ్ముళ్లకు ఆహ్వానం రావడం అంటే ఢిల్లీ రాజకీయం మారుతోందా అన్న డౌట్ అయితే వైసీపీలో వస్తోందిట. ఈ పరిణామం మీద విజయసాయిరెడ్డి ఆరా తీసే ఇలా చంద్రబాబు బీజేపీ ప్రేమల గురించి కామెంట్స్ చేశారా అన్న మాట అయితే ఉంది.

అదే జరిగితే ..?

బీజేపీతో చంద్రబాబుకు సాన్నిహిత్యం మళ్ళీ కుదిరితే ఏం చేయాలన్న దాని మీదనే ఇపుడు వైసీపీ మల్లగుల్లాలు పడుతోందిట. అందుకే జగన్ డైరెక్ట్ గా కేంద్రాన్ని ఏమీ అనలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అంటే ఏపీకి చెందిన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పెట్టి బీజేపీ కులాసాగా ఉండడం. ఇపుడు జగన్ ని చంద్రబాబు కార్నర్ చేస్తే బాబు మీద జగన్ విరుచుకుపడుతున్నారు. దాంతో బీజేపీ మాత్రం సేఫ్ గా ఉంటోంది. మొత్తానికి కమలం పార్టీ రాజకీయ పాచికలో భాగంగానే టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చి మరీ వైసీపీలో అనుమానాలను, భయాలని ఒక్కసారిగా పెంచేశారు అన్నది ఒక విశ్లేషణగా ఉంది.

Tags:    

Similar News