డామిట్ కథ అడ్డం తిరిగిందే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఊహించింది ఒకటి. జరిగింది మరొకటి. పంచాయతీ ఎన్నికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. కనీస స్థాయిలోనైనా గెలిచి పార్టీకి [more]

Update: 2021-02-25 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఊహించింది ఒకటి. జరిగింది మరొకటి. పంచాయతీ ఎన్నికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. కనీస స్థాయిలోనైనా గెలిచి పార్టీకి ఒక ఊపుతెద్దామనుకున్న చంద్రబాబుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయనే చెప్పాలి. పైకి తాము అత్యధిక స్థానాల్లో గెలిచుకున్నట్లు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం మరింత బలహీనపడిందంటున్నారు.

టీడీపీ సీనియర్ నేతలు…..

జిల్లాలకు జిల్లాల్లోనే పార్టీ నేతలు చేతులు ఎత్తేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక ఉండి చంద్రబాబు కథ అంతా నడిపించారన్నది వైసీపీ ఆరోపణ. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చారన్నది వాస్తవం. మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలను పెడితే గ్రామస్థాయిలో వర్గాలుగా విడిపోతారని, అధికార వైసీపీలో గ్రూపులు మరింత పెరుగుతాయని చంద్రబాబు ఆశించారు.

గ్రామ స్థాయిలో…

కానీ గ్రామ స్థాయిలో పంచాయతీ ఎన్నికల తర్వాత వైసీపీ మరింత బలం పెంచుకోగలిగింది. మాజీ మంత్రులు, కీలక నేతల నియోజకవర్గాల్లో సయితం వైసీపీ పాగా వేయగలిగింది. ఇందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల స్థాయి నేతలు ఎన్నికలకు అనేక చోట్ల ముందుకు రాకపోవడమే. భయపెట్టి, బలవంతపు ఏకగ్రీవాలను వైసీపీ చేసుకుందని చంద్రబాబు ఆరోపించవచ్చు. ఇది తాత్కాలిక ఆనందంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.

ప్రజలంతా క్యూకట్టి….

ఎందుకంటే దాదాపు 80 శాతంకు పైగా పోలింగ్ జరిగింది. అంటే ప్రజలు తమంతట తాము ఓట్లేశారు. ప్రజలందరినీ భయపెట్టి ఓట్లు వేయించుకునే శక్తి ఏ పార్టీకి ఉండదు. అందుకే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పంచాయతీ ఎన్నికలు చంద్రబాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చాయని చెప్పక తప్పదు. ఇప్పుడు ఇంక ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలు కావడంతో చంద్రబాబు కొంత ఆశ పెట్టుకున్నారు. ఇవి పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కావడంతో మరింత స్పష్టత వస్తుంది. మరి ఈ ఎన్నికల్లో చంద్రబాబు తన పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి.

Tags:    

Similar News