బాబులో హఠాత్తుగా ఈ గుబులేల…?

చంద్రబాబులో ఒక్కసారిగా ధైర్యం సన్నగిల్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ముందు వరకూ బస్తీ మే సవాల్ అంటూ దూకుడు మీద ఉన్న ఆయన ఫలితాలు చూశాక [more]

Update: 2021-02-23 12:30 GMT

చంద్రబాబులో ఒక్కసారిగా ధైర్యం సన్నగిల్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ముందు వరకూ బస్తీ మే సవాల్ అంటూ దూకుడు మీద ఉన్న ఆయన ఫలితాలు చూశాక డీలా పడ్డారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తమదే విజయం అని చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా నమ్మారు. కానీ మొదటి ఫలితమే బోల్తా కొట్టింది. అంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి అది ఒక మెతుకు మాత్రమే ముడితే చాలు. దాంతో చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడుకు ఏపీలోని పొలిటికల్ సీన్ అర్ధమైపోయింది.

అందుకే అలా ..?

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పేశాక చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆయనకు ఒక్కసారిగా ఎన్నికల సంఘం ఫెయిల్ అయినట్లుగా కూడా గుర్తుకు వచ్చింది. నిన్నటిదాకా నిమ్మగడ్డను వెనకేసుకు వచ్చిన చంద్రబాబు తన స్వరం పూర్తిగా మార్చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరగడంలేదని కూడా ఆరోపిస్తున్నారు. మరి బాబులో ఇంతలో ఇంత మార్పు ఎందుకు అన్నదే ఇక్కడ అందరికీ కలిగే ప్రశ్న.

లోగుట్టు తెలిసిందా ..?

తొలి విడత ఫలితాలు విడుదల అయ్యాక తామే గెలిచామని 38 శాతం ఓట్ల షేర్ తమకు దక్కిందని గొప్పగా మీడియాకు చెప్పుకున్న చంద్రబాబు ఆ మరుసటి రోజే టోన్ చేంజ్ చేశారు. దానికి కారణం వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సర్పంచులుగా గెలవడం. అంతే కాదు టీడీపీ తరఫున గెలిచిన వారు కూడా ఒక్క రోజు కూడా ఆగకుండా అధికార పార్టీ వైపు వెళ్ళిపోవడం. దీంతో పంచాయతీ ఎన్నికలు అయినా మరే అయినా పరిస్థితి ఇలాగే ఉంటుందని చంద్రబాబుకు అర్ధమైపోయిందని అంటున్నారు. ఇక ఎన్నికల సంఘం విఫలం అయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ చంద్రబాబు తన స్థాయిని మరచి మరీ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఆ ప్లాన్ బెడిసిందా…?

పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఫలితాలు వెంటనే ప్రకటించాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబే సూచించారని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే తప్పకుండా తామే గెలుస్తామని, అందువల్ల ఒక ఎన్నిక ఫలితం మరో ఎన్నికను ప్రభావితం చేస్తూ గొలుసుకట్టు విధానంలో మొత్తానికి మొత్తం సీట్లు తమ పరం అవుతాయని చంద్రబాబు తలచారుట. తీరా వైసీపీకి పంచాయతీ ఫలితాలు అనుకూలం కావడంతో చంద్రబాబు ప్లాన్ బెడిసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇపుడు వైసీపీ వైపే జనం మొగ్గు అన్నది బహిర్గతం కావడంతో మొత్తం ఎన్నికల మీద ఆ ప్రభావం ఉంటుందని బాబు జడుసుకుంటున్నారుట. మొత్తానికి చూస్తే చంద్రబాబులో సరికొత్త గుబులు మాత్రం బయల్దేరింది. అసలు నిజం కూడా ఆయనకు ఇపుడే అర్ధమైంది అంటున్నారు.

Tags:    

Similar News