బాబుకు ఇంతటి అవమానమా? అనవసరంగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత దగ్గరవ్వాలనుకున్నా ఢిల్లీ పెద్దలు దగ్గరకు రానివ్వడం లేదు. విశాఖకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరి నాలుగు రోజులు గడుస్తున్నా [more]

Update: 2020-05-11 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత దగ్గరవ్వాలనుకున్నా ఢిల్లీ పెద్దలు దగ్గరకు రానివ్వడం లేదు. విశాఖకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంత వరకూ అనుమతి దొరకలేదు. కనీసం చంద్రబాబుకు సమాచారం కూడా ఇవ్వలేదు. దీనిని చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ అవమానంగా భావిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోక పోవడమేంటని సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు సూటి ప్రశ్నలు వేస్తున్నారు.

కంగారు పడి కమలంతో…..

చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కంగారు పడ్డారు. పార్టీ అన్ని రకాలుగా కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయం అవసరమని ఆయన పది నెలల క్రితమే గ్రహించారు. వెంటనే బీజేపీని మచ్చిక చేసుకునేందుకు తనకున్న నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు. దీంతో కొంత సానుకూలత వస్తుందని ఆశించారు. వారి సాయంతో బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు.

పొగడ్తలు ప్రారంభించినా….

ఇక కరోనా సమయం నుంచి మోదీని చంద్రబాబు తెగ పొగిడేస్తూ వస్తున్నారు. మోదీ ఏ పిలుపునిచ్చిన శభాష్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఆయన చెప్పినట్లు చప్పట్లు కొట్టారు. కొవ్వొత్తులు వెలిగించారు. తాను నిపుణులతో మాట్లాడి కోవిడ్ అరికట్టడానికి ఒక నోట్ ను ప్రధాని కార్యాలయానికి పంపారు. అయితే వెంటనే స్పందించిన ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. దీంతో చంద్రబాబులో ఎక్కడ లేదని హషారు వచ్చింది. పార్టీ క్యాడర్ లో సయితం జోష్ పెరిగింది. విశాఖ గ్యాస్ లీక్ విషయంలోనూ మోదీ పై చంద్రబాబు ప్రశంసలు కురిపించినా ఫలితం లేకుండా పోయింది.

అనుమతి ఇవ్వకపోవడం అవమానంగా….

తొలిరోజు అయితే అక్కడ గ్యాస్ లీక్ కావడం, హడావిడి ఉంటుందని అనుమతి ఇవ్వలేదని అనుకోవచ్చని, నాలుగు రోజులయినా చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుమంటున్నారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసినా ఫలితం లేకుండా పోవడంతో చంద్రబాబు విశాఖ వెళ్లే ప్రయత్నాన్ని మానుకున్నారని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం దరి చేరుదామన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. మోదీని అనవసరంగా చంద్రబాబు పొగిడారని కూడా టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో బాధపడుతూ కామెంట్స్ ను పోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News