ఓడితే టీడీపీకి ఠికాణా లేనట్లే…?

తమ్ముళ్లు తెగ తుళ్ళిపడుతున్నారు. వారి సంబరం అంబరాన్నే తాకుతోంది. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఏపీ జనాలు మొత్తం ఇరవై నెలల జగన్ పాలన మీద [more]

Update: 2021-02-17 02:00 GMT

తమ్ముళ్లు తెగ తుళ్ళిపడుతున్నారు. వారి సంబరం అంబరాన్నే తాకుతోంది. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఏపీ జనాలు మొత్తం ఇరవై నెలల జగన్ పాలన మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తీర్మానించేశారు. ఈసారి తమ్ముళ్లు నామినేషన్ వేయడమే తడవుగా జనాలు గెలిపించేందుకు రెడీగా ఉన్నారని కూడా చెప్పేశారు. మరి ప్రజా తీర్పు అంత స్పష్టంగా చంద్రబాబు కళ్ల ముందు కనిపిస్తున్నపుడు తెలుగు వీరులకు జంకు గొంకు ఎందుకు. దీక్ష పూని ముందుకు సాగడమే కదా చేయాల్సింది.

నిమ్మగడ్డ ఉండగా ..?

నిజానికి లోకల్ బాడీ ఎన్నికల మీద ఎపుడూ విపక్షాలకు అంతగా నమ్మకాలు ఉండవు. అక్కడ అధికార పక్షానిదే పై చేయి గా ఉంటుంది. ఇక చంద్రబాబు కూడా సార్వత్రిక ఎన్నికల గురించే ఇప్పటిదాకా కలవరిస్తూ వచ్చారు. అనూహ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆద్వర్యంలోనే లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో టీఎన్ శేషన్ మాదిరిగా నిమ్మగడ్డ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అన్ని రకాలైన మార్గాలలో గట్టి నిఘా పెట్టి ఉంచారు. ఏపీలో ఒక్క లెక్కన అధికారులను బదిలీ చేస్తున్నారు. ఇంతకంటే పారదర్శకంగా లోకల్ బాడీ ఎన్నికలు ఇంతకు ముందు జరిగి ఉండవు అన్నంతగా నిమ్మగడ్డ హడావుడి ఉంది. మరి తెలుగుదెశం పార్టీకి జనంలో బలం ఉంటే కచ్చితంగా 2013 నాటి స్థానిక ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాల్సిందే.

గోల్డెన్ చాన్స్…..

అప్పట్లో అంటే 2013లో ఉమ్మడి ఏపీకి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఎక్కడికక్కడ చీలిపోవడంతో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. నాడు వచ్చిన సీట్లలో అరవై నుంచి డెబ్బై శాతం పైగా టీడీపీయే గెలుచుకుంది. కేవలం ఇరవై నుంచి పాతిక శాతం మాత్రమే వైసీపీకి దక్కాయి. ఇపుడు ఎనిమిదేళ్ళ తరువాత మళ్లీ టీడీపీకి గోల్డెన్ చాన్స్ వచ్చింది. అధికార పార్టీ ఆగడాలని ఎక్కడికక్కడ అడ్డుకునే నిమ్మగడ్డ ఉండగా తెలుగుదేశం దుమ్ము దులపాల్సిందే అంటున్నారు.

ఆ మాట అనలేరుగా…?

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ గా ఏడాది పాటు అతి పెద్ద రగడ జరిగింది. మొత్తానికి రాజ్యాంగబధ్ధమైన తీర్పుతో నిమ్మగడ్డ తాను ఉండగానే ఎన్నికలను జరిపిస్తున్నారు. ఇంతకంటే విశ్వసనీయమైన ఎన్నికలు ఎపుడూ జరగవు. మరి ప్రజల్లో కనుక టీడీపీ పట్ల 2019 నాటి వ్యతిరేకతే ఉంటే కనుక కచ్చితంగా ఓటమి ఖాయం. అలాగే సంక్షేమ పధకాలు బాగా పనిచేస్తే కనుక వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మరి అదే జరిగితే మాత్రం తెలుగుదేశం పతనాన్ని ఎవరూ ఆపలేరు. దీని ప్రభావం అన్ని ఎన్నికల మీద కూడా పడుతుంది. ఇక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు అంటూ కూడా టీడీపీ నానా యాగీ చేయడానికి కూడా అసలు వీలు ఉండదు మరి. ఎందుకంటే ఇది నిమ్మగడ్డ సారధ్యంలో ఫ్రీ అండ్ ఫైర్ గా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి.

Tags:    

Similar News