వస్తాడు మా “బాబు” ఆరోజు….?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా హైదరాబాద్, అమరావతి ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇటీవల రామతీర్థంను సందర్శించిన చంద్రబాబు కనీసం విశాఖలోనూ ఆగలేదు. అక్కడ పార్టీ [more]

Update: 2021-02-03 11:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా హైదరాబాద్, అమరావతి ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇటీవల రామతీర్థంను సందర్శించిన చంద్రబాబు కనీసం విశాఖలోనూ ఆగలేదు. అక్కడ పార్టీ నేతలతో మాట్లాడింది లేదు. ఇక చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఇంత వరకూ పర్యటించలేదు. ఆయన గత ఏడాది ఫిబ్రవరి నెల తర్వాత కుప్పం వైపు చూడలేదు. అయితే వారం రోజులకొకసారి అక్కడి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం టచ్ లో ఉంటున్నారు.

క్యాడర్ లో అసంతృప్తి…

చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి రాకపోవడంతో అక్కడి క్యాడర్ అసంతృప్తిగా ఉందట. తమపై అక్రమ కేసులు పెడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని మదనపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు పట్టుంది. వరసగా ఏడు సార్లు విజయం సాధించిన చంద్రబాబుకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు కు మెజారిటీ తగ్గింది. దీంతో వైసీపీ కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

వైసీపీ దూకుడు…..

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పీఏనే అంతా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న నేతలకు పార్టీ కండువా కప్పేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ రెడ్డప్ప, మరో మంత్రి నారాయణస్వామి తరచూ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ టీడీపీ క్యాడర్ ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత మేరకు సక్సెస్ అయ్యారు. కీలక నాయకులను పార్టీలోకి చేర్చుకుని చంద్రబాబును మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నించారు.

త్వరలో బాబు పర్యటన…..

అయితే ఇప్పుడు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఎటూ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు త్వరలోనే పాల్గొననున్నారు. ఈ ప్రచారానికి అక్కడకు వస్తున్న సందర్భంగా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తానని చంద్రబాబు అక్కడి నేతలకు వీడియో కాన్ఫరెన్స్ లో తెలియజేశారట. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబు రాకకోసం ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వస్తుండటంతో ఆయనకు భారీ స్వాగత ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News