రెడీగా ఉన్నా.. బాబు ఆలస్యంతోనేనట…?

టీడీపీకి కంచుకోట వంటి తూర్పుగోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ప‌రిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ జిల్లాలోని కీల‌క‌మైన నాయ‌కులు ఓడిపోవ‌డంతో పార్టీని వీడిపోయారు. ఒక‌రిద్దరు పార్టీకి [more]

Update: 2021-02-02 09:30 GMT

టీడీపీకి కంచుకోట వంటి తూర్పుగోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ప‌రిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ జిల్లాలోని కీల‌క‌మైన నాయ‌కులు ఓడిపోవ‌డంతో పార్టీని వీడిపోయారు. ఒక‌రిద్దరు పార్టీకి గుడ్‌బై చెప్పగా మ‌రికొంద‌రు త‌ట‌స్థంగా ఉంటున్నారు. ఇంకొంద‌రు పార్టీతో సంబంధ‌మే లేద‌న్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి ముందుకు నాలుగు అడుగులు , వెన‌క్కి ప‌ది అడుగులు అన్న చందంగా మారిపోయంది. ప్రధానంగా బ‌లమైన నాయ‌కులు ప్రాతినిధ్యం వ‌హించిన రామ‌చంద్రాపురం, పీ.గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు పార్టీని న‌డిపించేవారు క‌రువ‌య్యారు.

త్రిమూర్తులు వెళ్లిపోవడంతో…..

రామ‌చంద్రాపురంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు తోట త్రిమూర్తులు.. అన్నీతానై వ్యవ‌హ‌రించారు. టీడీపీలో ఒక శ‌క్తిగా ఎదిగారు. ఫ‌లితంగా దిగువ‌స్థాయి నాయ‌కులు ఎద‌గ‌కుండా పోయార‌నేది నిర్వివాదాంశం. ఈ విష‌యంలో ముందుగానే మేల్కొని చ‌ర్యలు చేప‌ట్టి ఉంటే.. త్రిమూర్తులు త‌ర్వాత బ‌ల‌మైన నాయ‌కుడు ముందుగానే త‌యారై ఉండేవారు. కానీ, ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీలోకి వెళ్లిపోయారు త్రిమూర్తులు. ఇక్కడ టీడీపీ జెండా మోసే నాయ‌కుడు క‌రువ‌య్యారు.

గుడ్డిగా నమ్మడంతో….

పైగా త్రిమూర్తులు 2009 ఎన్నిక‌ల్లో పార్టీకి హ్యాండ్ ఇచ్చి ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు. ఆ త‌ర్వాత 2014లో టీడీపీలోకి వ‌చ్చి ఇక్కడ ఐదేళ్లు అధికారం అనుభ‌వించి…. మ‌ళ్లీ టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు. చంద్రబాబు గుడ్డిగా త్రిమూర్తుల‌ను న‌మ్మడంతోనే పార్టీ అక్కడ నిర్వీర్యం అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబు ఈ నియోజ‌క‌వ‌ర్గం పై దృష్టి పెట్టలేదు. అయితే, ప్రముఖ పారిశ్రామిక వేత్త దూడల శ్రీనివాసరావు ఇక్కడ ఇంచార్జ్ పీఠం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవ‌డంలో తాత్సారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఆయనను సస్పెండ్ చేయడంతో….

అయితే కోన‌సీమ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకునే ఓ మాజీ మంత్రి ప‌దే ప‌దే వేళ్లు, కాళ్లు పెడుతుండ‌డంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌పున కొత్త నేత‌లు ఎవ్వరూ ముందుకు రావ‌డం లేదు. ఇక‌, పి.గ‌న్నవ‌రం విష‌యంలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తికి టికెట్‌ నిరాకరించి నేల‌పూడి స్టాలిన్‌బాబుకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఎన్నికల్లో డబ్బుల పంపిణీపై ఆరోపణలు రావడంతో స్టాలిన్‌బాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇంఛార్జ్‌ లేకుండా పోయారు.

ఇప్పటి వరకూ….

ఇక‌, ఇప్పుడు ఇక్కడ తాను బాధ్యత‌లు చేప‌డ‌తానంటూ మందపాటి కిరణ్‌కుమార్ చెబుతున్నారు. ఆయ‌న యువ నాయ‌కుడు కావ‌డం, గ‌తంలో వైసీపీలో ప‌నిచేయ‌డంతో మంచి ప‌రిచ‌యాలు కూడా ఉన్నాయి. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పటి వ‌ర‌కు ఈ విష‌యంలోనూ మౌనంగా ఉన్నారు. మొత్తంగా చూస్తే తూర్పులో బ‌ల‌మైన టీడీపీ నియోజ‌క‌వ‌ర్గాలు రెండు కూడా ఇప్పుడు నాయ‌క‌త్వ లేమితో ఇబ్బంది ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News