మైదానం నుంచి తప్పుకున్నట్లేనా? అసలుకే ఎసరొస్తుందా?

అప్పట్లో ఉమ్మడి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ ఉండేవారు. నాడు సీఎం గా చంద్రబాబు ఉన్నా, ఆ తరువాత వైఎస్సార్ వచ్చినా కూడా దత్తాత్రేయ తన [more]

Update: 2020-05-14 03:30 GMT

అప్పట్లో ఉమ్మడి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ ఉండేవారు. నాడు సీఎం గా చంద్రబాబు ఉన్నా, ఆ తరువాత వైఎస్సార్ వచ్చినా కూడా దత్తాత్రేయ తన కలానికే పెద్దగా పని చెప్పేవారు. రోజుకు కనీసంగా ఒక లేఖ ముఖ్యమంత్రులకు రాస్తే కానీ ఆయనకు నిద్ర పట్టేది కాదు. పాపం దత్తాత్రేయ ప్రజా సమస్యల మీదనే ఎక్కువగా లేఖలు సంధించేవారు. వాటికి లెక్క కూడా కట్టేవారు. ఇది తొంబయ్యవ లేఖ, ఇది నూరవ లేఖ అంటూ హైప్ పెంచేవారు. సరే దత్తాత్రేయ లేఖలను ఏ సీఎం కూడా సీరియస్ గా తీసుకోలేదు, అది వేరే విషయం కానీ ఇలా లేఖలతో కూడా రాజకీయం చేయవచ్చు అని నిరూపించిన నేత మాత్రం దత్తాత్రేయే. ఆయన తరువాత ఇన్నాళ్ళకు మరో నేత అదే బాటన నడుస్తున్నారు. ఆయనే చంద్రబాబు నాయుడు.

ఏడా పెడా అలా….

చంద్రబాబు లేఖలు ఈ మధ్య బాగా రాస్తున్నారు. ఓ చేత్తో జగన్ కి మరో చేత్తో అదే ప్రభుత్వానికి చెందిన ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. ఇక అంతటితో ఆగకుండా దేశంలోకి ఇతర రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖలు సంధిస్తున్నారు. ఇంకో వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీని మంచి చేసుకునే క్రమంలో ప్రియమైన ప్రధాని గారూ అంటూ ఆయనకూ లేఖాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కేంద్ర హోం శాఖకు, ఇతర కీలక మంత్రులకు ఒకరేంటి చంద్రబాబు ఎవరికి అనుకుంటే వారందరికీ లేఖలు రాస్తున్నారు. ఈ మధ్యలో ప్రజలకు కూడా బహిరంగ లేఖలు రాయడం మొదలుపెట్టారు.

ఉనికి కోసమా….?

చంద్రబాబు లాంటి చురుకైన నాయకులు లేఖలు రాయడమే చిత్రం. చంద్రబాబు లాంటి వారు క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. అతి పెద్ద క్యాడర్, బలమైన నాయకత్వం కలిగిన టీడీపీ లాంటి పార్టీలు ప్రత్యక్ష పోరాటాలే ఇంతవరకూ చేస్తూ వచ్చాయి. కానీ లాక్ డౌన్ పుణ్యమాని చంద్రబాబు హైదరాబద్ లో సెల్ఫ్ క్వారైంటైన్ అయిపోవడంతో లేఖలకు పని చెప్పాల్సివచ్చిందేమో. అయితే దీన్ని వైసీపీ నేతలు ఉనికి కోసం పోరాటంగా కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబు ఇలా లేఖలు రాసుకోవడమేనని కూడా సెటైర్లు వేస్తున్నారు. బాబు సంధించిన లేఖలకు ఇప్పటివరకూ ప్రభుత్వ పెద్దలు ఎవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా లేకపోవడం విశేషం.

తగ్గిపోతున్నారా…

లేఖలు రాసుకునే కాలం వచ్చిందంటే చంద్రబాబు కచ్చితంగా రాజకీయ మైదానం నుంచి వెనకడుగు వేసినట్లేనని విశ్లేషించేవారూ ఉన్నారు. నాయకుడు అన్న వాడు యుధ్ధ భూమిలోనే ఉండాలి. అక్కడ నుంచే బాణాలు సంధించాలి. కానీ పరోక్షంగా రాజకీయాలు చేయడాన్ని నమ్ముకోవడం అంటే తగ్గినట్లేనని అంటున్న వారూ లేకపోలేదు. నిజానికి చంద్రబాబు లాక్ డౌన్ లేకపోతే నేరుగా పోరాటాలే చేసేవారేమో. కానీ ఇపుడు కాలం వేరేగా ఉంది. సామూహికంగా పోరాటాలు చేసే సీజన్ కాదు, దాంతో చంద్రబాబు కలం, కాగితం తీస్తున్నారు. కానీ ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగినా. చంద్రబాబు అలవాటు పడిపోయినా అసలుకే ఎసరు అని టీడీపీలోనే వినిపిస్తున్న మాట. మరి కరోనా ప్రభావం తగ్గి పూర్వం మాదిరిగా చంద్రబాబు జనంలోకి వస్తే ఫరవాలేదు. లేకపోతే ఆయన ఉత్తమ లేఖకుడుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News