అందుకే కావాలంటున్నారు.. అవి జరిగితే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్థానిక సంస్థలను బలంగా కోరుకుంటున్నారు. అందులో గెలుపోటముల సంగతి పక్కన పెడితే పార్టీ గాడిన పడటానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపకరిస్తాయని [more]

Update: 2021-01-18 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్థానిక సంస్థలను బలంగా కోరుకుంటున్నారు. అందులో గెలుపోటముల సంగతి పక్కన పెడితే పార్టీ గాడిన పడటానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపకరిస్తాయని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. గత ఇరవై నెలలుగా 175 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు బయటకు రావడం లేదు. అడపా దడపా కొందరు ముఖ్యనేతలు, కేసులు నమోదయిన వారు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు.

నేతలు బయటకు రాక…..

చంద్రబాబు ఎన్నిసార్లు వీడియోకాన్ఫరెన్స్ లు, టెలికాన్ఫరెన్స్ లు పెట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. పార్టీ కార్యక్రమాలను కూడా అనేక నియోజకవర్గాల్లో సక్రమంగా నేతలు చేపట్టడం లేదు. కేంద్ర పార్టీ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీ ఏమీ లేదని నివేదికలు అందాయి. నియోజకవర్గ స్థాయి నేతలు సయితం పార్టీ కార్యాలయం వైపు చూడటం లేదు.

ఖచ్చితంగా రావాల్సిందే…..

అదే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పార్టీ నేతలు ఖచ్చితంగా బయటకు వస్తారు. పార్టీ గుర్తు లేకపోయినా తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ముందుకు వస్తారు. గ్రామస్థాయిలోనూ పార్టీ జెండా మళ్లీ రెప రెపలాడుతుంది. అందుకే స్థానికసంస్థలు వీలయినంత త్వరగా జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువే అయినా ఓటమి పాలయినా మరో మూడేళ్ల పాటు బరిలో నేతలు ఉంటారు.

నామినేషన్లు వేసేలా?

అందుకే అన్ని పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుతో అభ్యర్థులను నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే సమిష్టిగా ఎదురుకోవాలని, ఏకగ్రీవానికి తావివ్వకూడదని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. అందుకే ఆన్ లైన్ లో నామినేషన్లు దాఖలు చేసేలా వెసులు బాటు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను చంద్రబాబు కోరారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ మరింత పుంజుకుంటుందన్నది చంద్రబాబు అంచనా.

Tags:    

Similar News