జగన్ జాతకం బాబు దగ్గర ఉందా ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం పోయి ఇరవై నెలలు అయింది. గత ఏడాది 2020 అయితే ఏపీలో చంద్రబాబు ఎక్కడా కనిపించలేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో [more]

Update: 2021-01-11 09:30 GMT

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం పోయి ఇరవై నెలలు అయింది. గత ఏడాది 2020 అయితే ఏపీలో చంద్రబాబు ఎక్కడా కనిపించలేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో ఆయన పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. 2021 వస్తూనే చంద్రబాబు జోరు పెంచారు. తనకు అచ్చి వచ్చిన ఉత్తరాంధ్ర నుంచే రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఇక దూకుడే అంటున్నారు చంద్రబాబు. ఎన్నికలు ఎపుడు వచ్చినా విజయం తెలుగుదేశం పార్టీదేనని కూడా గట్టిగానే డంకా భజాయిస్తున్నారు.

అధికారంలోకి వచ్చాక…

చంద్రబాబు ఇపుడు మీడియతో మాట్లాడినా, తమ్ముళ్ళతో మాట్లాడినా కూడా తామే రేపు అధికారంలోకి రాబోతున్నామని ధీమాగా చెబుతున్నారు. చంద్రబాబుకు ఇంత ధీమా ఎలా వచ్చింది అన్నది వైసీపీ నేతలకే కాదు తమ్ముళ్ళకు కూడా అర్ధం కావడం లేదు. రామతీర్ధాలు లో నిర్వహించిన సభలో అయితే బాబు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అధికారం లోకి రావడం ఎంతో దూరంలోలేదని గట్టిగా చెప్పుకున్నారు. నాడు ఇంతకు ఇంత అని కచ్చితంగా వైసీపీని సాధించి తీరుతామని కూడా చంద్రబాబు అంటున్నారు. బాబు నోట అధికారం మాట ఈసారి గట్టిగానే వస్తోంది.

ఏమీ చేయలేదుగా …?

జగన్ చేతిలోకి అధికారం పెట్టి పిచ్చోడి చేతిలో రాయిని ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. జగన్ పాలనలో ఏపీలో ఏమీ అభివృద్ధి జరగలేదని కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. జగన్ కి అధికారం ఇస్తే జనాలను పక్కన పెట్టి రాక్షస పాలన చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి జగన్ సంక్షేమ రాజ్యాన్ని తెచ్చానని చెబుతున్నారు, నగదు బదిలీ పధకం ద్వారా గత ఇరవై నెలల్లో 75 వేల కోట్ల రూపాయలను జనాలకు పంపిణీ చేశానని చెప్పుకుంటున్నారు. మరి దానికి ఓట్లు రాలవా అంటే చంద్రబాబు మాత్రం జగన్ కి ఒక్క ఓటు కూడా ఈసారి పడదు అంటున్నారు. ఈసారి కచ్చితంగా గద్దెనెక్కేది టీడీపీయేనని కూడా బల్లగుద్ది చెబుతున్నారు.

అభివృద్ధి నినాదం…..

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో చంద్రబాబు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అభివృద్ధే నినాదంగా బాబు తన అజెండాను బయటకు తీయబోతున్నారు. అంతే కాదు, ఏపీలో మత విద్వేషాల మీద కూడా ఆయన గళం విప్పబోతున్నారు. అలాగే ఏపీని జగన్ అప్పుల ఆంధ్రాగా చేశారని ఆయన గర్జించబోతున్నారు. మొత్తానికి చంద్రబాబు తాను స్వయంగా చేయించుకున్నారో లేదా ఏ ఆంధ్రా ఆక్టోపస్ చేసిన సర్వే దగ్గర ఉంచుకున్నారో తెలియదు కానీ జగన్ జాతకం మొత్తం తన దగ్గర ఉందని గట్టిగానే దబాయిస్తున్నారు. ఒక విధంగా ఏపీలో జగన్ పాలనలో పందేరాలకు లోటు లేదు కానీ అభివృద్ధి పడకేసింది అన్నది సగటు జీవి అసంతృప్తిగా ఉంది. దానికి పగుళ్ళు తేరిన రోడ్లే నిట్ట నిలువు సాక్ష్యం. దాంతో జనాలు మాత్రం ప్రగతి కావాలని గట్టిగా అనుకుంటే మాత్రం చంద్రబాబుకు చాన్స్ ఉండొచ్చు అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయన్న సంతోషంతోనే చంద్రబాబు జగన్ మీద కొత్త హుషార్ తో సవాల్ చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి జగన్ దగ్గర ఏ సర్వే నివేదికలు ఉన్నాయో.

Tags:    

Similar News