బాబు సీఎం అవ్వడం ఎప్పటికీ కష్టమేనట

రాజకీయాల్లో ఓడలను బండ్లుగా మార్చేసేవి ఓట్లే మరి. ఒక్క ఓటు అటు నుంచి ఇటు కదిలితే చాలు శాశ్వతం అనుకునే సింహాసనాలు కుప్పకూలిపోతాయి. ఏ ఓటు ఎటువైపు [more]

Update: 2020-12-20 11:00 GMT

రాజకీయాల్లో ఓడలను బండ్లుగా మార్చేసేవి ఓట్లే మరి. ఒక్క ఓటు అటు నుంచి ఇటు కదిలితే చాలు శాశ్వతం అనుకునే సింహాసనాలు కుప్పకూలిపోతాయి. ఏ ఓటు ఎటువైపు వెళ్తుందో ఎంత అవగాహనా ఉన్నా కూడా రాజకీయ దురంధరుడు చంద్రబాబు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. నాటి నుంచి చంద్రబాబు యాంటీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అంటే వైసీపీ ఓటు బ్యాంక్ కి చిల్లులు పెట్టే కార్యక్రమం అన్న మాట. వైసీపీ ఓట్లను ఎంత తగ్గిస్తే తనకు అంత మేలు అని బాబు భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే తరచుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద వైసీపీ సర్కార్ వేధింపులు అని గొంతు చించుకుంటున్నారు.

తేడా అంతేనా…?

గతసారి ఎన్నికల్లో వైసీపీకి దాదాపుగా యాభై శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చినా కూడా ఓట్లు మాత్రం 40 శాతం పైగా వచ్చాయి. అదే ఇపుడు చంద్రబాబు ఆశలను అమాంతం పెంచుతోందిట. పార్టీ క్యాడర్ తో జూమ్ యాప్ మీటింగులు నిర్వహిస్తున్న చంద్రబాబు వారికి ఎక్కడలేని ధైర్యం నూరిపోస్తున్నారు. మనకేం ఢోకా లేదు. వైసీపీకి జనాదరణ బాగా తగ్గింది. పెద్ద ఎత్తున ఓట్లు ఆ పార్టీకి ఈసారి తగ్గిపోతాయి. కేవలం అయిదు శాతం ఓట్లు అటు నుంచి ఇటు చేరితే చాలు జగన్ మాజీ సీఎం అయిపోతారు అంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొడుతున్నారుట.

అది జరిగే పనేనా…?

ఏపీలో ఇప్పటికీ కూడా వైసీపీ బలంగానే ఉందని సర్వేలు వస్తున్నాయి. జగన్ కి ఎన్నికల తరువాత ఇమేజ్ మరింతగా పెరిగింది అని కూడా అంటున్నాయి కొన్ని సర్వే నివేదికలు. జగన్ పార్టీకి గత ఎన్నికలలో 50 శాతం వస్తే ఇపుడు అది 53 శాతానికి పెరిగిందని కూడా మరికొన్ని సర్వేలు ఈ మధ్యనే తేటతెల్లం చేశాయి. అదే సమయంలో టీడీపీకి 40 శాతం ఓట్లు పదిలంగా ఉన్నాయని కూడా తేల్చింది. మరి లెక్కలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం జగన్ కి జనంలో పలుకుబడి తగ్గిందని హడావుడి చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక టీడీపీ క్యేడర్ కూడా అయోమయంలో పడుతోంది.

చీలిస్తే కష్టమే….

ఇక వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో త్రిముఖ పోటీ జరిగితే అది కచ్చితంగా వైసీపీకే మేలు చేస్తుందన్నది అందరికీ తెలిసిందే. వైసీపీ ఓట్లు కొంచెం తగ్గాయనుకున్నా ఆ వ్యతిరేక ఓట్లను పంచుకోవడానికి అటు బీజేపీ జనసేన కూటమి రంగంలో ఉంటుంది. ఆ విధంగా ఓట్లు చీలితే చంద్రబాబు ఎప్పటికీ సీఎం పీఠం ఎక్కడమూ డౌటే. మరో విషయం ఏంటి అంటే ఏపీలో బీజేపీ ఎంత ఎదిగితే అంత టీడీపీ ఓటు బ్యాంక్ కి చిల్లు పడుతుందన్నది. మరి ఈ సంగతి తెలియక చంద్రబాబు జగన్ జేబుల్లో నుంచి ఓట్లను కత్తిరించాలని చూస్తున్నారు. మరి తన జేబు పదిలమేనా అన్న సంగతి చంద్రబాబుకు అర్ధమయ్యేసరికి 2024 ఎన్నికల ఫలితాలు వస్తాయేమో.

Tags:    

Similar News