రూట్ మార్చిన బాబు… అదే సూపర్ ప్లాన్ అట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేరికలపై దృష్టి సారించారు. పార్టీలో చేరికల ద్వారా జోష్ నింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. జిల్లాల వారీగా చేరికలు ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు [more]

Update: 2020-12-20 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేరికలపై దృష్టి సారించారు. పార్టీలో చేరికల ద్వారా జోష్ నింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. జిల్లాల వారీగా చేరికలు ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు ఇప్పటికే టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి నుంచి కొత్త వారిని చేర్చుకుని పార్టీలో నూతన జవసత్వాలు నింపాలన్నది చంద్రబాబు యోచనగా ఉంది. ఇప్పటికే పార్టీలో అన్ని పదవులను భర్తీ చేసిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది.

జగన్ పై విమర్శలు….

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి పదహేడు నెలలు కావస్తుంది. అయితే అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. అభివృద్ధి పనులు పూర్తిగా మందగించాయి. సంక్షేమం పేరిట జగన్ జనం ఖాతాల్లో డబ్బులు వేయడమే తప్ప చేస్తుంది ఏమీ లేదని, నిరుద్యోగం రాష్ట్రంలో విలయ తాండవం చేస్తుందని చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న దాడులను కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు.

చేరికలతోనే మైలేజీ…..

అయితే తాను చేస్తున్న విమర్శలకు పెద్దగా మైలేజీ రావడం లేదని భావించిన చంద్రబాబు ఇప్పుడు చేరికలపై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చేరికలు ఎక్కువగా ఉండాలని చంద్రబాబు ఇప్పటికే నేతలను ఆదేశంచారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో పదవులు రాక, ప్రాధాన్యత దక్కని నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వారిని గుర్తించాలని చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ఎవరైనా పర్లేదట….

ద్వితీయ శ్రేణి నేతల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకూ అసంతృప్తిగా ఉన్న నేతలను వివరించాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో చేరికలు బాగా ఉంటే మూడు రాజధానుల అంశాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించే అవకాశముందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కొందరు నేతలు టీడీపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు కూడా ఈ చేరికలు ఉపకరిస్తాయని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. మరి టీడీపీలో చేరికలు ఉంటాయా? చేరేదెవరు? అన్నదే తేలాల్సి ఉంది.

Tags:    

Similar News