పదిహేను నెలల్లోనే ఇలా… మూడేళ్లు ఎలా?

టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పదిహేను నెలల నుంచి టీడీపీ నేతలు ఆర్థికంగా తీవ్ర నష్టపోయారు. అనేక మంది నేతలు కేసుల్లో [more]

Update: 2020-12-15 11:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పదిహేను నెలల నుంచి టీడీపీ నేతలు ఆర్థికంగా తీవ్ర నష్టపోయారు. అనేక మంది నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పదిహేను నెలల్లోనే చంద్రబాబుకు చుక్కలు కన్పిస్తున్నాయి. పార్టీ నేతలు కూడా భయపడి బయటకు రావడం లేదు. తాను పదవులు ఇచ్చి జనంలోకి వెళ్లమని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది.

యాక్టివ్ గా లేక…..

చంద్రబాబు 70 ఏళ్లు దాటడంతో ప్రజల్లోకి రాలేకపోతున్నారు. మరోవైపు టీడీపీ నేతలను వరస పెట్టి టార్గెట్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం వరకూ ఎవరినీ వైసీపీ వదిలిపెట్టడం లేదు. దీంతో చంద్రబాబు అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా జిల్లాకు ఒకరిద్దరు తప్పించి ఎవరూ బయటకు రావడం లేదు. ఒకరకంగా విశాఖకు చెందిన నేతలే కొంత యాక్టివ్ గా ఉన్నారు.

నలుగురైదుగురే…..

ఇక అసెంబ్లీ సమావేశాల్లోనూ తనకు అండగా నిలబడే వారు పెద్దగా లేరు. పేరుకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నలుగురైదుగురు మినహా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే చంద్రబాబు లో ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళుతుందంటున్నారు. జగన్ ను నేరగాడుగా తరచూ మాట్లాడుతున్నారు. ఫేక్ సీఎం అని జగన్ కు కొత్త బిరుదు ఇచ్చారు. ఎన్నికల ముందు కూడా జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని కూడాచంద్రబాబు గుర్తించడం లేదు.

ఓపిక లేదంటూ….

పదిహేను నెలల్లోనే పార్టీకి ఇంత డ్యామేజీ జరిగితే? ఇక మూడేళ్లు గడిపేది ఎలా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. మూడేళ్ల పాటు అధికార పార్టీతో తలపడేంత ఓపిక, ఓర్పు తమకు లేవని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. అందుకే చంద్రబాబు తరచూ రెండేళ్లలో ఎన్నికలంటూ నేతలను ఊరిస్తున్నారు. కానీ చంద్రబాబు ఎన్ని చెప్పినా క్యాడర్, నేతలు మాత్రం ధైర్యంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు.

Tags:    

Similar News