బాబును కవ్విస్తున్న మోడీ ?

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని వెనకటికి ఒక సామెత. ఇది కరెక్ట్ గా చెప్పుకోవాలంటే జమిలి ఎన్నికలకు సరిపోతుంది. జగన్ ముఖ్యమంత్రిగా [more]

Update: 2020-12-04 15:30 GMT

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని వెనకటికి ఒక సామెత. ఇది కరెక్ట్ గా చెప్పుకోవాలంటే జమిలి ఎన్నికలకు సరిపోతుంది. జగన్ ముఖ్యమంత్రిగా నెగ్గిన కొత్తల్లో ఢిల్లీలో మోడీ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. అందులో మిగిలిన వారి సంగతెలా ఉన్నా ఏపీ సీఎం హోదాలో జగన్ జమిలి ఎన్నికలకు జై అనేశారు. అంటే ఇప్పటికి ఏడాదిన్నర క్రితం మాట అన్న మాట. ఇపుడు జగన్ ఆ మాట అంటారో లేదో కూడా ఎవరికీ తెలియదు. మళ్ళీ ఇన్నాళ్ళకు మోడీ మాత్రం జమిలి ఎన్నికల పాట అందుకున్నారు. అది కూడా అఖిల భారత స్పీకర్ల ముగింపు సదస్సులో.

తీరని కోరికగానే…?

బీజేపీకి అది తీరని కోరికగానే ఉంది. 2018 టైంలో కూడా ఇలాంటి ప్రతిపాదన వస్తే ముందుగా ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకించింది. చంద్రబాబు కొలువులో అయిదు కీలక శాఖలను నిర్వహిస్తూ సర్వం తానే అయి కధ నడుపుతున్నవారసుడు లోకేష్ మేము ఒక్క రోజు కూడా అధికారాన్ని వదులుకోమని భారీ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. రాజకీయంగా చూస్తే మొగ్గ లాంటి లోకేష్ నోటే ఆ మాట వస్తే రాజకీయ ధురంధరులు ఎందరో ముఖ్యమంత్రులుగా ఉన్న ఈ దేశంలో ముందస్తు ఎన్నికలకు అధికారం వదులుకుని ఎలా ఒప్పుకుంటారు. ఇది కదా అసలు పాయింట్.

బాబుకు బూస్ట్ ….

ఇక చంద్రబాబుకు ఆయన పార్టీ తీరు ఏంటో అర్ధం కావడం లేదు. చేతిలో ఉన్న పనిని ఆయన చేశారు. పార్టీ పదవులు పెంచి మరీ ఇబ్బడి ముబ్బడిగా పంచేశారు. కానీ క్యాడర్ ఇంకా మొద్దు నిద్ర లేవలేదు. అనుమానపు చూపులు అలాగే ఉన్నాయి. సందు దొరికితే చాలు సంచి సర్దేదామనుకునే బ్యాచ్ కూడా అలాగే ఉన్నారు. వీరిని బతిమాలి బామాలి టీడీపీ అధినాయకత్వం అలసిపోయింది. దాంతో జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు చాలా కాలం క్రితమే పాట అందుకున్నారు. ఇపుడు అదే పాట మోడీ కూడా అందుకునేసరికి చంద్రబాబుకు ఎక్కడ లేని బూస్ట్ వచ్చినట్లు అయింది.

ఇదే తారక మంత్రం…..

నిజంగా జరుగుతాయో లేదో తెలియని జమిలి ఎన్నికల గురించి చంద్రబాబు ఇక మీదట ధైర్యంగా తన పార్టీ వారికి జూం యాప్ ద్వారా ధూం ధాం గా చెప్పుకోవచ్చు. జమిలి ఎన్నికలు నేడో రేపో అని కూడా డేట్లు కూడా చెప్పేయవచ్చు. అంతే కాదు కళ్ళు మూసుకుంటే చాలు జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి. మళ్ళీ మీరు నేనూ అందరమూ అధికార అందలాలకు చేరువ కావచ్చు అని మల్టీ కలర్ సినిమాలు తమ్ముళ్ళకు చక్కగా చూపించవచ్చు. మొత్తానికి మోడీ యాధాలాపంగా అన్నారా, మనసులోని మాటను చెప్పారా. అలా జరగాలని కోరుకున్నారా తెలియదు కానీ జమిలి ఎన్నికలు అని బాహాటంగా అనేశారు. అది చాలు చంద్రబాబు తన పార్టీని మరో మూడున్నరేళ్ళు జాగ్రత్తగా నడుపుకోవడానికి.

Tags:    

Similar News