ఇక రిపేరు కష్టేమేనా? సొంత వాళ్లే శోకం తెప్పిస్తున్నారే?

న‌మ్మకం అనేది సాధార‌ణ జీవితాల్లో కావొచ్చు.. రాజ‌కీయాల్లో కావొచ్చు.. అత్యంత కీల‌కం. అయితే, ఈ నమ్మక‌మే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా వేధిస్తోంది. తాను న‌మ్మిన [more]

Update: 2020-04-26 00:30 GMT

న‌మ్మకం అనేది సాధార‌ణ జీవితాల్లో కావొచ్చు.. రాజ‌కీయాల్లో కావొచ్చు.. అత్యంత కీల‌కం. అయితే, ఈ నమ్మక‌మే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా వేధిస్తోంది. తాను న‌మ్మిన నాయ‌కులు చాలా మంది ఇప్పుడు త‌న‌పైనే యుద్ధం ప్రక‌టించారు. త‌న పార్టీలో ప‌ద‌వులు అలంక‌రించిన నాయ‌కులు కూడా ఇప్పుడు పార్టీని ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు ఎక్కడా క‌నిపించడం లేదు. ఈ ప‌రిణామం చంద్రబాబుకు నిజంగా వేధింపే. పార్టీని ముందుండి న‌డిపిస్తార‌ని భావించి.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వేరే వేరే పార్టీల నుంచి వ‌చ్చిన వారికి కూడా చంద్రబాబు త‌డుముకోకుండా టికెట్లు ఇచ్చారు. అయితే, వారంతా ఓడిపోయారు. సాధార‌ణంగా ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే. కానీ, ఓడిపోయిన నాయ‌కులు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నప్పటికీ.. వారి మ‌న‌సంతా కూడా వేరే పార్టీల‌పై ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చకు దారితీసింది.

జేసీ బ్రదర్స్ కు ప్రాధాన్యత ఇచ్చినా….

ఇదే చంద్రబాబుకు తీవ్ర మ‌నోవేద‌న‌కు కూడా గురిచేసింది. ఏదైనా విష‌యంలో స్పర్థలు వ‌స్తే.. స‌రిపెట్టుకోవ‌చ్చు.. స‌రిదిద్దుకోవ‌చ్చు. కానీ, ఏకంగా మ‌నుషులే మారిపోతే.. ఇప్పుడు ఎలా? అనే ప్రశ్న వ‌స్తోంది. నిజానికి అనంత‌పురం జిల్లాలో జేసీ బ్రద‌ర్స్‌ను చంద్రబాబు ఎంతో న‌మ్మారు. వారు కాంగ్రెస్ నుంచి వ‌చ్చినా.. పార్టీలో కీల‌క స్థానం ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ వారి వార‌సుల‌కు టికెట్లు ఇచ్చారు. ఇలాంటి వారు చాలా మందే టీడీపీలో ఉన్నారు. అయితే, ఇప్పుడు వీరంతా కూడా టీడీపీ ఓడిపోయిన‌నేప‌థ్యంలో పార్టీకి ఏ ఒక్కరూ అండ‌గా నిలుచుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చంద్రబాబుకు మ‌ద్దతుగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా వినిపించ‌డం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత…..

చంద్రబాబుతో పాటు అప్పుడెప్పుడో 1978లో రాజ‌కీయాలు ప్రారంభించి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి వాళ్లు సైతం ఫ్యాన్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు అదే లిస్టులో మ‌రి కొంత మంది సీనియ‌ర్లు, మాజీలు ఉన్నారు. అయితే వీరంతా స్థానిక సంస్థల ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ మారాల‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో వీళ్లంతా ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు.

సొంత పార్టీ నేతలే…..

ఈ జంప్ జిలానీలు అంతా పేరుకు ఇప్పుడు పార్టీలో ఉంటున్నా త‌మ‌కు వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయ‌ని చెప్పుకొనేందుకు ఉన్న ఉత్సాహం.. త‌మ‌కు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన చంద్రబాబుకు మ‌ద్దతివ్వడంలో మాత్రం క‌నిపించ‌డం లేద‌ట‌. నిజానికి అధికార ప‌క్షం నుంచి చంద్రబాబు కు వ‌స్తున్న వేధింపులు, సూటిపోటి మాట‌ల కంటే కూడా సొంత పార్టీలోనే ఉంటూ.. ఇలా వ్యవ‌హ‌రిస్తున్న నేత‌ల వ‌ల్లే వేధింపులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు బాబు అనుచ‌రులు. ఎదుట క‌నిపించే శ‌త్రువు క‌న్నా.. మ‌న వెన‌కే ఉండే ఇలాంటి మిత్రుల‌తోనే ఇప్పుడు టీడీపీకి అస‌లు సిస‌లైన స‌వాళ్లు ఎదురు కానున్నాయి.

Tags:    

Similar News