సైకిల్ తొక్కే తమ్ముళ్ళేరీ బాబూ ?

తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, కేంద్ర కమిటీల పేరిట వందల కొద్దీ పదవులు పంచేశారు. అందరూ నాయకులే అంటూ మల్టీ కలర్ సినిమా [more]

Update: 2020-11-26 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, కేంద్ర కమిటీల పేరిట వందల కొద్దీ పదవులు పంచేశారు. అందరూ నాయకులే అంటూ మల్టీ కలర్ సినిమా చూపించేశారు. అది సరే కానీ క్షేత్ర స్థాయిలో టీడీపీ సీన్ ఏంటి అన్నది ఇప్పటికీ తమ్ముళ్ళకు అర్ధం కావడంలేదు. ఉత్తరాంధ్రా జిల్లా విషయానికి వస్తే చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ఇంచార్జిలు లేరు. ఉన్నా కూడా వారు సరిగ్గా పనిచేయడంలేదు. దాంతో టీడీపీ కుదేల్ అవుతోంది.తమ్ముళ్లు చెల్లా చెదురు అవుతున్నారు.

మంత్రి ఉన్న చోటనే …..

విశాఖ జిల్లా భీమిలీ సీటుని ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు. ఇది టీడీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున అవంతి శ్రీనివాస్ గెలిచి టీడీపీకి గట్టి ఝలక్ ఇచ్చేశారు. అప్పట్లో మొదట మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అనుకున్నారు. ఆ తరువాత లోకేష్ అన్నారు. చివరి నిముషంలో మాజీ ఎంపీ సబ్బం హరిని తెచ్చి పోటీకి దించారు. ఆయన ఓడిపోయాక అటు వైపు చూడడమే మానుకున్నారు. ఇపుడు భీమిలీ టీడీపీకి సరైన దిశానిర్దేశం చేసే ఇంచార్జి లేరన్నది తమ్ముళ్ల ఆవేదన.

ఉన్నా లేనట్లేగా….?

ఇక విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరఫున గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పార్టీలో ఉన్నట్లో లేనట్లో చంద్రబాబుకే తెలియదు. అక్కడ వైసీపీ ఇంచార్జి హోదాలో కేకే రాజు అసలైన ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. ఇక్కడ టీడీపీకి పలికే నాధుడు లేడని అంటున్నారు. ఇక విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. దాంతో ఇక్కడ ఎవరినీ టీడీపీ ఇంచార్జిగా నియమించలేదు. అలాగే ఎలమంచిలి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీలోకి వెళ్ళిపోయారు. దాంతో అక్కడ టీడీపీకి పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఇక ఏజెన్సీలోనూ ఇదే స్థితి. అరకు ఇంచార్జిగా కిడారి శ్రావణ్ కుమార్ ఉన్నా ఉదాశీనంగా ఉంటున్నారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇవ్వవద్దని మాజీ మంత్రి మణికుమారి లాంటి వారు పోరుతున్నారు.

అక్కడ అంతేగా….

విజయనగరం జిల్లాలో చూసుకుంటే లోకల్ గా బొబ్బిలి రాజులు కనబడక ఆ నియోజకవర్గం తమ్ముళ్లు బోరుమంటున్నారు. సాలూరుకి ఇంచార్జి ఎవరూ లేరు. కురుపాం నుంచి లీడర్ గా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు జనార్ధన్ మరణించడంతో అక్కడా ఖాళీగా ఉంది. పార్వతీపురంలో కూడా ఇంచార్జి పదవి కోసం కొట్టుకుంటున్నారు. శ్రీకాకుళంలో చూసుకున్నా చాలా నియోజకవర్గాల్లో ఇదే సీన్ ఉంది. మొత్తానికి సైకిల్ పరుగులు తీయాలని చంద్రబాబు గట్టిగా పిలుపు ఇస్తున్నారు. కానీ సవారీ చేసే తమ్ముళ్ళేరి అన్నదే పార్టీ నేతల ఆవేదనగా ఉందిట. మరి బాబు దీని మీద సీరియస్ గా ఆలోచిస్తారా.

Tags:    

Similar News