కలరింగ్ కోసమేనా? షివరింగ్ అవ్వకూడదనేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ కోరుకున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విచిత్రమైన వాదనలు [more]

Update: 2020-04-21 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న 70వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ కోరుకున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విచిత్రమైన వాదనలు నిన్న అంతటా విన్పించాయి. అదే చంద్రబాబు వయసు మీద. చంద్రబాబు ప్రస్తుతం 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు నాయకత్వంపై అపనమ్మకం ఏర్పడింది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు లో శక్తి సన్నగిల్లుతుందన్న ప్రచారం టీడీపీ ప్రత్యర్థులు జోరుగా చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తున్నా….

చంద్రబాబు ఎప్పటికప్పుడు దీనిపై వివరణలు ఇస్తూ వస్తున్నారు. తనకు వయసు మాత్రమే పెరిగిందని, మానసికంగా తాను యువకుడినేనని, ఇరవై అయిదేళ్ల యువకుడిలా తాను ఇప్పటికీ ఆలోచిస్తానని చెప్పుకొచ్చేవారు. తన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, క్రమశిక్షణ తన ఆరోగ్య రహస్యాలని కూడా చంద్రబాబు చెబుతారు. తాను మరో ఇరవై ఏళ్ల వరకూ రాజకీయాల్లో ఉంటానని ఇటీవల పలు సమావేశాల్లో చంద్రబాబు వెల్లడించారు.

సోషల్ మీడియాలో సెటైర్లు……

నిజానికి చంద్రబాబు వయసు పెరుగుతుందని, ఇక టీడీపీకి నాయకత్వం వహించేదెవరన్న చర్చ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు చంద్రబాబు వయసును పదే పదే గుర్తు చేస్తున్నారు. టీడీపీ పని అయిపోయినట్లేనని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ ది చిన్న వయసు కావడంతో దీనికి సరైన కౌంటర్ టీడీపీ శ్రేణుల నుంచి రావడం లేదు.

అందరి వయసులను గుర్తు చేస్తూ….

కానీ నిన్న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు దీనిని చక్కగా వినియోగించుకున్నాయి. చంద్రబాబు వయసు అంశాన్ని మర్చిపోయేలా టీడీపీ శ్రేణులు పోస్టింగ్ లు పెట్టారు. మోదీ మరో ఐదు నెలల్లో 70వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నారని ఒకరు కామెంట్ చేశారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 73 అని మరొకరు గుర్తు చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ వయసు 77 ఏళ్లు అని, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వయసు 77 అంటూ ట్వీట్ చేశారు. అంటే చంద్రబాబు వయసు పై మాట్లాడిన వారికి టీడీపీ శ్రేణులు ఈ విధంగా సమాధానం చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు మరో పదిహేనేళ్లు సులువుగా రాజకీయాలు చేయగలరంటూ ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేయడం విశేషం.

Tags:    

Similar News