అన్ని అస్త్రాలు వాడేశారా..?

చంద్రబాబుకు చాణక్యుడు అని పేరు ఎందుకు వచ్చిందో ఒక్కోసారి ఎవరికీ అర్ధం కూడా కాదు. ఆయన 2018 వేళ బీజేపీ నుంచి బయటకు వచ్చి మోడీ మీద [more]

Update: 2020-11-17 14:30 GMT

చంద్రబాబుకు చాణక్యుడు అని పేరు ఎందుకు వచ్చిందో ఒక్కోసారి ఎవరికీ అర్ధం కూడా కాదు. ఆయన 2018 వేళ బీజేపీ నుంచి బయటకు వచ్చి మోడీ మీద పోరాటం చేయడాన్ని ఎవరైనా చాణక్య నీతి అని అనగలరా. అంతే కాదు, ఎన్టీఆర్ మూల సిద్ధాంతం అయిన కాంగ్రెస్ వ్యతిరేకతను గోదాట్లో ముంచేసి అదే కాంగ్రెస్ తో చంద్రబాబు అంటకాగడాన్ని ఏ రాజకీయ నైపుణ్యంగా అభివ‌ర్ణించాలి. జగన్ అనే ఒక మూడు నెలల కుర్ర ఎంపీని ఆనాడే అతి పెద్ద భూతంగా ఊహించేసుకుని ఇంతటి పొలిటికల్ ఎవరెస్ట్ శిఖరం చేసిన చంద్రబాబువి ఏం తెలివి తేటలు అని మెచ్చాలి.

తొందరెందుకబ్బా…?

ఏపీలో జగన్ కి జనాలు ఒకసారి అవకాశం ఇచ్చారు. అలా ఇలా కాదు, 151 సీట్లతో భారీ ఎత్తున మోజు పెంచుకుని మరీ కిరీటం పెట్టారు. నిజానికి ఇంతటి మెజారిటీ వచ్చినపుడు జనాల ఆకాంక్షలు కూడా అలాగే ఉంటాయి. అది చంద్రబాబు లాంటి రాజకీయ కోవిదుడికి వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తమ కోరికలు జగన్ తీర్చకపోతే వచ్చే వ్యతిరేకత ఇంతకు రెట్టింపు కూడా ఉంటుంది. ఓ వైపు ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందులో ఉన్న రాష్ట్రం. మరో వైపు ఖజానాలో నిధులు లేవు. కేంద్ర సాయం లేదు. జగన్ చేతికి ఎముక లేకుండా హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేసి కూర్చున్నారు. ఆయన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వేళ చంద్రబాబు కాస్తా ఓపిక పడితే కొంపలేమి అంటుకుపోతాయో అర్ధం కాదుగా.

నేరం నాది కాదు ….

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు అదే పనిగా విరుచుకుపడుతున్నారు. అలా ఇలా కాదు, ఆయన ఏ పని చేసినా కుర్చీ దిగిపోవాలన్నంతగా. దానికి తోడు అటు అనుకూల మీడియాతో పాటు, ఇటు తనకు ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా ఎడా పెడా వాడేసుకుని కేవలం ఏణ్ణర్ధం కాలంలోనే జగన్ కాలు కదపుకుండా చేయగలిగాను అని బాబు సంబరపడుతున్నారు. అయితే ఇక్కడే జగన్ తెలివిని మెచ్చాలి. జగన్ ఈ విషయాలు అన్నీ కూడా ఎప్పటికపుడు పూస గుచ్చినట్లుగా జనాలకు చేరవేస్తున్నాడు. అంతే కాదు, చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ తనను ఎలా అడ్డుకుంటున్నాడో కూడా చెబుతున్నారు. నేరం నాది కాది చంద్రబాబుది అంటున్నారు. నేను ఇళ్ళ పట్టాలతో సహా ఏ ఒక్క పధకం అమలు చేయకపోయినా అది బాబు తప్పేనని జగన్ అపుడే జనంలోకి మెసేజ్ పంపేశారు.

గుడ్డి వ్యతిరేకతతో …?

చంద్రబాబుకు తెలివి లేదు అని ఎవరూ అనడంలేదు కానీ ఆయన గుడ్డి వ్యతిరేకతతో జగన్ మీద వేళ కాని వేళ బాణాలు వేస్తున్నారు. ఫలితంగా సానుభూతి పెంచుతున్నారు. ఇపుడు చంద్రబాబు వద్ద అన్ని అస్త్రాలు కూడా అయిపోయాయి. జగన్ ఏ పనీ చేయలేదని బాబు అండ్ కో దండోరా వేస్తున్నారు. కానీ బాబు వల్లనే జగన్ కనీసం ఏమీ చేయలేకపోతున్నారు అన్నది బాబు అనుకూల మీడియా రాసిన పెద్ద పెద్ద రాతల ద్వారా తెలిసిపోయింది. కోర్టులు జగన్ సర్కార్ కి ఎన్నిసార్లు మొట్టికాయలు వేశాయో పతాక శీర్షికలు పెట్టి మరీ అనుకూల మీడియా అచ్చేస్తోంది. అవన్నీ జనాలకు చేరాక జగన్ ఎందుకు ఏ పని చేయలేదంటే కారణం బాబు కాక మరెవరు అవుతారు. అంటే తెలిసి తెలిసి అనుకూల మీడియా బాబుకు చెరుపు చేస్తోంది. చంద్రబాబు కూడా జగన్ అంటే పడని విద్వేషంతో తప్పులో కాలు వేస్తున్నారు. నిజానికి జగన్ మానాన‌ ఆయన్ని వదిలేస్తే ఈపాటికి జనాలకు ఏమి చేసేవాడో, చేయలేకపోయేవాడో పూర్తిగా తెలిసిపోయేది. చివరికి తప్పు ఆయన మీదకే పడేది. చంద్రబాబు వైపు జనం చూసేవారేమో. కానీ పెద్దాయన ఇలాంటి యాంటీ జగన్ పాలిటిక్స్ తలకెత్తుకుని జగన్ కి మరింత రాజకీయ ఆయుష్షు అందిస్తున్నాడు అని విశ్లేషణలు అయితే ఉన్నాయి.

Tags:    

Similar News