కొత్త రక్తం అంటే ఇదేనా?

వెనకటికి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక సరదా సెటైర్ ప్రచారంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఒకటి రెండు కుటుంబాలదే పెత్తనం. అందువల్ల కుటుంబ పెద్ద ప్రధాన నాయకుడు [more]

Update: 2020-11-15 12:30 GMT

వెనకటికి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక సరదా సెటైర్ ప్రచారంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఒకటి రెండు కుటుంబాలదే పెత్తనం. అందువల్ల కుటుంబ పెద్ద ప్రధాన నాయకుడు అయితే కొడుకు యువజన నాయకుడు, భార్య మహిళా నాయకురాలు. ఇలా అన్ని పదవులూ ఆ ఇంట్లోనే ఉంటాయన్నమాట. అంటువంటి కాంగ్రెస్ ను, దాని వారసత్వాన్ని కుక్క మూతి పిందెలతో పోల్చిన అన్న ఎన్టీయార్ కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టారు. అయితే అయన సైతం వారసత్వ బెడద నుంచి తప్పించుకోలేకపోయారు. ఇద్దరు అల్లుళ్ళూ పార్టీలో చేరో గ్రూపుని నడిపి చివరకి పెద్దాయన కుర్చీ కిందకే నీళ్ళు తెచ్చేశారు.

అదే ఫార్ములా…

ఇక చంద్రబాబు జమానా చూసుకుంటే ఆయనదంతా కాంగ్రెస్ కల్చర్ అని చెప్పాలి. ఆ విషయంలో చంద్రబాబు బాహాటంగా చెప్పుకోవడానికి అసలు వెరవరు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే నిండు సభలో తన రక్తంలో ముప్పై శాతం కంగ్రెస్ ది ఉందని గొప్పగా చెప్పుకున్నారు. ఇక చంద్రబాబు పాతికేళ్ల తన సారధ్యంలో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కి డిటోగా చేయడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. ఆయనకు పార్టీలో కొత్త రక్తం అంటే సొంత పార్టీ నాయకుల పుత్ర రత్నాలే.అంతే తప్ప ఆరుగాలం పార్టీ జెండా మోసిన అసలైన కార్యకర్తలు కారు అని అంటున్నారు.

వారితోనే అలా…..

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు చూసుకుంటే టీడీపీని వారసులతో నింపేసారు. విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున. ఈయనకు పెదనాన్న కిమిడి కళా వెంకటరావు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు ఫ్యామిలీకే పెద్ద పీట. దానికి తోడు ఇపుడు గౌతు శ్యామ సుందర శివాజీ కూతురు శిరీషకు కూడా రాష్ట్ర కమిటీలో చాన్స్ ఇచ్చారు. విశాఖలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ని ఏకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసేశారు. వీరితో పాటు పదుల సంఖ్యలో వారసులు చాలా మంది ఇతర పదవుల్లో కనిపిస్తారు.

అయ్యే పనేనా…?

విజయనగరం జిల్లాలో చూసుకుంటే అపుడే కిమిడి నాగార్జున మీద వ్యతిరేకత వచ్చిపడింది. ఆయన్ని కాదని మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు జెండా ఎగరేస్తున్నారు. ఇక విజయనగరం ఇన్చార్జి అదితి గజపతిరాజుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పావులు కదుపుతున్నారు. అయ్యన్న కుటుంబం తప్ప నర్శీపట్నంలో ఎవరూ లేరా అన్న చర్చ కూడా ఉంది. పలాసలో అయితే గౌతు ఫ్యామిలీని ఓడించినా కూడా చంద్రబాబుకు వారే ముద్దా అని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వారసులతో బాబు తరించిపోతుంటే క్యాడర్ మాత్రం నిరసన తెలియచేస్తోంది.

Tags:    

Similar News