బాబుకు మరో షాక్ తప్పేట్లు లేదుగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంచనాలు అన్నీ తప్పవుతున్నాయి. ఆయన తనకు నమ్మకంగా ఉంటారనుకున్న నేతలు కూడా పార్టీలో ఇమడలేకపోతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన సొంత [more]

Update: 2020-11-05 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంచనాలు అన్నీ తప్పవుతున్నాయి. ఆయన తనకు నమ్మకంగా ఉంటారనుకున్న నేతలు కూడా పార్టీలో ఇమడలేకపోతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన సొంత జిల్లా చిత్తూరు లో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నా ఎవరూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయడం లేదు. చిత్తూరు జిల్లాలో గల్లా, డీకే కుటుంబాలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇస్తున్నారు కూడా.

పదవుల్లోనూ ప్రాధాన్యత…..

తాజాగా నియమించిన పదవుల్లోనూ ఈ రెండు కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గల్లా అరుణకుమారి, డీకే సత్యప్రభలను చంద్రబాబు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. డీకే కుటుంబానికి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది. పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు. ఆయన మరణం తర్వాత భార్య సత్యప్రభ టీడీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు.

టీడీపీలో ఇమడలేక….

కానీ డీకే కుటుంబం పార్టీని వదిలి వెళ్లిపోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం మినహా ఎక్కడా టీడీపీ గెలుపునకు నోచుకోలేదు. చంద్రబాబు సొంత జిల్లాలో ఈ పరిస్థితులను చూసి డీకే కుటుంబం వైసీపీలో చేరాలని నిర్ణయించుకుంది. ఇటీవల తిరుమల వచ్చిన జగన్ ను డీకే కుమారుడు శ్రీనివాస్ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసీపీలోకి వెళ్లేందుకు…..

అయితే చంద్రబాబు డీకే కుటుంబాన్ని వదులుకోకూడదని భావించి ఆమెకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కానీ డీకే కుటుంబం మాత్రం వెళ్లిపోయేందుకే సిద్ధమయిందని తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు ముందే ఈ కుటుంబం వైసీపీ కండువా కప్పుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు డీకే కుటుంబం చిత్తూరు జిల్లా మంత్రితో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్ తప్పేట్లు లేదు.

Tags:    

Similar News