పాతికేళ్ల సారధ్యం పతనం వైపుకేనా ?

చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అంటారు. తిమ్మిని బమ్మిని చేయగలు అని చెబుతారు. ఆయన సమర్ధత మీద చాలా ఎక్కువ చేసి చెబుతారు. కానీ ఆయన మామ ఎన్టీయార్ [more]

Update: 2020-10-28 03:30 GMT

చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అంటారు. తిమ్మిని బమ్మిని చేయగలు అని చెబుతారు. ఆయన సమర్ధత మీద చాలా ఎక్కువ చేసి చెబుతారు. కానీ ఆయన మామ ఎన్టీయార్ తో పోల్చినా సమకాలీన రాజకీయ నేతలతో చూసుకున్నా కూడా చంద్రబాబు సారధ్యంలోని డొల్లతనం ఏంటో ఇట్టే బోధపడుతుంది. ఎన్టీయార్ టీడీపీని స్థాపించాక వరసగా నాలుగు ఎన్నికలను ఎదుర్కొన్నారు. అందులో ఒక్కటి తప్ప మూడు సార్లు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పద్నాలుగేళ్ళ రాజకీయ జీవితంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్ళకు పైగా పనిచేశారు. మరో వైపు జగన్, కేసీయార్ కూడా అద్భుత విజేతలుగా తెలుగు రాజకీయాల్లో కనిపిస్తారు.

ఏ తీరానికో ….

ఇక చంద్రబాబు 1995 ఆగస్ట్ సంక్షోభం తరువాత టీడీపీ పగ్గాలు అందుకున్నారు. ఈ ఏడాదికి సరిగ్గా పాతికేళ్ళు నిండిపోయాయి. ఈ మొత్తం రాజకీయ ప్రస్థానంలో చూసుకుంటే అయిదు సార్లు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎన్నికలను ఎదుర్కొంది. అందులో కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే అధికారం అందుకుంది. అది కూడా పొత్తులతోనే సుమా. ఇక మరో మూడు సార్లు ఓడితే అందులో రెండు సార్లు దారుణమైన పరాజయం టీడీపీని వెంటాడింది. ఇపుడు 2024 ఎన్నికల మీద టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఒక విధంగా చావో రేవో లాంటి ఎన్నికలు ఇవి.

జవసత్వాలు తగ్గాయా….?

టీడీపీ వయసు నలభయ్యేళ్ళకు చేరువ అవుతోంది. చంద్రబాబు డెబ్బయ్యేళ్ళు దాటారు. ఈ నేపధ్యంలో ఆయన చుట్టూ ఉన్న వారు కూడా వృధ్ధ నాయకులే. కొత్త రక్తం అంటూ టీడీపీ చేస్తున్న జిమ్మిక్కులన్నీ కూడా వారసుల కోసమే. అంటే పార్టీ పుట్టాక అపుడున్న వారే తప్ప ఇప్పటికీ కొత్త తరాన్ని మాత్రం తయారు చేయలేకపోయిందన్న మాట. ఈ నేపధ్యంలో పార్టీకి అర్జంటుగా విజయం కావాలి. దాంతో ఏపీ టీడీపీ పగ్గాలు బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడుకు అప్పగించారు. అచ్చెన్నను చూసే ఇపుడు చంద్రబాబు సహా అంతా ఆశలు పెంచుకుంటున్నారు. అంటే టీడీపీ మూడవ తరం వారసత్వంలో పస లేదా.లేక కొత్త తరానికి జవసత్వాలు త‌గ్గాయా అన్నది ఒక చర్చగా ఉంది.

ఎలా చూసినా ఇబ్బందే …?

తెలుగుదేశం నావకు ఇపుడు అచ్చెన్న చుక్కానిగా మారారు. చంద్రబాబు అంతటి వాడే కింజరాపు కుటుంబం మీద ఆధారపడిన తరువాత తమ్ముళ్లకు కూడా అసలైన బాహుబలి ఎవరో తెలిసిపోవడంలేదా. దాంతో అచ్చెన్నకు ఒక్కసారిగా టీడీపీ క్యాడర్ తరఫున ప్రశంసలు పెరుగుతున్నాయి. మీరే చంద్రబాబుని మళ్ళీ సీఎంని చేయాలని తమ్ముళ్ళు అంటున్నారు. ఇది గతంలో వినని మాట. ఇంతకాలం చంద్రబాబే ఎవరినైనా రాజుని చేసేది. కానీ అచ్చెన్న ఇపుడు బాబుకు కిరీటం తొడగాలి అంటే ఆయన అంతటి సమర్ధుడు అని టీడీపీ మొత్తం అంగీకరించినట్లే కదా. మరి అచ్చెన్న కళా వెంకటరావు మాదిరి కాదు, దూసుకుపోతారు. అదే కనుక జరిగితే టీడీపీ మూడవ తరం వారసునికి పెద్ద ఇబ్బందే. అలా కాదని ఆయన కాడి వదిలేసినా పార్టీకి ఇబ్బందే. మొత్తానికి అచ్చెన్న నియామకం కాదు కానీ ఒక బలమైన అగ్ర కుల సారధ్యం నుంచి టీడీపీ పగ్గాలు మెల్లగా బీసీల వైపు మారుతున్నాయా అన్నదే కొత్త చర్చ.

Tags:    

Similar News