జగన్ ని ఆ సెంటిమెంట్ తో కొడతారట ?

సెంటిమెంట్ అన్నది ఇపుడు పెద్దగా వర్కౌట్ కానీ సీజన్ నడుస్తోంది. ఎవరు చనిపోయినా కూడా సోషల్ మీడియాలో ఆర్ ఐ పీ అని ఒక మెసేజ్ పడేసి [more]

Update: 2020-10-24 12:30 GMT

సెంటిమెంట్ అన్నది ఇపుడు పెద్దగా వర్కౌట్ కానీ సీజన్ నడుస్తోంది. ఎవరు చనిపోయినా కూడా సోషల్ మీడియాలో ఆర్ ఐ పీ అని ఒక మెసేజ్ పడేసి తమ పని తాము చూసుకునే దారుణమైన రోజులు వచ్చేశాయి. మరి ఈ రోజుల్లో కూడా సెంటిమెంట్లను రాజకీయ పార్టీలు నమ్ముకోవడమే చిత్రం. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అన్న నందమూరి నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ సెంటిమెంట్ తో పార్టీ పెట్టి కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించారు. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణా సెంటిమెంట్ కూడా బాగానే పండింది. ఏకంగా రాష్ట్రం సాధించారు. ఇపుడు మరోమారు తెలుగు సెంటిమెంట్ ని టీడీపీ రగిలించాలని చూస్తోంది. అది జరిగే పనేనా?

సీజేఐ గా ఛాన్స్….

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగువారికి సీజేఐ అయ్యే చాన్స్ వస్తే దాన్ని ఏపీ సీఎం హోదాలో జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రచారం స్టార్ట్ చేశారు. నిజానికి చంద్రబాబు వల్లనే సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్ వీ రమణ మీద ఆరోపణలు వచ్చాయన్న సంగతిని తెలివిగా పక్కన పెట్టేస్తూ బాబు ఎదురుదాడికి దిగడం నిజంగా ఫార్టీ యియర్స్ పాలిటిక్స్ కే చెల్లిందనుకోవాలేమో. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఇంతవరకూ మేధావులు, చదువరులు మాత్రమే అనుకునేవారు. జగన్ పుణ్యమాని ఇది సామాన్యుడికి కూడా చేరిపోయింది. ఇవన్నీ దాచేసి జగన్ కక్షకట్టి మరీ ఒక తెలుగువాడిని సీజేఐ కాకుండా చేస్తున్నాడు అంటూ కొత్త వాదనను చంద్రబాబు తెర మీదకు తెస్తున్నారు.

తెలుగు పౌరుషమట….

తెలుగువారికి ప్రధాని అయ్యే చాన్స్ వస్తే టీడీపీ పోటీకి పెట్టకుండా పీవీ నరసింహారావుని ఎంపీగా గెలిపించిదని చంద్రబాబు అంటున్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా వెలగాలని అంతా కోరుకుంటారని కూడా సుద్దులు చెబుతున్నారు. జగన్ మాత్రం రమణను సీజేఐ కాకుండా కుట్రలు చేస్తున్నాడని చంద్రబాబు ఆడిపోసుకుంటున్నారు. ఈ విధంగా తెలుగు సెంటిమెంటుని రగిల్చి జనాల్లో జగన్ పట్ల ద్వేషాన్ని పెంచాలని చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ విషయం ఏంటి అంటే ఇప్పటిదాకా చూస్తే చాలా మంది తెలుగు వారు సీజేఐ గా పనిచేశారు. అపుడెపుడో అయిదు దశాబ్దాల క్రితమే కోట సుబ్బారావు అని తెలుగు వ్యక్తే సీజేఐగా చేసిన రోజుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన తీర్పును వ్యతిరేకించారని చెబుతారు. అందువల్ల ఇది తెలుగు వారితో ముడిపెట్టి రాజకీయం చేయడం దివాళాకోరుతనమే అంటున్నారు.

వారు కలసొస్తారా…?

సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక్క జగన్ లేఖ వల్ల జస్టిస్ రమణ సీజేఐ కాకుండా ఎవరూ అడ్డుకోలేరని న్యాయ కోవిదులు చెబుతున్నారు. ఆయనను ఆ పదవిలోకి తీసుకోవాలా వద్ద అన్నది నిర్ణయించేది ప్రధాని, రాష్ట్రపతి తప్ప మరొకరు కారు అని కూడా అంటున్నారు. చంద్రబాబు విమర్శలు ఎలా ఉన్నాయంటే రమణను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో తెలిసి తెలిసి ఒక సీనియర్ మోస్ట్ న్యాయవాది పరువు తానే తీస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ తెలుగు సెంటిమెంట్ ఒక్క ఆంధ్రాకే పరిమితమా అన్న మాట కూడా ఉంది. ఉమ్మడి ఏపీ రెండు ముక్కలయ్యాక తాము తెలంగాణా వారిమని పక్కరాష్ట్రం వారు అంటారు. అలాటపుడు చంద్రబాబు సెంటిమెంట్ ఆయింట్మెంట్ గా అక్కడే కరిగిపోతోందిగా.

Tags:    

Similar News