పెదబాబు సైడ్…చినబాబు రైడ్

తెలుగుదేశం పార్టీ మెల్లగా నాలుగు పదుల వయసులోకి వస్తోంది. అంటే అది కచ్చితంగా నడివయసు. బాల్యమంతా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్ చేతిలలో బంగారంలా గడిచింది. ఇక యవ్వనప్రాయం [more]

Update: 2020-10-22 14:30 GMT

తెలుగుదేశం పార్టీ మెల్లగా నాలుగు పదుల వయసులోకి వస్తోంది. అంటే అది కచ్చితంగా నడివయసు. బాల్యమంతా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్ చేతిలలో బంగారంలా గడిచింది. ఇక యవ్వనప్రాయం సంతరించుకునేసరికి సరైన రౌతుగా చంద్రబాబు నిలిచారు. పాతికేళ్ల పాటు పార్టీని పరుగులు తీయించారు. ఇక ఆయన ఇపుడు ఏడుపదుల వయసులో ఉన్నారు. పార్టీ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా పతనావస్థకు చేరుకుంది. కొత్త జవసత్వాలు కావాలి అంటోంది. మరి పార్టీని దౌడ్ తీయించే రైడర్ కూడా కావాలి. వారసత్వ పార్టీకి చినబాబే అలా దిక్కు అయ్యారు.

తెర వెనక్కేనా….

చంద్రబాబుకు కరోనా ఒక పెద్ద గుణపాఠమే నేర్పింది. దేశంలో కరోనా రాకపోతే ఇంకా బాబు ఊరూరా పట్టుకుని తిరిగేవారే. ఇపుడు మాత్రం ఆరేడు నెలలుగా ఆయన తెర వెనకే ఉంటున్నారు. ఈ మధ్యలోనే అనేక పరిణామాలు కూడా జరిగిపోయాయి. పార్టీని లోకేష్ చేతిలో పెట్టాలన్న బాబు తాపత్రయానికి తగినట్లుగానే తమ్ముళ్ళు మీరు రాకపోతే పోయె కనీసం చినబాబునైనా పంపించండి. ఆయన్ని ఏపీలో ఉంచండి అంటూ మొరపెట్టుకున్నారు. సరిగ్గా ఇదే బాబు కూడా కోరుకున్నారు. దాంతో తాను వెనక ఉండి కుమారుడిని ముందుకు నెట్టారు. ఈ పరిణామంతో లోకేష్ బ్యాచ్ ముందుకు వచ్చేసినట్లు అయింది.

అంతా అలంకారమే….

పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆయనే సైడ్ అయిపోయి కొడుకుకి దారి ఇచ్చేశాక మిగిలిన వారు సైతం సరెండర్ కాక తప్పదు. బాబు తో పాటే వృధ్ధ తరం నాయకులు ఇక రెస్ట్ తీసుకుంటారన్నమాట. అలాగే రాష్ట్ర కమిటీలు, దాని అధ్యక్షుడు కూడా లోకేష్ బాటలోనే సాగాలి. అలా చినబాబు నాయకత్వంలోనే పార్టీ ముందుకు సాగుతుంది అన్న మాట. దానికి సంకేతంగా తాజాగా తెలుగు మహిళా విభాగం ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి చినబాబే పౌరోహిత్యం చేశారు. తన సారధ్యంలోనే ఈ కధ మొత్తం రక్తి కట్టించారు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలకు చంద్రబాబు హాజరు తప్పనిసరి. పైగా ఆయన రొటీన్ స్పీచ్ కూడా ఉంటుంది. కానీ ఈసారి చినబాబే అధ్యక్ష స్థానం అలంకరించేశారు.

ఇక ముందుకే…..

ఇదే పద్ధతిలో అమరావ‌తి రాజధాని రైతుల 300 రోజుల ఉద్యమానికి కూడా లోకేష్ హాజరై సంఘీభావం తెలిపారు. అలాగే ఆయన పార్టీ పెద్దల పరామర్శలకు కూడా వెళ్తున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ దివాకరరెడ్డి అరెస్ట్ అయినపుడు కూడా వారి ఇళ్ళకు వెళ్లి మాట్లాడింది లోకేష్ బాబే. మొత్తానికి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీకు న్యాయం చేస్తాను, టికెట్లు ఇస్తాను అంటూ చినబాబు పెద్ద హామీలే ఇస్తున్నాడు అంటే చంద్రబాబు మెల్లగా తప్పుకుంటున్నట్లుగానే ఉంది. చూడాలి మరి జూనియర్ బాబు ఎంత స్పీడ్ పెంచుతాడో.

Tags:    

Similar News