బాబుకు ప్రత్యామ్నాయం ఎవరు? కమ్మ నేతల ఆలోచన

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం.. క‌మ్మలు. పార్టీని ఆర్థికంగా ఆదుకోవ‌డంలోను, ప‌ద‌వులు పొంద‌డంలోను, ప్రభుత్వంతో ప‌నులు చేయించుకోవ‌డంలోను, పార్టీ అధినేత చంద్రబాబును [more]

Update: 2020-10-22 06:30 GMT

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం.. క‌మ్మలు. పార్టీని ఆర్థికంగా ఆదుకోవ‌డంలోను, ప‌ద‌వులు పొంద‌డంలోను, ప్రభుత్వంతో ప‌నులు చేయించుకోవ‌డంలోను, పార్టీ అధినేత చంద్రబాబును కంటికి రెప్పగా కాపాడుకోవ‌డంలోను వారు కీల‌క పాత్ర పోషించారు. అయితే, ఇప్పుడు వారి మ‌నసు మారిందా ? కొత్త నాయ‌క‌త్వానికి వారు ఎదురు చూస్తున్నారా ? చంద్రబాబు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారా ? అంటే.. తాజా ప‌రిణామాల‌ను, వారి వ్యూహాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి టీడీపీలో క‌మ్మ నాయ‌కులు బ‌డా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు. వారు ఏరికోరి చంద్రబాబును నాయ‌కుడిని చేశారు.

బాబు నాయకత్వానికి…..

నిజానికి చంద్రబాబు వ్యూహంతో ముందుకు సాగినా.. ఆయ‌న వ‌ల్ల ల‌బ్ధిపొందిన వారు క‌మ్మలే. దీంతో వారంతా నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా బాబును ఫాలో అయ్యారు. చంద్రబాబు వారిని కోరినా కోర‌క పోయినా.. వారంతా బాబుకు మ‌ద్దతుగా చ‌క్రం తిప్పారు. కానీ, ఇప్పుడు వారు మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు త‌ర్వాత పార్టీ ప‌గ్గాల‌ను స్వీక‌రించేది చిన్నబాబు లోకేషేన‌ని దాదాపుగా ఖ‌రారైన నేప‌థ్యంలో ఆయ‌న నాయ‌క‌త్వంలో వీరు ప‌నిచేసేందుకు సుత‌రాము ఇష్ట ప‌డ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్లేస్‌ను రీప్లేస్ చేయ‌గ‌ల నాయ‌కుడు ఎవ‌రైనా.. ఏ పార్టీలో ఉన్నా.. బ‌య‌ట‌కు వ‌స్తే.. తాము మ‌ద్దతిస్తామ‌నే ధోర‌ణిలో ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది.

వైసీపీలోని నేతలు కూడా……

ఈ క్రమంలో అంద‌రి చూపూ ఇద్దరు కీల‌క వ్యక్తుల‌పై ఉంద‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది. కేవ‌లం టీడీపీలో ఉన్న క‌మ్మలే కాదు.. వైసీపీలో ఉన్న క‌మ్మలు కూడా క‌మ్మల్లో స‌మ‌ర్థుడు అయిన నేత దొరికితే చాలు ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌ని చేసేందుకు రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గ‌త వారం రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లోనూ.. ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలోని పారిశ్రామిక‌వేత్తలు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్తల్లో ఈ ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. ఎవ‌రో ఎందుకు ప్రస్తుతం వైసీపీలో ఉన్న మంత్రి కొడాలి నాని విష‌యానికే వ‌స్తే ఆయ‌న వైసీపీలో ఉన్నప్పటికీ..(టీడీపీ సానుభూతి ప‌రుడే..కొద్ది మందికి మాత్రమే ఆయ‌న వ్యతిరేకం.) టీడీపీలోని క‌మ్మల‌కు ఆయ‌నంటే ప్రత్యేక అభిమానం. పైగా ఆయ‌న నంద‌మూరి ఫ్యామిలీని ఎప్పుడూ విమ‌ర్శించ‌లేదు.

బాబు వెంటే నడిచి…..

ఇలాంటి నేత‌లు అంద‌రూ చంద్రబాబుకే వ్యతిరేకం… ఈ వ‌ర్గంలో మ‌రో బ‌ల‌మై నేత ఎవ‌రైనా వ‌స్తే ఎప్పుడైనా గోడ దూక‌డంలో పెద్ద ఆశ్చర్యప‌డాల్సిన ప‌నిలేద‌న్న టాక్ ఉంది. వాస్తవానికి గ‌త రెండు ద‌శాబ్దాల రాజ‌కీయం చూస్తే క‌మ్మల వెన‌క చంద్రబాబు ప‌డ్డాడు అన‌డం కంటే బాబు వెంటే క‌మ్మలు న‌డిచారు. అవి వారి రాజ‌కీయ అవ‌స‌రాలు కావొచ్చు… వ్యాపార, ఇత‌ర‌త్రా అవ‌సరాలు కావ‌చ్చు. అయితే ఇప్పుడు ఈ పంథా మారుతోంది. చంద్రబాబుతో న‌డిస్తే రాజ‌కీయంగానే కాకుండా అన్ని విధాలా న‌ష్టపోవ‌డం ఖాయం అన్న నిర్ణయానికి వ‌చ్చేశారు. ఇక ఇప్పుడు వీరంతా బ‌ల‌మైన క‌మ్మ నేత ( నాయ‌క‌త్వ ప‌టిమ ఉన్న వ్యక్తి) కోసం అర్రులు చాచుకుని ఎదురు చూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కోసం…..?

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ వ‌ర్గంలో ఆ స్థాయి నేతలు ఎవ్వరూ లేరు. వీళ్లంద‌రు ఆశ‌లు పెట్టుకున్న ఒకే ఒక వ్యక్తి జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఆయ‌న ప్రస్తుతం సినిమాల్లో ఉన్నారు. ఆయ‌న వ‌చ్చి టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టినా.. పార్టీలో క‌మ్మ హ‌వా పెరుగుతుంద‌ని.. అంటున్నారు. యువ‌త ఎక్కువుగా ఎన్టీఆర్ నాయ‌క‌త్వం కోరుతోంది. అయితే, ఆయ‌న ఇప్పట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ఒక‌నాడు చంద్రబాబు మోసిన క‌మ్మ బోయీలే.. ఇప్పుడు బాబు ప‌ల్లకిని దించేస్తామ‌ని.. మ‌రో నేత కోసం ఎదురు చూస్తుండ‌డం రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తిని రేపుతోంది. వీరి అంస‌తృప్తిని త‌గ్గించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారా? లేదా.. ఏమైతే. అది అవుతుంద‌ని చూస్తూ.. ఊరుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News