పదవులు ఇచ్చినా పలకరేమిటో ?

మొత్తానికి చంద్రబాబు పార్టీ పదవులు పంచేశారు. తాను కోరుకున్న వారికే కిరీటం పెట్టారు. బుద్ధిగా పనిచేసుకోమని చెప్పారు. కానీ పదవులు తీసుకున్న నేతల ముఖాలతో సంతోషం కనిపించడంలేదు. [more]

Update: 2020-10-20 11:00 GMT

మొత్తానికి చంద్రబాబు పార్టీ పదవులు పంచేశారు. తాను కోరుకున్న వారికే కిరీటం పెట్టారు. బుద్ధిగా పనిచేసుకోమని చెప్పారు. కానీ పదవులు తీసుకున్న నేతల ముఖాలతో సంతోషం కనిపించడంలేదు. పైగా వారు బాధ్యతలు తీసుకునేందుకు చొరవ చూపించడంలేదు. మళ్ళీ యధాప్రకారం నిర్లిప్తత పార్టీ మొత్తానికి ఆవహించి ఉంది. దానికి కారణం ఏంటి అంటే పార్టీ అజెండా వేరేగా ఉండడం, లోకల్ గా నేతలకు ఇబ్బంది కలిగే విధంగా నాయకత్వం ఆదేశాలు జారీ చేయడం. దీంతో ఎవరూ ముందుకొచ్చి పార్టీ తరఫున మాట్లాడడంలేదు అంటున్నారు.

అమరావతితోనే అంతా….

అమరావతి రాజధాని గురించి విశాఖ వీధుల్లో చెబితే జనం హర్షిస్తారా. అసలు ఒప్పుకోరు. నిజానికి విశాఖను పాలనరాజ‌ధానిని చేయకుండా ఉంటే తమ్ముళ్ళు గొంతు విప్పేవారు కానీ సొంత ప్రాంతాన్ని కాదని ఎక్కడో అమరావతి పేరిట నిరసనలు చేస్తామంటే జనంలో పలుకుబడి ఉంటుందా. ఇలా కచ్చితంగా చేయాల్సిందేనని హై కమాండ్ హుకుం జారీ చేయడంతో తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అందుకే ఎవరూ చంద్రబాబు పిలుపు ఇచ్చినా స్పందించలేదు. ఎందుకొచ్చిన పదవులు అంటూ వైరాగ్యం కూడా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి బాధను అనుభవించే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగి వైసీపీ వైపుగా వెళ్ళిపోయాడని చెబుతారు.

గప్ చిప్ గా ….

ఇక విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని అధినాయకత్వం ఎంపిక చేసింది. ఆయన ఇప్పటిదాకా విశాఖ పార్టీ ఆఫీస్ ముఖం చూడలేదు. ఆయన అక్కడికి రాను అంటున్నారు. తన సొంత ఆఫీస్ లోనే ఉంటానని చెబుతున్నారు. ఎవరైనా వస్తే తనను అక్కడే కలవాలని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు పార్టీ నాయకులకు మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. ఇక పల్లా కూడా ఏమంత జోష్ గా లేరు తాను అడగకుండానే చంద్రబాబు పార్టీ పదవి ఇచ్చారు. అలాగే తాను కూడా మొక్కుబడిగానే పార్టీని నడిపించాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఈయన బాటలోనే విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ కిమిడి నాగార్జున ఉన్నారు. ఆయనకు పార్టీ నేతలతో పెద్దగా సంబంధాలు లేవు. కళా వెంకటరావు రికమండేషన్ తో పదవి వచ్చింది. దాంతో సైకిల్ ఎలా తొక్కాలో అర్ధం కావడంలేదుట.

హుషారేదీ …?

ఉత్తరాంధ్రా లాంటి గట్టి చోట తమ్ముళ్లు గతంలో ఎలా ఉండేవారు, ఇపుడు ఎలా ఉంటున్నారు అన్నది కనుక బేరీజు వేసి చూస్తే నిరాశే సమాధానం అవుతుంది. పార్టీ కాడె వదిలేసిన సీనియర్లు ఓ వైపు ఉంటే పదవుల మీద ఆశలు పెంచుకున్న వారు మరో వైపు అవి దక్కక అసంతృప్తితో ఉంటున్నారు. మరికొందరికి జాక్ పాట్ లా పదవి తగిలినా వారికి ఏం చేయాలో పాలుపోక చోద్యం చూస్తున్నారు. మొత్తానికి కంచుకోట లాంటి మూడు జిల్లాల్లో పార్టీకి దశ దిశా అన్నది లేదని అర్ధమవుతోంది. మూడు జిల్లాల్లో కాస్తా పెద్ద నోరు చేసుకుని మాట్లాడేది ఒక్క అయ్యన్నపాత్రుడే. మరి చంద్రబాబు ఆరాటమే కానీ తమ్ముళ్ల పోరాటం మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నది అసలైన వాస్తవం.

Similar News