వారికి బాబు భరోసా… గో అహెడ్ అని పిలుపు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ కమిటీలను నియమించారు. సమన్వయ కర్తలనూ అపాయింట్ మెంట్ చేశారు. ఎక్కువగా ఈ నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో టీడీపీలో [more]

Update: 2020-10-25 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ కమిటీలను నియమించారు. సమన్వయ కర్తలనూ అపాయింట్ మెంట్ చేశారు. ఎక్కువగా ఈ నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో టీడీపీలో మళ్లీ కొత్త జోష్ నెలకొంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల నియమితులైన నేతలు బాధ్యతలను స్వీకరించారు. కొన్ని చోట్ల నియామకాలపై అసంతృప్తులు నెలకొన్నా అవి సర్దుకుపోతాయని చంద్రబాబు భావిస్తున్నారు.

నిధుల సమస్యతో….

అయితే ప్రస్తుతం నియమితులైన నేతలు నిధుల సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారు కావడంతో ఎన్నికల్లో ఖర్చు చేయడం, ఇప్పుడు ఈ పదవి దక్కడంతో ఖర్చుకు జడుస్తున్నారు. దాదాపు పది పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు చంద్రబాబు గుర్తించినట్లు తెలుస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఖచ్చితంగా చేపట్టాల్సి ఉంది. ఇందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది.

క్లారిటీ ఇచ్చిన బాబు….

దీనిపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చుల కోసం ఎవరూ వెనకాడవద్దని, కేంద్ర కార్యాలయం చూసుకుంటుందని చంద్రబాబు కొందరు నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ముందు జనంలోకి వైసీపీ చేస్తున్న ప్రతి తప్పును తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఖర్చుకు దడిచి ఎవరూ ముందుకు రావడం లేదని కొందరు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

ప్రజలకు అందుబాటులో…..

గతంలో మాదిరిగా పార్టీని యాక్టివ్ చేయాలని, నిధులను కేంద్ర పార్టీ కార్యాలయం చూసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు పార్లమెంటరీ నియోజకవర్గ నేతలు నిర్ణీత వేళల్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని, వారి సమస్యలను విని అవసరమైతే ఆందోళన చేయాలని తెలిపారు. కరోనా కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నానని చంద్రబాబు నేతలకు తెలిపారు. మొత్తం మీద పార్టీ కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర పార్టీ కార్యాలయం చూసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో నియమితులైన నేతలు ఊపిరి పీల్చుకున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News