అసలు ఆంతర్యం అదేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే ఇటీవల కాలంలో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందిందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. [more]

Update: 2020-10-10 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే ఇటీవల కాలంలో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందిందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. 2022 లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు వస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా జమిలి ఎన్నికలు వస్తాయా? లేక క్యాడర్ ను కాపాడుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమా? అన్నది చర్చనీయాంశమైంది.

మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత….

జమిలి ఎన్నికల అంశం రెండోసారి మోదీ అధికారంలో వచ్చిన నాటి నుంచి నలుగుతూనే ఉంది. 2022 లో జమిలి ఎన్నికలను నిర్వహించి దేశంలో ఇక ఎన్నికలు లేకుండా చేయాలన్నది మోదీ ఆలోచనగా ఉంది. ఇది ఆలోచన మాత్రమేనంటున్నాయి ఢిల్లీ వర్గాలు. దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు చేస్తున్నప్పటికీ అది అమలు కావాలంటే కష్టసాధ్యమన్నది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో రెండేళ్లు ముందే ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు.

కనీసం సగం రాష్ట్రాలు…..

జమిలి ఎన్నికలు రావాలంటే అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఒకే చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటులో బలం ఉంది కాబట్టి చట్టం తీసుకువచ్చే వీలుంది. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీనికి విపక్షాలు సహకరించాల్సి ఉంటుంది. ఇక బీహార్ లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా 2021 లోపే దాదాపు ఐదారు ప్రధాన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పూర్తవుతాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఖచ్చితమైన సమాచారమేనంటూ…..

కానీ చంద్రబాబుకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పెద్దల నుంచి వచ్చిన న్యూస్ గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు అధికారుల అందించిన సమాచారం మేరకే ఆయన జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం 2022 లో జమిలి ఎన్నికలు జరిగితే తమకు ప్రజలు ఇచ్చిన పదవి కాలం రెండేళ్లు ఉంటుందని, తాము ఎలా అంగీకరిస్తామని అంటున్నారు. తమకు ఢిల్లీ పెద్దల నుంచి అలాంటి సంకేతాలు లేవని వైసీపీ నేతలే ధీమాగా చెబుతున్నారు. మరి చంద్రబాబు జమిలి ఎన్నికల వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News