ఇక్కడ మాత్రం లెక్కలు కుదరడం లేదట

రాజ‌కీయాల్లో నేత‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింప‌డం ఇప్పుడు కొత్తకాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, ఈ వార‌సులు ఎక్కువ కావ‌డం.. నియోజ‌క‌వ‌ర్గాలు కొన్నే కావ‌డం, టీడీపీ [more]

Update: 2020-10-10 02:00 GMT

రాజ‌కీయాల్లో నేత‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింప‌డం ఇప్పుడు కొత్తకాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, ఈ వార‌సులు ఎక్కువ కావ‌డం.. నియోజ‌క‌వ‌ర్గాలు కొన్నే కావ‌డం, టీడీపీ అధినేత చంద్రబాబు వాటిపై దృష్టి పెట్టక‌పోవ‌డంతో వార‌సుల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని చెప్పడంలో సందేహం లేదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న వార‌సులతో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని భావించినా.. లెక్కలు కుద‌ర‌క‌పోవ‌డంతో ఎక్కడిక‌క్కడ పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న కృష్ణాజిల్లాలో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బుద్ధప్రసాద్ తనయుడు…….

మాజా డిప్యూటీ స్పీక‌ర్‌, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మండ‌లి బుద్ధ ప్రసాద్‌.. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు సాధించారు. ఆయ‌న ఏ పార్టీ టికెట్‌పై పోటీ చేసినా .. విజ‌యం సాధిస్తార‌నే పేరు సంపాయిం చుకున్నారు. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్కడ విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. కానీ, వాస్తవానికి త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌ని భావించారు. కానీ, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దీంతో ఆయ‌న పార్టీలో యాక్టివ్‌గా లేక‌పోగా.. నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బుద్ధ ప్రసాద్ త‌న‌యుడు విజ‌య‌వాడ‌లో మ‌కాం ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామం తీవ్రంగా పార్టీని ఇబ్బందిలోని నెడుతోంది.

వ్యక్తిగత ఇమేజ్ కోసం…….

ఈ క్రమంలోనే త‌న వార‌సుడి రాజ‌కీయ భ‌విష్యత్తుపై సైతం మండ‌లికి ఎక్కడా లేని టెన్షన్ పట్టుకుంద‌ట‌. ఇక‌, విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ కేశినేని నాని త‌న వార‌సురాలిగా కుమార్తె శ్వేత‌ను రంగంలోకి దింపారు. ఆమెకు చంద్రబాబు నుంచి కూడా స‌హ‌కారం ఉంది. టీడీపీ త‌ర‌పున మేయ‌ర్ పీఠాన్ని ఆమెకే కేటాయించారు. అయితే, పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగ‌తంగా ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

వారసులకు నో చెప్పడంతో…..

ఇక‌, బెజ‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుబ‌ట్టి త‌న కుమార్తె.. ష‌బానా ఖ‌తూన్‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇప్పించుకున్నారు మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. కానీ, ఆమె ఓడిపోయిన త‌ర్వాత‌..తిరిగి అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ ఎవ‌రూ పార్టీని ప‌ట్టించుకునేవారు లేకుండా పోవ‌డం ఒక మైన‌స్ అయితే.. జ‌లీల్ వార‌సురాలి రాజ‌కీయం ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం పెడ‌న‌. ఇక్క‌డ కొన్నేళ్లుగా పార్టీకి కీల‌కంగా ఉన్న కాగిత వెంక‌ట్రావు కుమారుడు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఈ టికెట్‌ను త‌న కుమారుడికి ఇప్పించుకునేందుకు మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ గ‌ట్టి ప్రయ‌త్నాలే చేశారు. కానీ, ద‌క్కలేదు.

కాగిత వర్సెస్ కొనకళ్ల…..

ఇక‌, ఇప్పుడు కొన‌క‌ళ్లకు మ‌చిలీప‌ట్నం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెడ‌న టికెట్‌ను త‌న కుమారుడికి ఇప్పించుకునే ప్రయ‌త్నం జోరుగా చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది అటు కాగిత‌, ఇటు కొన‌క‌ళ్ల కుటుంబాల మ‌ధ్య పెడ‌న ప‌గ్గాల కోసం యుద్ధానికి దారి తీసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి జిల్లాలో వార‌సుల తీరుతో పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

Tags:    

Similar News