ఇద్దరినీ పక్కన పెట్టేసినట్లేనా?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప‌ర్వం పూర్తయింది. ముఖ్యమైన నేత‌ల‌తోపాటు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు [more]

Update: 2020-09-30 05:00 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప‌ర్వం పూర్తయింది. ముఖ్యమైన నేత‌ల‌తోపాటు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు కూడా చంద్రబాబు న్యాయం చేశార‌నే వాద‌న ఉంది. అయితే, జిల్లాల వారీగా ప‌రిస్థితి చూస్తే.. కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీకి అంకిత‌మైన నాయ‌కుల‌ను, కుటుంబాల‌ను ఈ ప‌ద‌వులకు ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై మాత్రం అసంతృప్తి కూడా అదే రేంజ్‌లో ఉంది. అనంత‌పురం జిల్లాను తీసుకుంటే.. ప‌రిటాల కుటుంబం ఆది నుంచి టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉంది.

ఎన్నికల ఫలితాల తర్వాత…..

రాజ‌కీయంగా ఆర్థికంగా కూడా పార్టీకి ప‌రిటాల ఫ్యామిలీ ద‌న్నుగా నిలుస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు అడిగితే.. చంద్రబాబు రాప్తాడు ఒక్కటే శ్రీరాంకు ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత నుంచి చంద్రబాబు ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకోలేదు. పార్టీ ఘోర ఓట‌మి త‌ర్వాత ధ‌ర్మవ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరీ బీజేపీలోకి వెళ్లగా అప్పుడు అక్కడ పార్టీ జెండా పట్టే నాథుడే లేక‌పోవ‌డంతో ధ‌ర్మవ‌రం, రాప్తాడు రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ప‌రిటాల ఫ్యామిలీకే అని బాబు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయినా ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఖ‌ర్చులు, బాధ‌లు మాకెందుకులే అని లైట్ తీస్కోవ‌డ‌మే కాదు.. చివ‌ర‌కు రాప్తాడుకే దూరం దూరంగా ఉంటోంది.

పరిటాల శ్రీరామ్ కు…..

ఇక‌, జేసీ కుటుంబానికి అంటే.. కేవ‌లం 2014 ఎన్నిక‌ల‌కు ముందు మాత్రమే జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. అయితే, వీరికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోను, 2014 ఎన్నిక‌ల్లోనూ రెండు టికెట్లు ఇచ్చారు. దీనిపై ప‌రిటాల ఫ్యామిలీ పైకి చెప్పక‌పోయినా.. ఆగ్రహంతోనే ఉంది. పార్టీకి ఆదినుంచి మేం సేవ చేస్తున్నాం..రాజ‌కీయంగా మేం కుటుంబ పెద్దను కూడా కోల్పోయాం. అయినా.. మాకు గుర్తింపు లేదు. అని ఈ ఫ్యామిలీ ఆవేద‌నతో పాటు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీలు ఏర్పాటు చేస్తున్నారు క‌నుక మాజీ మంత్రి ప‌రిటాల సునీత త‌న‌కు త‌ప్పకుండా న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. ప‌రిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వలేదు.

పట్టించుకోకపోవడంతో…

ఇక‌, జేసీ కుటుంబం కూడా ఇటీవ‌ల కాలంలో కేసుల్లో చిక్కుకున్నా… త‌మ‌ను చంద్రబాబు ప‌ట్టించుకోలేద‌నే ఆవేద‌న‌ను వ్యక్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో త‌మ‌ను ప‌ట్టించుకుంటార‌ని, ఇప్పటికైనా గుర్తింపు ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణయంలో ఈ రెండు కుటుంబాల‌ను కూడా చంద్రబాబు ప‌క్కన పెట్టారు. దీంతో ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు మ‌రింత ఆవేద‌న‌కు గుర‌య్యాయి. పైకి ఎలాంటి కామెంట్లు చేయ‌క‌పోయినా.. పార్టీకి మా అవ‌స‌రం లేద‌నుకుంటా! అనే అంత‌ర్గత ఆవేద‌న మాత్రం క‌నిపిస్తోంది.

మించిన పదవులు….

దీంతో ఇప్పుడు కిం క‌ర్తవ్యం అని ఈ రెండు ఫ్యామిలీలు త‌ర్జ‌న భ‌ర్జన‌ప‌డుతున్నాయి. మ‌రోప‌క్క, వీటిని మించిన ప‌ద‌వులు ఇస్తారేమో.. అని చంద్రబాబుకు స‌న్నిహితంగా ఉండే జిల్లా నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. అయినా.. వీటిని మించిన ప‌ద‌వులు ఏముంటాయి? అనే ప్రశ్న కూడా తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News