చంద్రబాబు అందుకే ఆ డిమాండ్ చేయడం లేదా?

టీడీపీ అధినేత చంద్రబాబు.. వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. ఇటీవ‌ల మృతిచెందిన‌ ప్రముఖ గాయ‌కులు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం విష‌యంలో చంద్రబాబు అంద‌రిక‌న్నా ముందుగా ఓ ప్రతిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. ఆయ‌న [more]

Update: 2020-10-06 06:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు.. వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. ఇటీవ‌ల మృతిచెందిన‌ ప్రముఖ గాయ‌కులు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం విష‌యంలో చంద్రబాబు అంద‌రిక‌న్నా ముందుగా ఓ ప్రతిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. ఆయ‌న పేరిట రాష్ట్రంలో సంగీత విశ్వవిద్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ.. సీఎం జ‌గ‌న్‌కు విజ్ఞప్తి చేశారు. నిజానికి ఈ ప్రతిపాద‌న మంచిదే. అయితే, చంద్రబాబు వంటి కీల‌క నేత స్థాయికి ఈమాత్రమేనా.. బాలు విష‌యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేది ? అనేది కీల‌క ప్రశ్న.

బాలు విషయంలో…….

బాలు విష‌యంలో చంద్రబాబు వంటి సీనియ‌ర్ నాయ‌కుడు, మేధావి.. బాలుతోనూ స‌త్సంబంధాలు ఉన్ననాయ‌కుడు కోరాల్సింది.. విశ్వవిద్యాల‌యం మాత్రమేనా ? ఇంకా ఏమీలేవా ? అంటే.. ఉంది.. అదే భార‌తర‌త్న.. ఇప్పటి వ‌ర‌కు ఎస్పీ బాలుకు కేంద్రం నుంచి ప‌ద్మశ్రీ వ‌రించింది. అదేవిధంగా ఆయ‌న ప్రతిభ‌కు ప‌ద్మభూష‌ణ్ మ‌ర‌క‌త‌మ‌ణిగా భాసించింది. కానీ, ఇప్పటి వ‌ర‌కు ద‌క్కనిది.. భార‌తర‌త్న. ఈ అవార్డు విష‌యంలో చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే.. బ‌తికి ఉండ‌గా.. ఈ అవార్డు ఇవ్వర‌ని, చ‌నిపోయిన త‌ర్వాతే ఇస్తార‌ని.

బతికి ఉన్నప్పుడే…..

కానీ, ఇది పూర్తిగా అవ‌గాహ‌న రాహిత్యం. ల‌తామంగేష్కర్ ఇంకా జీవించి ఉన్నారు. ఆమెకు భార‌త ర‌త్న ఇచ్చారు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్‌కు కూడా భార‌తర‌త్న ఇచ్చారు. ఇలా జీవించి ఉన్నవారికి కూడా ద‌క్కాయి. అదేవిధంగా ఎస్పీబాలుకు కూడా జీవించి ఉన్న స‌మయంలో ఈ అవార్డు ద‌క్కాలని ఒక‌ప్పుడు సంగీత అభిమానుల నుంచి డిమాండ్ వ‌చ్చింది. ఎన్నో భాష‌ల్లో ఏకంగా 40 వేల పైచిలుకు పాట‌లు పాడ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అయితే, దీనిని ఎవ‌రూ ఢిల్లీ వ‌ర‌కు తీసుకువెళ్లలేక‌పోయారు. ఇక‌, ఇప్పుడు చంద్రబాబువంటి నాయ‌కులు బాలు విష‌యంలో భార‌త ర‌త్న కోర‌క‌పోవ‌డం కూడా ఇలాంటిదే.

అసలు ఉద్దేశ్యం అది కాకకపోయినా…

బాలుకు భార‌త‌రత్న ఇవ్వకూడ‌ద‌ని కానీ, ఆయ‌న ఆ అవార్డుకు అర్హులు కాద‌ని.. చంద్రబాబు ఉద్దేశం కాదు. కానీ, బాలుకు భార‌తర‌త్న ఇవ్వాల‌ని ఆయ‌న కోరితే.. వెంట‌నే టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు, ఆయ‌న సొంత మామ గారు ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇప్పించుకోలేక పోయార‌నే విమ‌ర్శలు చంద్రబాబును చుట్టుముట్టడం ఖాయం. పైగా ఈ విష‌యంపైనా కేంద్రానికి అనేక సంద‌ర్భాల్లో చంద్రబాబు లేఖ‌రాశారు. అయినా.. ఫ‌లించ‌లేదు. దీంతో ఈ అవార్డు విష‌యాన్ని చంద్రబాబు మ‌రిచిపోయారు. దీంతో ఇప్పుడు బాలు విష‌యంలో ఈ అవార్డు విష‌యాన్ని లేవ‌నెత్తితే.. ఇబ్బందులు త‌ప్పవ‌ని గ్ర‌హించి వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. అయితే, సీఎం జ‌గ‌న్.. బాలుకు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని కోరుతూ.. కేంద్రానికి లేఖ రాయ‌డాన్ని సంగీతాభిమానులు స్వాగ‌తిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు రాజ‌కీయంగానే కాకుండా అన్ని విధాలా ప్లస్ అయ్యింది. కేంద్రం ఇప్పటికైనా ఈ విష‌యంలో రాజ‌కీయాలు వ‌దిలి.. బాలుకు భార‌త ర‌త్న ఇస్తే.. ఈ దేశ‌మే గ‌ర్విస్తుంద‌ని చెప్పక‌త‌ప్పదు.

Tags:    

Similar News