మళ్లీ అదే ప్రయోగం… సక్సెస్ అవుతారా?

ఉత్తరాంధ్రలో వైసీపీతో సమరానికి చంద్రబాబు బీసీ కార్డునే నమ్ముకున్నారు. అలాగే జగన్ అనుసరించిన ఫార్ములాతో ఆయన ఢీ కొట్టాలనుకుంటున్నారు. బలమైన సామాజికవర్గాలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా [more]

Update: 2020-10-10 13:30 GMT

ఉత్తరాంధ్రలో వైసీపీతో సమరానికి చంద్రబాబు బీసీ కార్డునే నమ్ముకున్నారు. అలాగే జగన్ అనుసరించిన ఫార్ములాతో ఆయన ఢీ కొట్టాలనుకుంటున్నారు. బలమైన సామాజికవర్గాలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా బీసీ పార్టీగా తన ట్యాగ్ కాపాడుకోవాలనుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు వేసిన పార్టీ కమిటీల తీరును చూస్తే ఇదే స్పష్టం అవుతోంది. పైగా తొలిసారిగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని టీడీపీ కమిటీలను ఆయన వేయడం విశేషం, రేపటి రోజున ఇవే కొత్త జిల్లాలు అవుతాయని చంద్రబాబు భావించే ముందుగా కార్యవర్గాలను రెడీ చేసి పెట్టారు.

ప్రధాన సామాజిక‌ వర్గాలకే….

చంద్రబాబు ఎపుడూ ప్రధాన సామాజికవర్గాలను బీసీలో చూసుకుని మరీ పదవులు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇపుడు కూడా అదే ప్రయోగం మరో మారు చేశారు. ఇకపోతే శ్రీకాకుళంలో వెలమలతో వైరం పెట్టుకుని వైసీపీకి జై కొట్టిన కాళింగ సామాజికవర్గానికి ఈసారి పెద్ద పీట వేశారు. కూన రవికుమార్ ని ఆయన జిల్లా ప్రెసిడెంట్ ని చేయడం ద్వారా ఆ వర్గానికి టీడీపీ సముచిత ప్రాధ్యాన్యత ఇస్తోందని భరోసా ఇచ్చారు. ఇక విజయన‌గరం జిల్లాలో తూర్పు కాపులది ఆధిపత్యం. దాంతో సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు తమ్ముడు కొడుకు అయిన కిమిడి నాగార్జునకు జిల్లా కిరీటం పెట్టారు. దాంతో అదే సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు ప్లాన్ వేశారు.

వైసీపీకి ధీటుగా….

ఇక విశాఖ అర్బన్ జిల్లా పెసిడెంట్ గా వైసీపీలో యాదవ సామాజికవర్గానికి చెందిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఉన్నారు. దాంతో ఆయనతో ఢీ కొట్టే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు టీడీపీ ప్రెసిడెంట్ పదవిని అప్పచెప్పింది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ని ఈ పదవిలోకి తీసుకోవడం ద్వారా విశాఖ పార్లమెంట్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ వర్గానికి చెందిన యాదవుల మద్దతు పొందవచ్చునని చంద్రబాబు వ్యూహ రచన చేశారనుకోవాలి. అలాగే అనకాపల్లి పార్లమెంట్ సీటులో గవర్లదే ఆధిపత్యం. దాంతో గవర సామాజికవర్గానికి ప్రాముఖ్యత ఇస్తూ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావుకు అవకాశంఇచ్చారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి అరకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎస్టీల మద్దతు పొందే ప్రయత్నం చేశారనుకోవాలి.

వారికీ చోటు….

ఇక ప్రతీ రెండు జిల్లాలకు ఒక కో ఆర్డినేటర్ ని నియమించడం ద్వారా సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చారు. అలా ఓసీ కాపులకు విశాఖలో పెద్ద పీట వేశారు. యాదవుల తరువాత కాపులే విశాఖలో పెద్ద ఎత్తున ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్పను విశాఖ ఇంచార్జిగా నియమించడంలోని ఆంతర్యం అదే. అలాగే బీసీ వెలమగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారయాణ మూర్తిని కాకినాడ అమలాపురం ఇంచార్జిని చేశారు. విజయనగరం కి చెందిన బీసీ కాపు కొండపల్లి అప్పలనాయుడుకి మచిలీపట్నం, గుంటూరు బాధ్యతలు అప్పగించారు. ఇక విశాఖకు చెందిన గవర సామాజికవర్గానికి చెందిన సీనీయర్ ఎమ్మెల్యే గణబాబుని విజయనగరం, శ్రీకాకుళం ఇంచార్జిగా చేసి సమతూకం పాటించాను అనిపించుకున్నారు. మొత్తానికి బీసీ వీరులను తయారుచేసుకుని ఉత్తరాంధ్ర కంచుకోట కాపాడుకోవడానికి చంద్రబాబు పూర్తిగా రెడీ అయ్యారన్నమాట.

Tags:    

Similar News