బాబు పేరిట బ్లాక్ మెయిలింగ్ ?

చంద్రబాబు ఫక్త్ రాజకీయ నేత. ఆయన ఈ రోజు రాజకీయమే చూసుకుంటారు. నిన్న ఎవరిని ఏమన్నాం, వారితో మళ్ళీ చేయి కలిపితే జనం ఏమనుకుంటారు ఇలాంటివి పట్టింపులు [more]

Update: 2020-10-03 00:30 GMT

చంద్రబాబు ఫక్త్ రాజకీయ నేత. ఆయన ఈ రోజు రాజకీయమే చూసుకుంటారు. నిన్న ఎవరిని ఏమన్నాం, వారితో మళ్ళీ చేయి కలిపితే జనం ఏమనుకుంటారు ఇలాంటివి పట్టింపులు లేవు. శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరని చంద్రబాబు నమ్మే పరమ సత్యం. అయితే అదే ఆయనకు కొన్ని సార్లు ప్లస్ అయితే ఇపుడున్న డిజిటల్ యుగంలో మైనస్ అవుతోంది. ఎందుకంటే చంద్రబాబు ఫలానా నాయకుడిని అలా తిట్టారు అన్నది వీడియో సాక్ష్యంగా అక్కడ దొరికిపోతోంది. దాంతో సగటు జనాలు బాబు రాజకీయాన్ని చూసి అయిష్టత పెంచుకునే దాకా వెళ్తోంది. ఇదిలా ఉంటే ఎవరేమనుకున్నా చంద్రబాబు తన రాజకీయం ఆపరు. ఆయన సమయం కోసం చూస్తారు. జనాలు ఎపుడెలా ఉంటారో ఎవరికి తెలుసు. మనం ఎలాగోలా విజయం సాధిస్తే వారే మళ్లీ దారికి వస్తారు. ఇది కూడా చంద్రబాబు థియరీయే.

తిరిగి కలిసేనా…..

మోడీ, అమిత్ షా ఎన్డీయే డోర్లు చంద్రబాబుకు వేసేశాం అని చెప్పేశారు. ఇక బాబు ముఖం చూడమని సోము వీర్రాజు కూడా ప్రతీ రోజూ అంటున్నారు. కానీ ముందే చెప్పుకున్నట్లు చంద్రబాబు ఆశావాది. రాజకీయాల్లో నిన్నలా నేడు ఉండదు, పైగా ఎవరి అవసరం ఎపుడు వస్తుందో తెలియదు, అందుకే ఆయన బీజేపీ తో పొత్తు కోసం కాచుకకుని కూర్చున్నారు. మోడీని, అమిత్ షాను పల్లెత్తు మాట అనకుండా తన బాణాలన్నీ కూడా జగన్ మీదనే వేస్తున్నారు.

సుసాధ్యమేనా…?

మరో వైపు చూసుకుంటే కేసీయార్ కి చంద్రబాబుకు అసలు పడదు అంటారు. ఓటుకు నోటు కేసు తరువాత అయిదేళ్ళుగా ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నది లేదు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఏపీలో జగన్ని కేసీయార్ గట్టిగా ద్వేషిస్తున్నారు. ఆయన వల్లనే తన ఫెడరల్ ఫ్రంట్ ముందుకు సాగడంలేదని భావిస్తున్నారు. అందువల్ల చంద్రబాబుతో ఎటూ మంచి బంధమే గతంలో ఉంది కదా. దాన్ని పదును పెడితే బాగానే ఉంటుంది అన్న ఆలోచన కనుక చేస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉందిట.

ఇరకాటమేనా ….?

చంద్రబాబు వరకూ చూసుకుంటే ఎవరితోనైనా కలసిపోగలడు. కానీ అటు మోడీ కానీ, ఇటు కేసీయార్ కానీ ఎంతవరకూ బాబుతో కరచాలనం చేస్తారు అన్నదే పెద్ద ప్రశ్న. అయితే అది జరిగినా జరగకపోయినా జగన్ని అలా చెప్పి దారికి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. చంద్రబాబుతో దోస్తీకైనా రెడీ, ఫెడరల్ ఫ్రంట్ రధాన్ని ముందుకు తీసుకుపోతామని ఓ వైపు టీయారెస్ నుంచి సౌండ్స్ వస్తున్నాయట. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ కూడా జగన్ని తమతో కలవమ‌ని అంటోంది. లేకపోతే ఎటూ చంద్రబాబు ఉన్నాడని బూచిగా చూపిస్తోంది. మొత్తానికి జగన్ కి ఇపుడు అగ్ని పరీక్షే. తాను అనుకున్నట్లుగా కచ్చితంగా ఉంటే నిజంగా కొత్త పొత్తులతో చంద్రబాబు చెలరేగిపోతారేమోనని భయం. అలాగని బంధాలు గట్టి పరచుకుంటే రేపటి రోజున తన రాజకీయ పునాదులకే ఇబ్బందులు వస్తాయేమోనని కూడా ఆందోళన. మొత్తానికి చంద్రబాబు మళ్లీ జగన్ కి విలన్ గా ముందుకు వస్తున్నారు.

Tags:    

Similar News